TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి పెద్దపీట

ABN , First Publish Date - 2023-05-09T19:01:53+05:30 IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (TSRTC) ఉద్యోగుల ఆరోగ్యానికి సంస్థ పెద్ద పీట వేస్తోంది.

TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి పెద్దపీట

కార్పొరేట్‌కు ధీటుగా తార్నాక ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు

ఆర్టీసీ ఆస్పత్రిలో 4 ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించిన ఎండీ వీసీ సజ్జనర్

అందుబాటులోకి మరో 25 ఐసీయూ బెడ్లు

సంస్థలో తొలిసారిగా హెల్త్ వలంటీర్ల నియామకం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (TSRTC) ఉద్యోగుల ఆరోగ్యానికి సంస్థ పెద్ద పీట వేస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా తార్నాక ఆస్పత్రిని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించింది. ఇక్కడ కొత్తగా నిర్మించిన 4 సూపర్ స్పెషాలిటీ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు 15 బెడ్ల మెడికల్, 10 బెడ్ల సర్జికల్ ఐసీయూలను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, (MD VC Sajjanar) ఐపీఎస్ మంగళవారం ప్రారంభించారు. ఆపరేషన్ థియేటర్లలోని వైద్య పరికరాలను పరిశీలించారు. ఐసీయూల్లో ఆర్టీసీ సిబ్బందికి అందుతున్న వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ఏ సంస్థ అయినా బాగుంటందని, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని, ఈ మేరకు సిబ్బంది ఆరోగ్య సంక్షేమంపై సంస్థ ప్ర‌త్యేక దృష్టిసారించిందని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిని రూపుదిద్దామని పేర్కొన్నారు. అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో కూడిన 4 సూపర్ స్పెషాలిటీ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించామని వివరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్)లో మద్దతుతో 25 ఐసీయూ బెడ్లు, వాటికి అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నామని తెలిపారు.

vvc.jpg

టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది అందరికీ ప్రస్తుతం మెరుగైన వైద్య సేవలందుతున్నాయన్నారు. అలాగే ''తార్నాక ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ప్రకృతితో కూడిన ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంది. అపార అనుభ‌వం, నైపుణ్యం ఉన్న డాక్ట‌ర్లు ఇక్క‌డ సేవ‌లు అందిస్తున్నారు. ఈ ఆస్పత్రిపై గతంలో చాలా ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడవి పూర్తిగా తగ్గిపోయాయి. ఇది మంచి పరిణామం." అని సజ్జనర్ తెలిపారు. మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలందిస్తోన్న తార్నాక ఆస్పత్రి డాక్టర్లు, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

హెల్త్ వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం

ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సంస్థ తొలిసారిగా హెల్త్ వలంటీర్ల వ్య‌వ‌స్థ‌కు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 50 వేల మంది సిబ్బందికి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే రోగ నిర్ధారణ పరీక్షలు చేసి ‘హెల్త్‌ ప్రొఫైల్‌’ రూపొందించిన సంస్థ.. వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు హెల్త్ వలంటీర్ల సేవలను వినియోగించుకోనుంది. అనారోగ్యం నుంచి కోలుకున్న ఉద్యోగులు, హెల్త్ ఫ్రొఫైల్ లో రిస్క్ కేటగిరిల వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డిస్పెన్సరీ డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లడం వీరి ప్రధాన విధి. 

హైదరాబాద్ లోని తార్నాక ఆస్పత్రిలో మంగళవారం హెల్త్ వలంటీర్ల వ్యవస్థను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ప్రారంభించారు. కొత్తగా నియమితులైన హెల్త్ వలంటీర్లతో సమావేశమయ్యారు. అనంతరం గ్లూకో, బీపీ మీటర్, డిజిటల్ థర్మామీటర్‌, తమ విధి విధానాల‌కు సంబంధించిన హ్యాండ్ బుక్ తో కూడిన కిట్ లను హెల్త్ వలంటీర్లకు అంద‌జేశారు.  ఉద్యోగుల ఆరోగ్యకరమైన అలవాట్లపై సంభాషించ‌డం, నిత్యం కౌన్సెలింగ్ చేయ‌డం, వారి ఆరోగ్యంపై డిస్పెన్సరీ వైద్యుల సహాయం తీసుకోవ‌డం వంటి విష‌యాల‌పై హెల్త్ వలంటీర్లు ప్ర‌ధానంగా దృష్టి సారించాలని, డాక్ట‌ర్లు సూచించిన స‌మ‌యానికి అనుగుణంగా మందులు వేసుకోవ‌డం, మంచి ఆహార‌పు అల‌వాట్ల‌ను ఏర్ప‌ర‌చుకోవ‌డం వంటి విష‌యాల‌పై అశ్ర‌ద్ధ‌గా ఉండ‌కూడ‌ద‌ని ఉద్యోగులకు చెప్పాలన్నారు. 

“ఉద్యోగుల ఆరోగ్య విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో హెల్త్ వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను సంస్థ రూపొందించ‌డం జ‌రిగింది. ఇలాంటి వ్యవస్థ ప్ర‌పంచంలో ఎక్క‌డా లేదు. ఇదొక బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మంగా నిలువబోతుంది.” అని ఆశాభావం వ్యక్తం చేశారు. 

టీఎస్ఆర్టీసీ చైర్మ‌న్, తాను సంస్థ‌ను అభ్యున్న‌తి దిశ‌గా తీసుకెళ్ల‌డానికి అంద‌రి స‌హ‌కారంతో కృషి చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. సంస్థ క్లిష్ట ప‌రిస్థితుల నుంచి గ‌ట్టెక్కి పురోగ‌మ‌నం వైపు ప‌య‌నిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో కాలానుగుణంగా వ‌స్తున్న పోటీ వాతావ‌ర‌ణాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డ‌డానికి టీఎస్ఆర్టీసీ ఎంతో క‌స‌ర‌త్తు చేస్తోంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యే దిశ‌లో అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమాల్లో టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్(విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, సీపీఎం ఎస్.కృష్ణకాంత్, సీసీవోఎస్ విజయభాస్కర్, సీసీఈ రాంప్రసాద్, తార్నాక ఆస్పత్రి ఓఎస్డీ సైదిరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2023-05-09T19:09:08+05:30 IST