Rajya Sabha Elections : రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం
ABN , Publish Date - Dec 11 , 2024 | 04:58 AM
రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్న మూడు సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సీట్లకు మంగళవారం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.
మూడు సీట్లకు మూడే నామినేషన్లు
అమరావతి, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్న మూడు సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సీట్లకు మంగళవారం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఉప సంహరణల గడువు ముగిసిన తర్వాత వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన మంగళవారం అసెంబ్లీ భవనంలో టీడీపీ అభ్యర్థులు బీద మస్తాన్‌రావు, సానా సతీశ్, బీజేపీ ఆభ్యర్థి ఆర్ కృష్ణయ్య ఎన్నికల అధికారి వనితా రాణి ముందు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. టీడీపీ, బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అసెంబ్లీ భవనం కిటకిటలాడింది. ఈ ఎన్నికతో రాజ్యసభలో టీడీపీకి మళ్లీ ప్రాతినిధ్యం దక్కుతోంది. పోయిన ఏడాది కనకమేడల రవీంద్రకుమార్ పదవీ విరమణ తర్వాత రాజ్యసభలో టీడీపీకి సభ్యులు ఎవరూ లేకుండా పోయారు. ఆవిర్భావం తర్వాత టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేనిపరిస్థితి ఏర్పడటం ఇదే ప్రథమం. ఇప్పుడు ఆ పార్టీ తరఫున ఇద్దరు సభ్యులు పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు.
బీసీలకు పెద్ద పీట వేసిన కూటమి: అచ్చెన్న
ఎన్డీయే కూటమి రాష్ట్రంలో బీసీ వర్గాలకు పెద్దపీట వేసిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో రెండు సీట్లను కూటమి పార్టీలు బీసీ వర్గాలకు ఇచ్చాయి. బీజేపీ అభ్యర్థి కృష్ణయ్య తెలంగాణ వ్యక్తి అని కొందరు బుద్ధి లేని విమర్శలు చేస్తున్నారు. ఆయన బీసీ వర్గాలకు జాతీయ నాయకుడు. అన్ని రాష్ట్రాలకు చెందిన వ్యక్తి’ అని అచ్చెన్న అన్నారు.
సొంత ఇంటికి వచ్చాను: బీద
టీడీపీలో చేరడం మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లుందని బీద మస్తాన్‌రావు వ్యాఖ్యానించారు. ‘నేను 39ఏళ్లు టీడీపీలోనే ఉన్నాను. మధ్యలో రెండున్నరేళ్లు మాత్రం వేరే పార్టీలో ఉన్నాను. అలా వెళ్లాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్లడానికి కృషి చేస్తాను’ అని ఆయన చెప్పారు. తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధినేత చంద్రబాబు, యువ నేత లోకేశ్‌కు సానా సతీష్ ధన్యవాదాలు తెలిపారు.