Tummala: మాజీమంత్రి తుమ్మల సంచలన కామెంట్స్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడైనా గెలిచే సత్తా నాకుంది
ABN , First Publish Date - 2023-11-11T12:41:26+05:30 IST
‘ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచైనా గెలిసే సత్తా నాకుంది.. రేపు ఖమ్మంలోనూ గెలుస్తున్నా. నేను డాలర్ లాంటి వాడిని.
- నేను డాలర్‌ను.. నీవే రద్దు చేసిన రూ.2వేల నోటువి
- మంత్రి పువ్వాడపై ఖమ్మం రోడ్ షోలో తుమ్మల పైర్
ఖమ్మం: ‘ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచైనా గెలిసే సత్తా నాకుంది.. రేపు ఖమ్మంలోనూ గెలుస్తున్నా. నేను డాలర్ లాంటి వాడిని. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా చెల్లుతా.. నీవు రద్దు చేసిన రూ.2వేల నోటువి. ఖమ్మం దాటితే ఎక్కడా పోటీ చేయలేవు’ అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) పువ్వాడ అజయ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఖమ్మం 9,10 డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన మాట్లాడుతూ ఖమ్మం దాటి పక్కకు వెళితే ఎవరూ గుర్తు పట్టని వ్యక్తి అని, తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎవరిని బెదిరించలేదని, కుల, మత సంఘాల్లో విద్వేషాలు సృష్టించలేదని తుమ్మల పేర్కొన్నారు. తాను ఎక్కడ పోటీ చేసినా, గెలిచినా ఖమ్మం నగరం అభివృద్ధిని మరవలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మోసం చేసిన ఘనుడన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు ఎండీ జావీద్, మానుకొండ రాధాకిషోర్, కార్పొరేటర్ జాన్‌బీ నాగుల్ మీరా, మాజీ కార్పొరేటర్ చావా నారాయణరావు పాల్గొన్నారు.
రాజకీయ మార్పు యువశక్తితోనే సాధ్యం : తుమ్మల
యువశక్తితోనే రాజకీయమార్పు సాధ్యమని, భవిష్యత్‌లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రిగా యువత నైపుణ్యాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలో యువం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీ్‌పకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అక్రమాలు, అన్యాయాలను, కబ్జాలను తరిమికొట్టేందుకు నేటి యువత కాంగ్రె్‌సతో కలిసి రావాలని, రాబోయే ఐదు, పదేళ్లలో కాంగ్రెస్ నేతృత్వంలో దేశం ప్రపంచంలోనే ఆగ్రగామిగా ఎదుగుతుందన్నారు. అల్లూరి సీతారామారాజు, స్వామి వివేకానందస్ఫూర్తితో పనిచేయాలన్నారు. రఘునాథపాలెం పాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయసమ్మేళనంలో తుమ్మల మాట్లాడుతూ క్రైస్తవులు, మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. గతంతో కొందరు నాయకులు చర్చి స్థలాలను కబ్జాలు చేశారని, వాటిని తిరిగిచ్చే రోజులు సమీపంలోనే ఉన్నాయన్నారు. అలాగే యువ నాయకుడు బొడేపూడి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల మాట్లాడుతూ రుషికొండ వలే రఘునాథపాలెం మండలంలోని మట్టి గుట్టలు అవినీతితో కరిగి పోయాయని ఆరోపించారు. మోతి నగర్ మసీదులో నిర్వహించిన కార్యక్రమంలో తుమ్మల పాల్గొని ముస్లిం మత పెద్దలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్, సుడా డైరెక్టర్ ఖాదర్‌బాబా, పాషా, యాకూబ్, ముస్తాఫా పాల్గొన్నారు.