Balineni Srinivas: జగన్‌పై సంచలన ఆరోపణలు చేసిన బాలినేని..
ABN , Publish Date - Sep 26 , 2024 | 09:57 PM
వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. వైఎస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలవల్లే వైసీపీని వీడానని బాలినేని తెలిపారు. అంతేకాదు.. తనలాంటి సీనియర్లను జగన్ అస్సలు పట్టించుకునేవారని ఆరోపించారు.
అమరావతి, సెప్టెంబర్ 26: వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. వైఎస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలవల్లే వైసీపీని వీడానని బాలినేని తెలిపారు. అంతేకాదు.. తనలాంటి సీనియర్లను జగన్ అస్సలు పట్టించుకునేవారని ఆరోపించారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. విలువ, గౌరవం ముఖ్యం అన్నారు. గురువారం నాడు జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు బాలినేని శ్రీనివాస రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలినేని.. జనసేనలో చేరేందుకు తనకు అవకాశం కల్పించినందుకు పవన్ కల్యాణ్‌కు ధన్యావాదాలు చెప్పారు.
బాలినేని కామెంట్స్ యధావిధిగా..
‘నేడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరాను. నేను వైసీపీలో ఉన్నా కూడా పవన్ నా గురించి మంచిగా చెప్పేవారు. నా మీద ఆయనకు ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు. నా చేరిక ద్వారా కూటమిలో విభేదాలు వస్తాయని జరిగే ప్రచారంలో వాస్తవం లేదు. మా అధినేత ఏది చెబితే అదే చేస్తాను. కూటమిలోని ఇతర పార్టీల నేతలను కలుపుకుని వెళతాను. కొన్ని అసత్య ప్రచారాలు, చిన్న వివాదాలు సర్దుకుంటాయి. ప్రకాశం జిల్లాలో జనసేనను ప్రజల్లోకి తీసుకెళతాం. టీడీపీ, బీజేపీ పక్ష నేతలతో కలిసి కార్యక్రమాలు చేస్తాం. నన్ను చేర్చుకున్నందుకు తప్పకుండా పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తాను. నా మీద కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అవన్నీ త్వరలో సర్దుకుంటాయి. అందరితో కలిసి పనిచేస్తాం.’ అని బాలినేని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో వైఎస్ జగన్ తీరుపైనా బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘జగన్మోహన్ రెడ్డికి మాలాంటి సీనియర్ నేతలంటే అసలు లెక్క లేదు. నేను వైయస్సార్‌కు వీరాభిమానిని. ఆయన అడుగుజాడల్లో పని చేశాను. జగన్మోహన్ రెడ్డి ఏక పక్ష నిర్ణయాలు మా మనసుకు కష్టం కలిగించాయి. నాకు పదవులు ముఖ్యం కాదు. విలువ, గౌరవం ముఖ్యం. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం నేను పని చేస్తా. రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో అందరనీ మారుస్తాం అన్నారు. మాలాంటి కొంతమందిని మార్చి మమ్మల్ని అవమానించారు. వాళ్లు అంత గొప్పగా ఏం చేశారో.. మేమేం చేయలేదో జగన్‌కే తెలియాలి. ఆ తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు చాలా సందర్బాలలో నన్ను బాధించాయి. అవన్నీ గతం.. ఇప్పుడు మా అధినేత పవన్ కల్యాణ్. నా పార్టీ జనసేన. నాకు జనసేనలో అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు. పార్టీ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా.’ అని బాలినేని చెప్పుకొచ్చారు.
సామినేని ఉదయభాను కామెంట్స్..
బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సామినేని.. పార్టీకి, ప్రజలకు సేవలు అందించడంలో ముందుంటానని చెప్పారు. కూటమి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్నారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా తాను జనసేనలో చేరానని సామినేని తెలిపారు. తనకు రాజకీయాలు కొత్తేమీ కాదని.. అందరితో కలిసి వెళతానని చెప్పారు. లడ్డూ విషయంలో సిట్ దర్యాప్తు జరుగుతోందని.. త్వరలోనే వాస్తవాలు బయటకొస్తాయని చెప్పారు.
Also Read:
బాహుబలి స్టైల్లో బైకును ఎత్తాలని చూశాడు.. చివరకు..
కేటీఆర్‌కు నోటీసులు.. ఎందుకంటే
For More Andhra Pradesh News and Telugu News..