KCR : మళ్లీ వచ్చేది మేమే!

ABN , First Publish Date - 2023-08-21T03:31:44+05:30 IST

రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అద్భుతంగా మరోసారి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదన్నారు.

KCR : మళ్లీ వచ్చేది మేమే!

గతంలో కంటే ఐదారు సీట్లు ఎక్కువే గెలుస్తాం..

సందేహమే అక్కర్లేదు: కేసీఆర్‌

నల్లగొండ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌(CM KCR) స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌(BRS) అద్భుతంగా మరోసారి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదన్నారు. అంతేకాదు.. ఈ సారి బీఆర్‌ఎ్‌సకు గతంలోకంటే ఐదారు సీట్లు ఎక్కువే వస్తాయనీ చెప్పారు. ‘ఎన్నికలొస్తే ఆగం కావద్దు. మన రాతను మనమే రాసుకునే గొప్ప ఆయుధమే ఓటు’ అని పేర్కొన్నారు. ఆదివారం సూర్యాపేట(Suryapet)లో రూ.407 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన ‘ప్రగతి నివేదన’ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ‘సభలో నేను చెప్పిన విషయాలను ఇక్కడే వదిలేయకుండా గ్రామాలకు పోయి చర్చ పెట్టండి. కాంగ్రెస్‌, బీజేపీ(Congress and BJP) నాయకులు కొత్తోళ్లు కాదు. వాళ్లు ఆకు పసరు తాగినట్టుంది. ఒక్క అవకాశం ఇవ్వండని అడుగుతున్నారు. 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏనాడైనా ప్రజల గురించి ఆలోచించారా?’ అని సభికులను ప్రశ్నించారు. ఏనాడైనా సూర్యాపేటలో కళాభారతి గురించి, నల్లగొండలో అభివృద్ధి పనుల గురించి మాట్లాడారా? అని అడిగారు. మళ్లీ వాళ్లు ఎందుకు ఓటు అడుగుతున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో రైతు చనిపోతే ఆపద్బంధు కింద రూ.50 వేల కోసం ఆరు నెలలు తిరిగినా రూ.10వేలో, రూ. 20వేలో ముఖాన కొట్టేవారని.. సాయం కోసం ఆఫీసులకు వెళ్తే కరిచినట్లు మాట్లాడేవారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారి కుటుంబం బజారున పడకుండా ఉండేందుకు ప్రభుత్వమే ప్రీమియం చె ల్లించి, రూ.5 లక్షల బీమా సొమ్ము అందిస్తోందన్నారు. కల్యాణలక్ష్మి(Kalyan Lakshmi) రూ.50 వేలతో ప్రారంభించి ఇప్పుడు రూ.లక్షకు పైగా అందిస్తున్నామని.. ఆసరా పింఛన్‌ను రూ.1000తో ప్రారంభించి 2 వేల వరకు తీసుకొచ్చామని చెప్పారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ రాజ్యంలో కేవలం రూ.200 పింఛన్‌ ఇచ్చేవారని గుర్తుచేశారు. అలాంటి కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే రూ.4 వేలు పింఛన్‌ ఇస్తామని చెబుతున్నారని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీ్‌సగఢ్‌, కర్ణాటక, రాజస్థాన్‌లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘వాడు రూ.4 వేలంటే నాకు 5 అనరాదా?’ అని వ్యాఖ్యానించారు. ము న్ముందు పింఛన్లు పెంచుతామని, ఈ విషయాన్ని రాబోయే రోజుల్లో ప్రకటిస్తానని కేసీఆర్‌ చెప్పారు.

ధరణి తీస్తే రైతుబంధు ఎలా రావాలి?

ధరణి(Dharani)ని రైతుల బాగు కోసం తెచ్చామని కేసీఆర్‌ అన్నారు. వీఆర్వోలు యల్లయ్య భూములు మల్లయ్యకు మల్లయ్య భూములను భూమయ్యకు రాసేవారని.. దాన్ని సరిదిద్దమని అడిగితే ‘ఒట్టిగనే అయితదా బావా’ అంటూ రైతులతో అంటుండేవారని గుర్తుచేశారు. ధరణి వల్ల 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని, 5 నిమిషాల్లో మ్యుటేషన్‌ పూర్తవుతుందని తెలిపారు. ధరణి అంటే ప్రభుత్వం వద్ద ఉన్న పవర్‌ను తొలగించి, రైతుల బొటనవేలుకు ఇవ్వడమేనని చెప్పారు. ధరణిని తీసేస్తామన్న వాళ్లను గంగలో కలపాలని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ వస్తే అంతే..

కాంగ్రెస్‌(Congress) వస్తే పైరవీకారులదే రాజ్యమవుతుందని, ఏ పని కోసం ఆఫీ్‌సకు వెళ్లినా రోజుల తరబడి వేచి ఉండాల్సిందేనని కేసీఆర్‌ అన్నారు. కాంగ్రె్‌సకు చెందిన ఓ పుణ్యాత్ముడు ఇటీవల జిల్లాలో పాదయాత్ర చేస్తూ సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు ఎక్కడ వచ్చా యో చూపించాలంటూ సవాల్‌ విసిరారని.. గ్రామగ్రామానికి వెళితే కాల్వల్లో పారుతూ కనిపిస్తాయని పరోక్షంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై విమర్శలు గుప్పించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తనతో కొట్లాడి, రూ.30 వేల కోట్లతో యాదాద్రి పవర్‌ ప్లాంటు నిర్మాణం చేయిస్తున్నారని తెలిపారు.

రుణమాఫీ చేసిన ఏకైక సర్కారు మాదే..

కరోనా రావడం, మోదీ నోట్ల రద్దు చేయడంతో ఆలస్యం జరిగినప్పటికీ రూ.37 వేల కోట్లతో రెండు విడతలుగా రైతుల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభు త్వం తమదేనని కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారని.. ఈ స్థాయిలో ధాన్యం ఉత్పత్తితో రాష్ట్రంలో ఉన్న రైస్‌ మిల్లులు కూడా సరిపోవడం లేదన్నారు. ఇంకో ఏడెనిమిదేళ్లలో భారతదేశం గర్వపడే విధంగా తెలంగాణ రైతులు అభివృద్ధి చెందుతారన్నారు.

ముందస్తు అరెస్టులు

సూర్యాపేట క్రైం: సీఎం పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా ఆదివారం తెల్లవారుజామునే అరెస్టు చేశారు. సీఎం సూర్యాపేట పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేశ్‌రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ప్రజాపంథా జిల్లా కన్వీనర్‌ కొత్తపల్లి శివకుమార్‌తో పాటు సీపీఎం, టీజేఎ్‌సకు చెందిన పలువురు నేతలను కూడా అరెస్టు చేశారు. మరోవైపు.. సీఎం పర్యటన సందర్భంగా హైదరాబాద్‌-విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి మీదుగా తరలించారు. దీంతో చిల్లేపల్లి టోల్‌ గేట్‌ వద్ద ట్రాఫిక్‌ జాం అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

దేశానికి అన్నం పెట్టే ప్రాంతంగా ఉమ్మడి ‘నల్లగొండ’: జగదీశ్‌రెడ్డి

దేశానికి అన్నంపెట్టే ప్రాంతంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నిలిచిందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ‘సూర్యాపేట ప్రగతి నివేదన సభ’లో ఆయన మాట్లాడుతూ 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి నుంచి 40లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి స్థాయికి ఎదిగామని తెలిపారు. నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యల పాపం సమైక్య పాలకులదేనన్నారు. 2014 సంవత్సరానికి ముందు రక్తసిక్తమైన జిల్లా.. స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారిందన్నారు. కాంగ్రెస్‌ చేసిన పాపానికి సమైక్య పాలనలో 600 ఏళ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భగీరథతో సూర్యాపేట పట్టణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు ఇంటింటికీ వస్తోందన్నారు.

Updated Date - 2023-08-21T04:58:05+05:30 IST