Gaddar And Pawan : తమ్ముడా.. అని పవన్‌ను గద్దర్ చివరిసారిగా పలకరించి ఏం చెప్పారంటే..?
ABN , First Publish Date - 2023-08-06T21:29:37+05:30 IST
ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారన్న (Gaddar Death) దుర్వార్తను అభిమానులు, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. గద్దర్‌ను గురువుగా, అన్నగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆయన ఇకలేరన్న విషయం తెలుసుకున్న సేనాని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గద్దర్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని, చివరిసారిగా ఆస్పత్రిలో కలిసి మాట్లాడిన విషయాలను గుర్తు తెచ్చుకుని పవన్ భావోద్వేగానికి లోనయ్యారు..
ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారన్న (Gaddar Death) దుర్వార్తను అభిమానులు, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. గద్దర్‌ను గురువుగా, అన్నగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆయన ఇకలేరన్న విషయం తెలుసుకున్న సేనాని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గద్దర్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని, చివరిసారిగా ఆస్పత్రిలో కలిసి మాట్లాడిన విషయాలను గుర్తు తెచ్చుకుని పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఓ ప్రకటనను జనసేన విడుదల చేసింది. మరోవైపు.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో (Jr NTR) పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
చివరిసారిగా కలిసినప్పుడు..!
‘‘ప్రజా గాయకుడు గద్దర్ గారు మరణించారంటే నమ్మశక్యం కావడం లేదు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన్ని పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితమే వెళ్ళాను. తమ్ముడా... అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఆయన్ని చివరిసారిగా కలిసినప్పుడు ‘నీ అవసరం నేటి యువతకు ఉంది’ అంటూ నాకు చెప్పిన మాటలు ఎన్నటికీ మరువలేనివి.ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి, జాతీయ అంతర్జాతీయ విషయాలు ఎన్నింటినో మాట్లాడారు. ‘మా భూమి’ చిత్రంలో ఆయన గానం చేసిన ‘బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి...’ అనే చైతన్య గీతం అజరామరం. నా చిన్నతనంలో విన్న ఆ గీతమే నాకు గద్దర్ అనే పేరును పరిచయం చేసింది. గద్దర్ అనగానే గజ్జె కట్టి గళమెత్తి.. కెరటంలా దుమికే ఆ రూపమే గుర్తుకు వస్తుంది. గానం చేసేటప్పుడు ఆయన ఆంగికం, ఆహార్యాన్ని నేటి తరం పోరాట గాయకులు అనుసరిస్తున్నారు. ‘నీ పాదమ్మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ... తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ..’ అనే పద ప్రయోగం ఊహకు అందనిది.. అనిర్వచ నీయమైనది. విప్లవ గీతాలను ఎంత సునాయాసంగా రాయగలరో.. భావుకత నిండిన గీతాలను అంతే అలవోకగా రాయగలరనిపించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన గద్దర్ గారు పీడిత వర్గాల కోసం ఆయనపడిన తపన, చేసిన పోరాటమే ఆయన్ని చిరస్మరణీయుణ్ణి చేశాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో తన కలం, తన గళంతో ఆయన నిర్వర్తించిన పాత్ర విస్మరించలేనిది. గద్దర్ గారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. గద్దర్ గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఓ ప్రకటనలో పవన్ తెలిపారు. కాగా.. ఎల్బీ స్టేడియంలో ఉన్న గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు సేనాని.
లాల్ సలాం!
మరోవైపు.. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా గద్దర్ సేవలను కొనియాడారు. ‘‘ గద్దర్ గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ‘ప్రజా యుద్ధ నౌక..’ గద్దరన్నకు లాల్ సలాం!. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు, లక్షలాది ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం !’’ అని చిరు ట్విటర్‌లో పోస్టు పెట్టారు.
ఆట, పాట, మాట సజీవమే..!
గద్దర్ మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ ట్విట్లర్ వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. ‘ గద్దర్ తన రచనలతో ప్రజల గుండెల్లో స్పూర్తి నింపారు. మన మధ్య ఆయన లేకున్నా.. ఆట, పాట, మాట ఎప్పటికీ మన మధ్యే సజీవంగానే ఉంటాయి. గద్దర్ కుటుంబ సభ్యులకు, కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. కాగా.. సోమవారం నాడు గద్దర్ స్థాపించిన మహోబోధి స్కూల్‌లోనే అంత్యక్రియలు జరగనున్నాయి.