Swapnalok fire Accident: ఐదు కుటుంబాల్లో తీరని విషాదం.. గాంధీ మార్చరీ వద్ద మన్నంటిన రోదనలు

ABN , First Publish Date - 2023-03-17T09:58:36+05:30 IST

స్వప్నలోక్ అగ్నిప్రమాద ఘటన వరంగల్, మహబూబాబాద్ జిల్లాలోని ఐదు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

Swapnalok fire Accident: ఐదు కుటుంబాల్లో తీరని విషాదం.. గాంధీ మార్చరీ వద్ద మన్నంటిన రోదనలు

వరంగల్: స్వప్నలోక్ అగ్నిప్రమాద (Swapnalok Fire Accident) ఘటన వరంగల్ (Warangal), మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలోని ఐదు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు యువతీ, యువకులు మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌ (Hyderabad) కు తరలివెళ్లారు. గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital) తమ బిడ్డల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాంధీ మార్చరి వద్ద రోదనలు మిన్నంటాయి. మృతులలో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన శివ, దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన వెన్నెల, ఖానాపూర్ తండాకు చెందిన శ్రావణి కుటుంబాల్లో రోదనలు మిన్నంటుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నెకు చెందిన ప్రశాంత్, కంబాలపల్లి సమీపంలోని సురేష్ నగర్‌కు చెందిన ప్రమీల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐదు గ్రామాల్లోనూ విషాదం అలముకున్నాయి.

కాగా... సికింద్రాబాద్‌ (Secundrabad) స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిప్రమాదం కారణంగా చుట్టుముట్టిన పొగను పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్న ఆరుగురినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయి. ఒకవైపు వర్షం కురుస్తున్నా.. అగ్నిజ్వాలలు వ్యాపించడంతో ఆ సమయంలో భవనంలో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు మూడు గంటలపాటు మంటలు తగ్గినట్టే తగ్గి మళ్లీ వ్యాపిస్తుండడంతో అప్రమత్తమైన అగ్నిమాపక అధికారులు.. అదనపు ఫైరింజన్లను రప్పించారు. మొత్తం 15 అగ్నిమాపక శకటాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు.

Updated Date - 2023-03-17T09:58:36+05:30 IST