Telangana Rains : తెలంగాణలో తీవ్ర విషాదం.. వరద బీభత్సానికి 17 మంది మృతి..
ABN , First Publish Date - 2023-07-28T19:10:32+05:30 IST
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ వర్షాలతో ఎంతోమంది నిరాశ్రయులవ్వగా.. మరెంతో మంది పునరావస కేంద్రాల నుంచి ఇంటికెళ్లలేని పరిస్థితి.! ఈ వర్షాలు, వరదలతో ఉమ్మడి వరంగల్ (Warangal) , ఖమ్మం జిల్లాల్లో (Khammam) మొత్తం 17 మంది మృతిచెందారు. మరో 9 మంది గల్లంతు అయ్యారు...
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ వర్షాలతో ఎంతోమంది నిరాశ్రయులవ్వగా.. మరెంతో మంది పునరావస కేంద్రాల నుంచి ఇంటికెళ్లలేని పరిస్థితి.! ఈ వర్షాలు, వరదలతో ఉమ్మడి వరంగల్ (Warangal) , ఖమ్మం జిల్లాల్లో (Khammam) మొత్తం 17 మంది మృతిచెందారు. మరో 9 మంది గల్లంతు అయ్యారు. కనిపించకుండా పోయిన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF) ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వీరి కోసం కొన్ని గంటలుగా రెస్య్యూ ఆపరేషన్ (Rescue operation) కొనసాగుతోంది. కాగా.. ములుగు జిల్లాలో (Mulugu District) 8 మంది వరదల్లో కొట్టుకుపోయి తనువు చాలించారు. హన్మకొండలో ముగ్గురు, ఉమ్మడి ఖమ్మంలో ముగ్గురు, మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు, భూపాలపల్లిలో ఒకరు చనిపోయారని అధికారులు వెల్లడించారు. కాగా.. ములుగు జిల్లా మల్యాలలో వరదలో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను అజ్జు, షరీఫ్, మైబూబ్ ఖాన్, సమ్మక్క, మాజీద్, కరీమ్, రశీద్, బీబీ అధికారులు గుర్తించారు. కాగా.. కొండాయి గ్రామంలో జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చడంతో.. గ్రామం మునిగిపోయింది. 8మంది వరద నీటిలో చిక్కుకుని గల్లంతయ్యారు. మిస్సయిన వారి కోసం గాలించిన సహాయక బృందాలును మృతదేహాలను గుర్తించాయి. మరోవైపు.. విద్యుత్ శాఖకు రూ. 7 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని తెలియవచ్చింది.
4 లక్షల పరిహారం..
ములుగు జంపన్న వాగులో (Mulugu Jampanna Vagu) వరద ఉధృతికి గల్లంతై మరిణించిన కుటుంబాలకు రూ. 4 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) ప్రకటించారు. తక్షణ సాయం కింద రూ. 25 వేలు ఆర్థిక సాయం ఇస్తున్నామని తెలిపారు. వరదలతో నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అయితే మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం, సర్వస్వం కోల్పోయిన వారికి రూ. 25 లక్షలు ప్రకటించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వరద బాధిత కుటుంబాలకు లక్ష రూపాయిలు చొప్పున ఇవ్వాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాయం చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్‌ను వరదలు ముంచెత్తడం ఇది మూడోసారని.. అయినా ప్రభుత్వం మొద్దు నిద్రలోనే ఉందని ప్రతిపక్షాలు కన్నెర్రజేస్తున్నాయి.
ఇంటికెళ్లి చూస్తే..!
ఇదిలా ఉంటే.. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. గురవారం నాడు గ్రామం వరదలో చిక్కుకోగా.. ప్రజలందర్నీ క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు కేసీఆర్ సర్కార్ తరలించింది. కొందరు జనాలు పునరావాస కేంద్రాల నుంచి గ్రామానికి చేరుకున్నారు. బురదతో కొన్ని ఇళ్లు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఇంట్లోని వస్తువులు బురదతో సరకులు నాశనం అయ్యాయి. ఈ పరిస్థితి తెలుసుకున్న అధికారులు ఆహారం, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు.. ప్రజలకు మెడికల్ టెస్టులు కూడా చేయిస్తున్నట్లు తెలియవచ్చింది. కాగా.. వరద బాధితుల సహాయ చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వరద ప్రాంతాల్లో ఏం చర్యలు తీసుకున్నారు..? వరదల్లో ఎంత మంది మరణించారు?.. ఆ కుటుంబాలకు పరిహారం చెల్లించారా? ముంపుప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారా?.. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారు..? అనేదానిపై ఈనెల 31 వరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.