Raghunandan Rao: ఓఆర్ఆర్ టెండర్లను రద్దు చేయకుంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం
ABN , First Publish Date - 2023-05-02T18:58:01+05:30 IST
ఓఆర్ఆర్ (ORR)పై హెచ్ఎండీఏ (HMDA)కు వచ్చిన ఆదాయం ఎంత? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao) ప్రశ్నించారు.
హైదరాబాద్: ఓఆర్ఆర్ (ORR)పై హెచ్ఎండీఏ (HMDA)కు వచ్చిన ఆదాయం ఎంత? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao) ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ (MINISTER KTR), అరవింద్‌కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు రోజువారీ ఆదాయమెంతో చెప్పాలి? ఆయన అన్నారు. ఏప్రిల్ 11న బిడ్ ఓపెన్ చేస్తే.. ఏప్రిల్ 27న సమాచారమిచ్చారని మండిపడ్డారు. బిడ్ ఓపెన్ చేశాక ప్రభుత్వ పెద్దలు ఎవరితో చర్చలు జరిపారు?, టెండర్ వేసిన H1, H2, H3 మూడు ఒకే కంపెనీలు అని రఘునందన్ విమర్శించారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని, దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఫిర్యాదు చేస్తామని రఘునందన్‌రావు స్పష్టం చేశారు.
ఎన్నికల సంవత్సరం రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)ను ప్రైవేటుకు కట్టబెట్టింది. దానిపై టోల్ వసూలు హక్కులను గంపగుత్తగా 30 ఏళ్లకు ముంబై కంపెనీ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కి అమ్మేసింది. ఆశించిన ఆదాయానికన్నా తక్కువకే హక్కులను ధారపోయడం గమనార్హం. ఏటా రూ.540 కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు ఉండగా, కేవలం రూ.248 కోట్లకే ఇచ్చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఒకేసారి ఏకమొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.7,380 కోట్లు వచ్చిపడనున్నాయి. ముప్పై ఏళ్ల ఓఆర్‌ఆర్ ఆదాయాన్ని భవిష్యత్తులో అధికారానికి వచ్చే ప్రభుత్వాలకు వదలకుండా ఇప్పుడే వసూలు చేసుకొని, వాడుకొనేందుకు రంగం సిద్ధమైంది.
ఓఆర్‌ఆర్‌ను మూడు దశాబ్దాల పాటు లీజుకివ్వడం ద్వారా వచ్చే వేలకోట్లు ఆదాయాన్ని ప్రస్తుత సర్కారే వాడేసుకుంటే భవిష్యత్తు ప్రభుత్వాలకు ఓఆర్‌ఆర్ గురించి ఘనంగా చెప్పుకొని మురవడం తప్ప ఇందులోంచి వచ్చే ఆదాయమేమి ఉండదు. పేరుకు హక్కులన్నీ రాష్ట్ర ప్రభుతానివి. వచ్చే ఆదాయమంతా ప్రైవేటు సంస్థది. 2006లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్‌ఆర్ నిర్మాణాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ గ్రోత్‌కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీఎల్) ఏర్పాటు చేసి, రుణాలు సేకరించింది. రూ.6,696 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేసింది. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే వాహనాల నుంచి వసూలు చేసే టోల్ ద్వారా ఈ అప్పును తీర్చాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు మణిహారంగా మారిన ఓఆర్‌ఆర్ ప్రజలకు సౌకర్యంగా, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా బంగారు గుడ్లు పెట్టే బాతుగా ఉంది.