Share News

KTR: కాంగ్రెస్ ఒళ్ల మాటలు నమ్మితే అగమైపోతము..

ABN , First Publish Date - 2023-11-16T16:28:35+05:30 IST

వికారాబాద్ జిల్లా: మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన వికారాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎవరైనా చనిపోతే కరెంటు కావాలంటే బ్రతిమలాడే పరిస్థితి ఉండేదని అన్నారు.

KTR: కాంగ్రెస్ ఒళ్ల మాటలు నమ్మితే అగమైపోతము..

వికారాబాద్ జిల్లా: మంత్రి కేటీఆర్ (Minister KTR) కాంగ్రెస్ (Congress) పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన వికారాబాద్‌లో రోడ్ షో (Road Show) నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎవరైనా చనిపోతే కరెంటు కావాలంటే బ్రతిమలాడే పరిస్థితి ఉండేదని, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఉండేవని, తాగునీరు, సాగునీరు లేదని ఆరోపించారు. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడ్డందుకు ఈ ప్రాంతానికి వచ్చే నీళ్ళు రాలేదన్నారు. 55 ఏళ్ళ పాలనలో జరగనిది.. ఇప్పుడు ఈ కాంగ్రెసు వాళ్ళు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

తెలంగాణలో మూడేకరాల రైతులే ఉన్నారని, మూడు గంటల కరెంట్ చాలని, 10 హెచ్‌బీ మోటార్ పెట్టీ గుంజుడు గుంజితే చాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతున్నారని.. మరి 10 హెచ్‌బీ మోటార్లు రైతుల వద్ద ఉన్నాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒళ్ల మాటలు నమ్మితే అగమైపోతమని.. మన రాష్ట్రాన్ని దొంగల చేతిలో పెడదామా? అని ప్రశ్నించారు. కరెంట్ కావాలా?... కాంగ్రెస్ కావాలా?... ఈ ప్రాంత రైతులు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు వృద్ధుల పెన్షన్ రూ. 2 వందలని, కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt.)లో రూ 2వేలని.. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే రూ. 4 వేలు ఇస్తామని కేటీఆర్ అన్నారు. ‘అభివృద్ధి మా కులం, సంక్షేమం మా మతం’.... కులాలు, మతాలు, ప్రాంతాలు మనకొద్దు... అభివృద్ధి కావాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, మళ్ళీ ఆ పాత రోజులు మనకొద్దని అన్నారు.

సంవత్సరం లోపు పాలమూరు రంగారెడ్డి ద్వారా కృష్ణా జలాలు తెచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ కేసీఆర్ ధీమా పేరుతో భీమా ఇస్తామన్నారు. సౌభాగ్య లక్ష్మీ ద్వారా అర్హులైన ప్రతి మహిళకు 3 వేల రూపాయలు, ప్రతి ఇంటికి సన్న బియ్యం... ఆరోగ్య శ్రీ (Arogya Shri) ద్వారా 15 లక్షల ఆర్థిక సాయం, అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. రైతు బంధు ద్వారా 73 లక్షల రైతులకు సాయం..., 5 లక్షల రైతు భీమ కల్పిస్తామన్నారు. 1043 తాండాలను ఈ ప్రాంతంలో గ్రామపంచాతీలను ఏర్పాటు చేశామని, డిల్లీ నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi) వచ్చి బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)కీ బీటీం అంటారని, మేం బీటీం ఎట్లయితమో చెప్పాలన్నారు. మంచిగా చదువుకున్నోడు మన ఆనందునే గెలిపించాలని సూచించారు. ఈ నెల 30న కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపిచ్చారు.

Updated Date - 2023-11-16T18:26:13+05:30 IST