తెలంగాణలో ధరణి పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏం చేయబోతోందంటే...
ABN , First Publish Date - 2023-03-10T17:26:06+05:30 IST
ధరణి పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతులకు...
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో..
ధరణి సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
పెద్దపల్లిలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కార్డుల పంపిణీ
ధరణి పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఇతర భూ యజమానులకు “కాంగ్రెస్ హామీ కార్డు” పేరిట కార్డులు అందజేస్తోంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ లో ‘ధరణి అదాలత్’ పేరిట పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి మండలంలో ఐదుగురు “భూరక్షక్ ” లను నియమిస్తుంది. వీరికి ధరణి పోర్టల్, భూ సమస్యల మీద ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఈ భూరక్షకులు ప్రతి మండలంలోని అన్ని గ్రామాల్లో ధరణి అదాలత్ పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తారు. ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు, ఇతరుల పూర్తి వివరాలను సేకరిస్తోంది. అనంతరం ధరణి బాధితుల పూర్తి వివరాలతో కూడిన “కాంగ్రెస్ హామీ కార్డు” ను సదరు బాధితులకు అందజేస్తుంది. ధరణ పోర్టల్ ద్వారా ప్రతి గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా పరిష్కరిస్తామనే హామీతో ఈ కార్డు బాధితులకు అందచేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ హామీ కార్డును బాదితులు తమ మండలానికి చెందిన స్థానిక తాహసిల్ధార్, మండల రెవిన్యూ అధికారికి చూపించటం ద్వారా ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
శుక్రవారం నాడు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో జరిగిన ధరణి అదాలత్ లో 31 మంది రైతులకు “కాంగ్రెస్ హామీ కార్డు”లను అందజేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసిసి ప్రదాన కార్యదర్శి జైరాం రమేశ్, సీనియర్ నేత కొప్పుల రాజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య మహేశ్ కుమార్ గౌడ్, ఇతర నేతలు హాజరయ్యారు.