Yadagirigutta: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు పరిసమాప్తి

ABN , First Publish Date - 2023-05-04T19:35:56+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో నృసింహ జయంత్యుత్సవాలు పరిసమాప్తమయ్యాయి.

Yadagirigutta: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు పరిసమాప్తి

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో నృసింహ జయంత్యుత్సవాలు పరిసమాప్తమయ్యాయి. గురువారం ఉదయం మహాపూర్ణాహుతి, సాయంత్రం నృసింహావిర్భావ ఘట్టాలతో వేడుకలు ముగిశాయి. వేకువజామున స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలోని యాగశాలలో నిత్యహవనం జరిపి మహాపూర్ణాహుతి పర్వాలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో వెయ్యి కలశాలు ఏర్పాటుచేసిన అర్చకులు గంగాది సప్తనదీ జలాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, దర్భ, మామిడి ఆకులు, తమలపాకులు, వివిధ రకాల మాలలు, కొబ్బరికాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులు, సువర్ణప్రతిష్టా అలంకార మూర్తులకు శాంతి మంత్ర పఠనాలతో సహస్రఘటాభిషేకం నిర్వహించారు. యాదగిరిక్షేత్ర మహాత్యం వివరించిన అర్చకులు స్వామి, అమ్మవార్లను సువర్ణ పుష్పాలతో అర్చించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ నృసింహ జయంతి పర్వాలు సంప్రదాయరీతిలో నిర్వహించారు.

నృసింహుడిని దర్శించుకున్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీకుముదిని (Rani Kumudini), యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పథి దర్శించుకున్నారు. పూజల అనంతరం అర్చకులు వీరికి ఆశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన నృసింహ జయంత్యుత్సవాలు గురువారం పరిసమాప్తి కావడంతో శుక్రవారం నుంచి నిత్య, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమ పూజలు యథావిధిగా కొనసాగనున్నాయి.

Updated Date - 2023-05-04T19:35:56+05:30 IST