Seetakka: పోడు పట్టాల పంపిణీ మా పోరాట ఫలితమే..
ABN , First Publish Date - 2023-06-30T16:30:58+05:30 IST
మహబూబాబాద్: పోడు పట్టాల పంపిణీ తమ పోరాట ఫలితమేనని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తాను అనేక సార్లు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిలదీశానని అన్నారు.
మహబూబాబాద్: పోడు పట్టాల పంపిణీ (Podu Pattala Distribution) తమ పోరాట ఫలితమేనని ఎమ్మెల్యే సీతక్క (Seetakka) అన్నారు. తాను అనేక సార్లు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)ను నిలదీశానని అన్నారు. పోడు పట్టాల కోసం ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేశామన్నారు. పోడు రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని సీతక్క డిమాండ్ చేశారు.
కాగా కొమురం భీం ఆసిఫాబాద్‌లో సీఎం కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి నుంచి పట్టాల పంపిణీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో అందరికీ పట్టాలు అందుతాయన్నారు. ఈ సారి మహిళల పేరిట పట్టాలు అందిస్తున్నామన్నారు. గిరిజనేతరుల రైతులకు కూడా పట్టాలు ఇస్తామని, వారికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కాగానే పట్టాలు అందజేస్తామన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ముందుందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 36 వేల మందికి పోడు పట్టాలు ఇవ్వ బోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
అంతకుముందు కొమురం భీం ఆసిఫాబాద్‌లో సమీకృత కలెక్టరేట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. కలెక్టర్ హేమంత్ బోర్కడేను సీట్లో కూర్చో బెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఇంద్ర కరణ్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.