Social Mediaలో వైరల్ అవుతున్న వీడియో వెనుక అసలు కథ ఏంటంటే..
ABN , First Publish Date - 2023-02-02T10:24:02+05:30 IST
వికారాబాద్‌లో ఓ దళితుడిపై శివస్వాములు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
వికారాబాద్ : వికారాబాద్ (Vikarabad)లో ఓ దళితుడిపై శివస్వాములు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో బాగా వైరల్ అవుతోంది. నిజానికి అడ్డుపడిన పోలీసులను సైతం లెక్క చేయకుండా వ్యక్తితో పాటు మరో వ్యక్తిపై శివస్వాములు పిడి గుద్దులు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చూసిన పలువురు ‘భారతదేశం (India)లోని వికారాబాద్‌లో ఒక దళితుడిపై అగ్రవర్ణ హిందూ ఆధిపత్యవాదులు దాడి చేస్తున్నారు. మోదీ (Modi) పాలన గూండాల పాలన (Mob Rule)!’ అంటూ ట్వీట్ చేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే..
ఒక వ్యక్తిపై దాడి చేసేంత కోపం శివ భక్తులకు ఎందుకొచ్చింది? మాల ధారణలో ఉన్నవారు శాంతంగా ఉండాల్సింది పోయి.. అంతటి ఉగ్రరూపం దాల్చడానికి ఒక ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగిన ఘర్షణే కారణమైంది. పోలీసులకు సైతం చివరకు చుక్కలు చూపించారు. అసలు విషయంలోకి వెళితే.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామంలో శివ మాల ధరించిన వ్యక్తికి, మరో వ్యక్తికి మధ్య జరిగిన గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శివ మాల వేసుకున్న వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేశాడు. అయితే వారిద్దరి మధ్య ఏ విషయమై గొడవ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు.
శివస్వామిపై దాడి విషయం కాస్తా గ్రామంలోని శివ మాల వేసుకున్న ఇతర వ్యక్తులకు తెలిసింది. మాలలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం వారికి తీవ్ర కోపం తెప్పించింది. దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే శివ స్వామిపై దాడి చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని తెలుసుకున్న వారంతా లక్ష్మీ నారాయణపూర్ నుంచి నేరుగా యాలాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. వీరంగం సృష్టించారు. దాడి చేసిన వ్యక్తితో పాటు మరో వ్యక్తిని కూడా చితకబాదారు. పోలీసులు అడ్డు వస్తున్నా లెక్క చేయలేదు. ఈ క్రమంలోనే ఒక కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.