KCR Cabinet : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. అజెండా ఇదే
ABN , First Publish Date - 2023-03-08T18:14:44+05:30 IST
గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana cabinet meeting) జరగనుంది.
హైదరాబాద్: గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana cabinet meeting) జరగనుంది. సీఎం కే.చంద్రశేఖర్ రావు (KCR) అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారని సమాచారం. ముఖ్యంగా ఈడీ విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కవిత (Kavitha) ఈడీ విచారణ (Discussion on Kavitha ED inquiry), ఒకవేళ అరెస్టయితే ఏవిధంగా వ్యవహరించాలనే అంశాలపై చర్చించే అవకాశాలున్నాయని సమాచారం. కాగా ఢిల్లీ వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవితతో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. తమ కార్యక్రమాన్ని కొనసాగించాలని, ఆందోళన పడాల్సిన పనిలేదని కవితకు భరోసా ఇచ్చారు.
బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాటం చేద్దామని తన కుమార్తె కవితకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందంటూ కవితకు చెప్పారు. కాగా ఈ నెల 10న గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు. దీనికోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)కు నోటీసులు అందడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో తొలుత సమీర్ మహేంద్రు (Sameer Mahendru) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరుసగా ఇప్పటి వరకూ 11 మంది అరెస్ట్ అయ్యారు. కాగా.. సమీర్ మహేంద్రు అరెస్ట్ సమయంలో ఈడీ ఛార్జ్ షీట్‌లో కీలక అంశాలు ప్రస్తావించింది. లిక్కర్ స్కాం ఈడీ చార్జ్ షీట్‌లో అరుణ్ పిళ్లై (Arun Pillai) పాత్రపై కీలక సమాచారం ఉంది. కవిత తరుపున అరుణ్ పిళ్లై అన్నీ తానై చూసుకున్నారని ఈడీ పేర్కొంది.
దక్షిణాది నుంచి వందకోట్లు ముడుపులు ముట్టజెప్పారని ఈడీ పేర్కొంది. సమీర్మహేంద్రుపై దాఖలు చేసిన చార్జీషీట్‌లో ఈడీ కవిత పేరును 28 సార్లు ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ ప్రతినిధులుగా అరుణ్ పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు ఉన్నారు. పిళ్లై సూచనలతో ఇండో స్పిరిట్స్ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్‌కు కోటి రూపాయలు, ఇండియా ఎహెడ్ సంస్థకు రూ. 70 లక్షల బదిలీ అయ్యాయి. ఇండో స్పిరిట్ వ్యవహారాల్లో కవిత ప్రయోజనాలకు అరుణ్ పిళ్లై ప్రాతినిధ్యం వహించారు. తమ తరుపున వాస్తవంగా పెట్టుబడి పెడుతున్నవారు కవిత, శరత్ రెడ్డి, మాగుంట అని సమీర్ మహేంద్రుకు అరుణ్ పిళ్లై చెప్పారని ఈడీ పేర్కొంది.
ఇండోస్పిరిట్‌లో కవిత ఆసక్తి చూపుతున్నారని, ఆమె తరుపున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని సమీర్‌కు అరుణ్ పిళ్లై వెల్లడించారు. 2021లో ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో విందు జరిగింది. అరుణ్ పిళ్లై ద్వారా, ఫేస్ టైంలో సమీర్ మహేంద్రు, కవిత మాట్లాడుకున్నారు. ఇండో స్పిరిట్ ఎల్1 దరఖాస్తు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అరుణ్ పిళ్లై ద్వారా కవితతో సమీర్ మహేంద్రు మాట్లాడారని ఈడీ తెలిపింది.