RS Praveen Kumar: 2009 బ్యాచ్ గురించి కేసీఆర్‌కు బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2023-03-23T19:24:03+05:30 IST

సీఎం కేసీఆర్‌ (CM KCR)కు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) బహిరంగ లేఖ రాశారు. 2009 బ్యాచ్ పోలీసు ఎస్ఐ ఉద్యోగులకు

RS Praveen Kumar: 2009 బ్యాచ్ గురించి కేసీఆర్‌కు బహిరంగ లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (CM KCR)కు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) బహిరంగ లేఖ రాశారు. 2009 బ్యాచ్ పోలీసు ఎస్ఐ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వకుండా అన్యాయానికి చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్ (Notification) ద్వారా తెలంగాణకు చెందిన హైదరాబాద్ రేంజ్(మల్టిజోన్ 2) నుండి 434 మంది, వరంగల్ రేంజ్(మల్టిజోన్ 1) నుంచి 150 మంది ఎస్ఐ ఉద్యోగాలు పొందారు. ఇప్పటివరకు వరంగల్ రేంజ్ కు చెందిన 150 మంది, హైదరాబాద్ రేంజ్ (Hyderabad Range)కు చెందిన 220 మంది ఎస్ఐలు ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందారు. అంతేకాకుండా 2012 సంవత్సరంలో ఎస్ఐ లుగా ఉద్యోగాలు పొందిన 40 మంది ఎస్ఐలు కూడా పదోన్నతి పొందారు. కానీ 2009 బ్యాచ్ కు చెందిన మిగిలిన 214 మందికి మాత్రం ఇప్పటివరకు ప్రమోషన్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) 317 జీవో తీసుకొచ్చిన అనంతరం, తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర డీజీపీ సర్వీస్ రూల్స్ మార్చి, ఒకే రాష్ట్రం ఒకే పదోన్నతి అనే విధంగా నూతన విధివిధానాలు రూపొందించారు. కానీ ఆ విధివిధానాలకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి వద్ద పెండింగ్‌లో ఉంది. నూతన రూల్స్ ప్రకారం మరియు పాత రూల్స్ ప్రకారం ఏ రూల్ ప్రకారమైనా 2009 బ్యాచ్ ఎస్ఐలకు ప్రమోషన్స్ ఇవ్వడం న్యాయబద్దమైనదే. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాష్ట్రాన్ని రక్షిస్తున్న పోలీసులకు సంబంధించిన ఫైలును కూడా పట్టించుకోకపోతే ముఖ్యమంత్రిగా మీరెందుకున్నట్లు?.. నెలకు రూ.4.25 లక్షల జీతం తీసుకుంటూ ప్రజలకు, ఉద్యోగులకు న్యాయం చేసే ఫైల్స్‌ను చూడకుండా ప్రగతిభవన్‌లో ఏం చేస్తున్నారు? పోలీసుల్లో ఎప్పుడూ అశాంతి ఉండకూడదు. వాళ్లు ఎలాంటి తప్పు చేయకపోయినా ప్రమోషన్స్ ఇవ్వకుండా శిక్షించడం వలన వారు అసహనానికి గురవుతారు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే 2009 బ్యాచ్‌కు చెందిన 214 మంది ప్రమోషన్స్‌కు అర్హులైన ఎస్ఐలకు, ఖాళీలు ఉన్న చోట వెంటనే ప్రమోషన్స్ కల్పించాలని బీఎస్పీ డిమాండ్ చేస్తోంది. లేనిపక్షంలో పోలీసు ఉద్యోగులకు న్యాయం కోసం బీఎస్పీ పోరాటానికి సిద్ధంగా ఉంది’’ అని ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు.

Updated Date - 2023-03-23T19:43:19+05:30 IST