Tummala: మాజీమంత్రి తుమ్మల ఘాటు వ్యాఖ్యలు.. దుర్మార్గ పాలన అంతానికే కాంగ్రెస్‌లోకి వచ్చా.. ఖమ్మంలో బందిపోటు ముఠా తయారైంది
ABN , First Publish Date - 2023-10-21T12:36:14+05:30 IST
ప్రజల ఆస్తులు దోచుకునేందుకు జిల్లాలో బందిపోట్ల ముఠా తయారైందని, ఆ దుర్మార్గ, అవినీతి పాలనను అంతం చేసేందుకు తాను
- ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల వ్యాఖ్యలు
ఖమ్మం/ రఘునాథపాలెం: ప్రజల ఆస్తులు దోచుకునేందుకు జిల్లాలో బందిపోట్ల ముఠా తయారైందని, ఆ దుర్మార్గ, అవినీతి పాలనను అంతం చేసేందుకు తాను కాంగ్రెస్ లో చేరానని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం వీడీవోస్ కాలనీలో వాసిరెడ్డి వెంకటేశ్వర్ల చౌదరి, ఆశోక్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రజల కోరిక మేరకు తాను కాంగ్రెస్‌లో చేరానని, పట్టపగలు తాము దొరల్లా బరాబర్‌గా ప్రజల్లోకి వచ్చామన్నారు. తెల్లారితే ఎవరి ఇళ్ల స్థలాలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి ఉందని, తాము వాటికి అడ్డుకట్ట వేస్తామన్నారు. ఇక స్వర్గీయ ఎన్డీఆర్ పిలుపుమేరకు నీతివంతమైన రాజకీయాలు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తాను 40ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా విలువల మేరకు పనిచేశానన్నారు. గంజాయి వ్యాపారులపై పెట్టే పీడీ యాక్టు కేసులు.. కొత్తగా ఖమ్మం రాజకీయాల్లోకి వచ్చాయని, ఒక్కో నాయకుడిపై 19నుంచి 25కేసులు నమోదు చేశారన్నారు. ఎన్డీఆర్, చంద్రబాబు, కేసీఆర్ తనను పిలిచి మంత్రి పదవులు ఇచ్చారని వాటని దుర్వినియోగం చేయకుండా ప్రజాహితం కోసం ఆదర్శవంతంగా పనిచేశానన్నారు. కానీ ఇప్పుడు ఖమ్మంలో వ్యాపారులు, ఉద్యోగులు, వృత్తి వ్యాపారులు, పదవీ విరమణ పొందిన వారు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు కొందరు ఇరత దేశాల్లో స్థిరపడితే.. ఇక్కడున్న వారి తల్లిదండ్రులు ఆస్తులు కాపాడుకునేందుకు బిక్కుబిక్కు మంటూ ఉంటున్నారని, ఇకపై అలాంటి రోజులు పోతాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్లు చావా నారాయణరావు, పోట్ల వీరేందర్, నాగండ్ల దీపక్‌చౌదరి, నాయకులు సాదు రమేశ్‌రెడ్డి, చావా వెంకటరామయ్య, దండ రాజా, పొదిల రవికుమార్, జితేందర్, నాగేశ్వరరావు, మధుకర్, సాయితేజ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన రఘునాథపాలెం ఎంపీపీ
ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలమైన రఘునాథపాలెంలో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి ఎంపీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న భూక్యా గౌరి బీఆర్ఎస్ను వీడి శుక్రవారం ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గౌరితో పాటు ఆమె భర్త మాజీ సర్పంచ్ లాలు, సొసైటీ చైర్మన్ తాతా రఘురాంకు తుమ్మల కాంగ్రెస్ కండువాలు కప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు తుంబూరి దయాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పలువురు రఘునాథపాలెం మండల నాయకులు పాల్గొన్నారు.