Preeti Case: సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2023-03-02T15:32:12+05:30 IST
డాక్టర్ ప్రీతి మృతి కేసులో సైఫ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
వరంగల్: డాక్టర్ ప్రీతి మృతి కేసు (Doctor Preeti Case)లో సైఫ్ (Saif) ను పోలీసులు కస్టడీ (Police custody) లోకి తీసుకున్నారు. ఖమ్మం (Khammam) జైలు నుంచి వరంగల్ (warangal) కు తీసుకువచ్చారు. సైఫ్‌ను నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. సైఫ్‌ను వరంగల్ మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
ఈ కేసుకు సంబంధించి ప్రీతి కుటుంబసభ్యులు కీలకమైన ఆరోపణలు చేశారు. కేసుకు సంబంధించి సరైన విచారణ జరగడం లేదని ముందు నుంచి చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న పోలీసులే విచారణ అధికారులుగా ఎలా ఉంటారని ప్రీతి తండ్రి ప్రశ్నిస్తున్నారు. ప్రీతిని సైఫ్ వేధిస్తున్నారంటూ మొదట ఏసీపీ బోనాల కిషన్‌కు ప్రీతి తండ్రి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పట్టించుకోకపోవడంతో రెండు రోజుల తర్వాత ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ప్రీతి కుటుంబసభ్యులు ఆరోపించారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కుంటున్న పోలీసు అధికారులే విచారణ జరపడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ప్రీతి సోదరుడు పృథ్వీ ఏబీఎన్‌తో మాట్లాడుతూ... ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు లేవన్నారు. మా అక్క ప్రీతి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తాము ఆరోపణలు చేస్తున్న ఏసీపీనే విచారణ అధికారిగా ఉన్నారని... ర్యాగింగ్ కమిటీలోనూ ఏసీపీ తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని మండిపడ్డారు. కౌన్సిలింగ్ ఇచ్చామంటున్నారు కానీ, మా అక్క చెప్పలేదని పృథ్వీ తెలిపారు.
సంచలనంగా మారిన పృథ్వీ వీడియో....
అలాగే ప్రీతి కేసుకు సంబందించి ఆమె సోదరుడు పృథ్వీ విడుదల చేసిన ఒక వీడియో సంచలనంగా మారింది. తన సోదరికి, సైఫ్‌కి కలిపి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పిందంతా పూర్తి అబద్ధమని తెలిపాడు. హెచ్‌వోడీ పిలిచి తన సోదరిని కనీసం ఎలాంటి వివరణ అడక్కుండా తిట్టాడని పేర్కొన్నారు. సైఫ్‌కు పూర్తి సపోర్టివ్‌గా ఉన్న నాగార్జునరెడ్డితో కమిటీని ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించాడు. అలా కమిటీని ఏర్పాటు చేస్తే సైఫ్‌కి ఫేవర్‌గానే రిపోర్ట్ ఇస్తాడు కదా? అని ప్రశ్నించాడు. నిమ్స్‌లో ప్రీతి పొత్తి కడుపు వద్ద సర్జరీ చేశారని పృధ్వీ తెలిపాడు. ఆ సర్జరీ ఎందుకు చేశారనేది తెలియడం లేదన్నాడు. అలాగే ప్రీతికి చేతిపై గాయం ఉందని వెల్లడించాడు. ప్రీతికి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలిసిస్ చేశారని తెలిపాడు.
బ్లడ్ డయాలసిస్ చేస్తే.. పోస్ట్ మార్టంలో ప్రీతి బాడీలో ఉన్న ఇంజెక్షన్ గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించాడు. నిమ్స్‌లో ఏం వైద్యం చేశారనేది తమకు చెప్పాలని ప్రీతి సోదరుడు పృథ్వీ డిమాండ్ చేశాడు. ర్యాగింగ్ కమిటీపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయన్నాడు. నాగార్జున రెడ్డి తప్పు చేసిన వ్యక్తి అయితే అసలు అతన్ని ర్యాగింగ్ కమిటీలో ఎందుకు ఉంచుతారని ప్రశ్నించాడు. ప్రీతి సెల్ ఫోన్‌లో మెసేజ్‌లను తాను చెక్ చేశానని పృథ్వీ వెల్లడించాడు. తనకు కనిపించని మెసేజ్‌లు పోలీసులకి ఎలా కనిపించాయని నిలదీశాడు. నాగార్జున రెడ్డి కమిటీ రిపోర్ట్‌ను మార్చి ఉంటారని పృథ్వీ పేర్కొన్నాడు.