Revanth Vs Etela: భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-04-22T17:51:58+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy), ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నారు.

Revanth Vs Etela: భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy), ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నారు. ఈటలకు సవాల్ విసిరిన రేవంత్‌రెడ్డి అనుకున్నట్లే భాగ్యలక్ష్మి ఆలయానికి (Bhagyalakshmi temple) బయలుదేరారు. జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఆయన నేరుగా చార్మినార్ వెళ్లారు. ఈటల, రేవంత్‌పై చేసిన ఆరోపణలతో బీజేపీ, కాంగ్రెస్ (BJP Congress) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కార్యకర్తలను వెంటేసుకుని భారీ కాన్వాయ్‌తో భాగ్యలక్ష్మి ఆలయానికి రేవంత్‌ వెళ్లారు. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) నుంచి కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ముట్టాయని ఈటల ఆరోపించారు. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ.. కేసీఆర్‌ రూ.25 కోట్లు ఇచ్చారంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. దాన్ని నిరూపించేందుకు సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు.

మునుగోడు ఉప ఎన్నికలో తాము ఖర్చు చేసిన ప్రతి రూపాయీ పార్టీ కార్యకర్తలు చందాల రూపంలో ఇచ్చిందేనని వెల్లడించారు. వారి శ్రమ, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటల మాట్లాడడం సమంజసం కాదన్నారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం ఎదుట తడిబట్టలతో ప్రమాణం చేయడానికీ తాను సిద్ధమేనని ప్రకటించారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని ఈటలకు సూచించారు. ఈటలకు భాగ్యలక్ష్మి అమ్మవారిపై నమ్మకం లేకుంటే ఏ దేవాలయంలోనైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని తేల్చిచెప్పారు. రాజకీయాల కోసం ఈటల దిగజారి మాట్లాడటం క్షమించరాని నేరమని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.

ఈటల మౌనం

ఇంత చర్చకు కారణమైన ఈటల మాత్రం రేవంత్ సవాల్‌పై మౌనం వహించారు. అందుకు కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amith Shah) పర్యటనలో బిజీగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు బిజీబిజీగా ఉన్నారు. అమిత్‌ పర్యటన నేపథ్యంలో రేవంత్ సవాల్‌పై స్పందించేది లేదని ఈటల రాజేందర్ చెబుతున్నారు. మొత్తానికి పాతిక కోట్ల పంచాయతీ తెలంగాణలో కాకరేపుతోంది.

Updated Date - 2023-04-22T17:51:58+05:30 IST