Dog Attack: ఆగని కుక్కల దాడులు.. ఈరోజు ఏకంగా..
ABN , First Publish Date - 2023-03-02T09:15:58+05:30 IST
రాష్ట్రంలో వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతూనే ఉంది.
జనగామ: రాష్ట్రంలో వీధి కుక్కల (Street Dogs) స్వైర విహారం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ (Hyderabad)లోని అంబర్‌పేటలో ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అనేక ప్రాంతాల్లో వీధికుక్కల దాడుల్లో పలువురు చిన్నారులు గాయాలపాలయ్యారు. తాజాగా జనగామ (Jangoan)లో దాదాపు ఐదుగురికిపై వీధి కుక్క దాడి చేసింది. ప్రెస్టన్ స్కూల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీధికుక్కల దాడులో పలువురు గాయపడగా.. వారిలో పూర్ణ అనే 9 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు చిన్నారిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుక్క దాడితో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు దాన్ని వెంబడించి కర్రలతో కొట్టి చంపారు. కుక్కల బెడద ఎక్కవగా ఉందని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.
మరోవైపు అంబర్‌పేట బాలుడి ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. వీధి కుక్కల దాడులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గైడ్ లైన్స్ (Guide lines) జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలకు ఆదేశించింది. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించాలని... కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్ (Sterilization) చేయాలని పేర్కొంది. మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల వారు మాంసాహారాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కుక్కలను పట్టుకునే బృందాలు, వాహనాల సంఖ్యను పెంచాలని తెలిపింది. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని... అలాగే వీధి కుక్కలపై స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు కరపత్రాలను పంపిణీ చేయాలని చెబుతూ.. జీహెచ్ఎంసీ, సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.