Heavy Rains: కామారెడ్డిలో భారీ వర్షం.. బయటకు రావద్దంటూ దండోరా వేయిస్తూ హెచ్చరికలు
ABN , First Publish Date - 2023-07-21T10:41:08+05:30 IST
జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కామారెడ్డి: జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా భీమేశ్వర వాగు, పాల్వంచ వాగు, నల్లమడుగు మత్తడి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వర్షం ధాటికి జిల్లా కేంద్రంలోని శ్రీరాంమ్ నగర్ కాలనీ, రుక్మిణికుంట, పంచాముఖి హనుమాన్ కాలనీ, అయ్యప్ప నగర్ కాలనీ పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపైకి వచ్చి చేరిన వరద నీటితో వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పలు గ్రామాలలో దండోరా వేయించి ఇళ్లలోంచి బయటకు రావద్దని గ్రామపంచాయతీ ప్రజా ప్రతినిధులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇళ్లలో నుండి బయటకు రావద్దని జిల్లా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గోదావరి, మంజీరలకు పోటెత్తిన వరద
అటు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో భారీ వర్షాలతో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని గోదావరి, మంజీర నదులకు వరద పోటెత్తింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సాలుర మంజీర నది పాత వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మహారాష్ట్రలోని బిలోలి - బోధన్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.