kavitha ed enquiry: కవిత ఇంటికా?.. అరెస్టా?.. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఒకటే ఉత్కంఠ!
ABN , First Publish Date - 2023-03-21T18:32:16+05:30 IST
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi liquor scam case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారణ వరుసగా రెండో రోజు కొనసాగుతోంది...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi liquor scam case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారణ వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11:30 గంటల సమయంలో భర్త అనిల్, న్యాయవాదులతో కలిసి కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ధ్వంసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో పాత ఫోన్లను తీసుకెళ్లి ఈడీ అధికారులకు ఆమె అప్పగించారు. ఈడీ ఆఫీస్కు వెళ్లడానికి ముందు ఇవే ఫోన్లను మీడియాకు కూడా చూపించారు. ఫోన్ల ధ్వంసంపై దురుద్దేశంతోనే లీకులిచ్చి దుష్ప్రచారం చేశారంటూ తప్పుబడుతూ ఈడీకి ఒక లేఖ కూడా రాశారు. ఇక్కడి వరకు అన్నీ తెలిసిన విషయాలే. మరి అసలు ఉత్కంఠ రేపుతున్న అంశాలు ఏంటంటే.. మంగళవారం విచారణలో అధికారులు కవితను ఏం ప్రశ్నిస్తున్నారు? సోమవారం 14 ప్రశ్నలు సంధించిన అధికారులు.. ఈ రోజు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు?.. ఫోన్లలోని డేటా గుర్తించి ఏమైనా విశ్లేషణ చేస్తారా?. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏమైనా ఆధారాలను రాబడతారా?. అసలు విచారణ ఎన్ని గంటలకు ముగుస్తుంది?.. విచారణ అనంతరం ఇంటికి పంపించి మరోసారి ఎంక్వైరీకి పిలుస్తారా? లేక అనూహ్యంగా అరెస్ట్ చేస్తారా? అనే తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇదివరకే రెండు రోజులు ప్రశ్నించింది. మార్చి 11న తొలిసారి, మార్చి 20న రెండోసారి ప్రశ్నించారు. మంగళవారం మూడోరోజు విచారణ కొనసాగుతోంది. మరి మంగళవారం విచారణ తర్వాత ఇంటికా? లేక అరెస్టా? అనే ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్ ఊహాగానాలకు పలు కారణాలు కూడా ఉన్నాయి. ఇదే కేసులో అరెస్టయిన వ్యక్తులను పలుమార్లు ప్రశ్నించిన అనంతరమే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాబట్టి కవితను మూడోసారి కూడా ప్రశ్నిస్తుండడంతో అరెస్ట్ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే కవిత గత రెండు సార్లు విచారణ సందర్భంలోనూ ఇదే ఉత్కంఠ వాతావరణం నెలకొన్నా అరెస్ట్ జరగలేదన్న విషయం తెలిసిందే.
ఎప్పటికప్పుడు ఆరా..
కవిత ఈడీ విచారణ మూడోసారి కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితిని బీఆర్ఎస్ ముఖ్యనాయకత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. మరోవైపు మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక ఈడీ ఆఫీస్ వెలుపల జాగృతి, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈడీ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.