TS Politics: సవాళ్లు, ప్రతిసవాళ్లు.. నేతల హౌస్ అరెస్ట్‌లు... భూపాలపల్లిలో ఏం జరుగుతోంది?

ABN , First Publish Date - 2023-03-02T09:43:14+05:30 IST

భూపాలపల్లి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత గండ్ర సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎ

TS Politics: సవాళ్లు, ప్రతిసవాళ్లు.. నేతల హౌస్ అరెస్ట్‌లు... భూపాలపల్లిలో ఏం జరుగుతోంది?

జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత గండ్ర సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (MLA Gandra Venkataramanareddy), కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు (Gandra Satyanarayana) మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అవినీతి, కబ్జా ఆరోపణలు రుజువు చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (Bhupalapalli MLA) సవాల్ విసిరారు. ఈరోజు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తాకు తాను వస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు.

ఆధారాలతో సహా రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు (Congress Leader) స్పష్టం చేశారు. రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని ప్రతి సవాల్ విసిరారు. ఈరోజు అంబేద్కర్ సెంటర్‌లో బహిరంగ చర్చకు ఇరువురు నేతలు సిద్ధమవుతుండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. నేతల సవాళ్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భూపాలపల్లి జిల్లాలో144 సెక్షన్ విధించారు. జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి నేటి నుంచి వారం రోజులపాటు జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమలు చేశారు. రాజకీయ పార్టీల ర్యాలీలు, సమావేశాలు, బల ప్రదర్శనపై నిషేధం విధించారు.

ఇరువురు నేతల హౌస్‌ అరెస్ట్‌లు

మరోవైపు భూపాలపల్లి (Bhupalapalli)లో పోలీసులు 144 సెక్షన్‌ (144 Section) విధించడంతో పాటు సవాళ్లకు దిగిన ఇరువురు నేతలను హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈరోజు 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తాకు వస్తానని కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని గండ్ర చెప్పుకొచ్చారు.

అటు హనుమకొండ (Hanmakonda)లో కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భూపాలపల్లికి వెళ్లకుండా హనుమకొండలోని ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై తాము చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపిస్తానని సవాల్ చేశారు. కాగా... ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో భూపాలపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తాలో భారీగా పోలీసులు మోహరించారు. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలను కూడా ముందస్తు అరెస్టులు చేశారు.

Updated Date - 2023-03-02T09:43:14+05:30 IST