Mulugu Dist.: రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-02-08T10:59:22+05:30 IST

ములుగు జిల్లా: టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy)పై ములుగు, నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

Mulugu Dist.: రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

ములుగు జిల్లా: టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy)పై ములుగు, నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ప్రగతి భవన్‌ (PragathiBhavan)ను డైనమైట్లు పెట్టి పేల్చినా ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యలు చేయడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గడీలను పేల్చినట్లు ప్రగతిభవన్ గోడలు డైనమైట్లతో బద్దలు కొట్టాలని చేసిన వ్యాఖ్యల వెనుక కుట్రకోణం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రాణానికి హానితలపెట్టే కుట్రలో భాగంగానే నక్సలైట్లకు బహిరంగ పిలుపు ఇచ్చారని ఫిర్యాదులో తెలిపారు. రేవంత్ రెడ్డి, సీతక్కపై కుట్రకేసు, పీడియాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

పాదయాత్రలో ప్రగతిభవన్‌ను పేల్చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. రేవంత్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (BRS MLA Peddi Sudarshan Reddy) అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader Batti Vikramarka), జానారెడ్డి (Janareddy) సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ (Mahatma Ganthiji) మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా అని నిలదీశారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని... అక్కడ ప్రభుత్వ ఆఫీస్‌లపై పేల్చాలని డిమాండ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న పీసీసీలు అందరూ రేవంత్ తరహా కామెంట్స్ చేస్తారా అంటూ పెద్దసుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.

కాగా పేదలకు ఉపయోగపడని ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఎకరాల్లో 110 గదులతో కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి నిర్మించిన ప్రగతి భవన్‌ ఆంధ్రా పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరిచి, స్వాగతం పలుకుతోందన్నారు. పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ ఉంటే ఏమిటి.. లేకుంటే ఏమిటి..? అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి చేపట్టిన ‘హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర’ రెండో రోజు మంగళవారం ములుగు జిల్లాలో కొనసాగింది. ఉదయం రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఆయన రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రం వరకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పలుచోట్ల ప్రజలు, రైతులతో ముచ్చటించారు. మీడియాతో, ములుగులో రాత్రి జరిగిన రోడ్‌షోలోనూ రేవంత్‌ మాట్లాడారు. ఆనాడు దొరల గడీలను పేల్చేసిన నక్సలైట్లు నేడు ప్రగతి భవన్‌ను లేకుండా చేసినా అభ్యంతరం లేదన్నారు. అద్దాల మేడలలెక్క కలెక్టరేట్ల నిర్మాణం చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ధరణి పేరిట లక్షలాది ఎకరాల భూములను కాజేస్తూ భూసమస్యలు పరిష్కరించని అద్దాల మేడలు ఉంటే ఏమిటి.. లేకుంటే ఏమిటని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. వచ్చిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబానికే ఉపయోగపడుతోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టకముందు రబ్బరు చెప్పులతో తిరిగిన ఆ కుటుంబానికి హైదరాబాద్‌ చుట్టూ వందల ఎకరాల ఫాంహౌజ్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లకాలంలో పది బడ్జెట్లు ప్రవేశపెడితే రూ.17.78 లక్షల కోట్ల కేటాయింపులు, మరో రూ.5 లక్షల కోట్ల అప్పులు కలిపి.. మొత్తం రూ.22.78 లక్షల కోట్లు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ లేదు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు లేవు, ఫీజు రీయింబర్స్‌మెట్‌ లేదు, ఆరోగ్యశ్రీ సేవలందవు.. మరీ రూ.22.78 లక్షల కోట్ల నిధులు ఏమయ్యాయని నిలదీశారు. డ్రామారావు తమది కుటుంబ పాలనే అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడని, అసలు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం కోసమేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులైన ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి లాంటి వారిని మంత్రులు చేశారని మండిపడ్డారు. 2024లో రాష్ట్రలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ వెంటనే పోడుభూములకు పట్టాలిచ్చే బాధ్యత తమదేనన్నారు. ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరుతో జీవో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పంటలకు గిట్టుబాటు కల్పిస్తామని, ప్రజల కష్టాలను తీరుస్తామని రేవంత్ చెప్పారు.

Updated Date - 2023-02-08T10:59:25+05:30 IST