BJP Chief: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పొత్తులపై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-07-07T12:54:16+05:30 IST
రాబోయే ఎన్నికల్లో పొత్తులపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హనుమకొండ: రాబోయే ఎన్నికల్లో పొత్తులపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటే అని అన్నారు. కేసీఆర్ (CM KCR)... కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు కోసం పని చేశారన్ని.. ఎన్నటికైనా ఆ రెండు పార్టీలు కలుస్తాయని తెలిపారు. రేపటి (శనివార) బీజేపీ సభ చాలా కీలకమైనదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పర్సంటేజీల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. వాటాల ప్రభుత్వంగా తయారైందని విమర్శించారు. బీజేపీపై కొందరు విషం చిమ్ముతున్నారని.. దీన్ని తిప్పి కొట్టాలన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనపై మోదీ మాట్లాడతారని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాల్సి ఉందన్నారు. కుటుంబ పార్టీల వల్ల దేశంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో సుపరిపాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన రావాలని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ వ్యాగన్ ఫ్యాక్టరీ ద్వారా రోజుకు ఏడు గూడ్స్ బోగీల ఉత్పత్తి జరుగుతుందన్నారు. మోదీ తొలుత మామునూర్ ఎయిర్ పోర్ట్, అక్కడి నుంచి భద్రకాళీ గుడి, అక్కడ నుంచి ఆర్ట్స్ కళాశాలకు వస్తారన్నారు. ఇక్కడే శంకుస్థాపనల అనంతరం బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు.
మోదీ వరంగల్ పర్యటన చారిత్రాత్మకం
రేపటి మోదీ పర్యటన సందర్భంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరీశీలించారు. అంతుకుముందు భద్రకాళీ ఆలయం చేరుకున్న బీజేపీ చీఫ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటన చారిత్రాత్మకమన్నారు. ముప్పై ఏళ్ల తర్వాత వరంగల్‌కు ప్రధాన మంత్రి వస్తున్నారని తెలిపారు. వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోవడం తమ అదృష్టమన్నారు. ప్రధాని మోదీకి వరంగల్ ప్రజలు ఘన స్వాగతం పలకాలని అన్నారు. వరంగల్ నగరం దేశానికే తలమానికమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.