Chandrababu Cabinet: నవతరానికి బాబు.. ‘బరువు’ బాధ్యతలు
ABN , Publish Date - Jun 15 , 2024 | 06:59 AM
మంత్రివర్గంలో కొత్త తరానికి పెద్దపీట వేసిన సీఎం చంద్రబాబు.. శాఖల కేటాయింపులోనూ అదే ఒరవడి కొనసాగించారు. నవతరానికి పెద్ద బాధ్యత లు అప్పగించారు. ఇదే సమయంలో పాతతరానికీ ప్రాధాన్యం కొనసాగించా రు. ప్రతిభ, సామర్థ్యం, నేపథ్యం, అనుభవానికి నడుమ సమతూకం
శాఖల కేటాయింపుపై చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మంత్రివర్గంలో కొత్త తరానికి పెద్దపీట వేసిన సీఎం చంద్రబాబు.. (Nara Chandrababu) శాఖల కేటాయింపులోనూ అదే ఒరవడి కొనసాగించారు. నవతరానికి పెద్ద బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో పాతతరానికీ ప్రాధాన్యం కొనసాగించారు. ప్రతిభ, సామర్థ్యం, నేపథ్యం, అనుభవానికి నడుమ సమతూకం పాటించారు. అలాగే మిత్రపక్షాలకు సముచిత గౌరవం లభించింది. తొలిసారి ఎమ్మెల్యే (పిఠాపురం) గా గెలిచిన జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి.. అటవీ, పర్యావరణం శాఖలు ఇచ్చారు. లోకేశ్(మంగళగిరి)కు ఈసారి మానవ వనరుల అభివృద్ధి శాఖ కేటాయించారు. విద్యా శాఖలోని అన్ని విభాగాలనూ కలిపి 2014లో ఈ శాఖను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఆయనకు పట్టున్న ఐటీ, ఎలకా్ట్రనిక్స్-కమ్యూనికేషన్లను కూడా అప్పగించారు. తొలిసారి మంత్రి అయిన పయ్యావుల కేశవ్(ఉరవకొండ)కు అతిముఖ్యమైన ఆర్థిక శాఖ ఇచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా పనిచేసిన ఆయనకు ఆర్థిక వ్యవహారాలపై మంచిపట్టుంది. నిమ్మల రామానాయుడి(పాలకొల్లు)కి జలవనరుల శాఖ, అనగాని సత్యప్రసాద్(రేపల్లె)కు రెవెన్యూ, గొట్టిపాటి రవి(అద్దంకి)కు విద్యుత్, అచ్చెన్నాయుడి(టెక్కలి)కి వ్యవసాయం, డోలా బాల వీరాంజనేయస్వామి(కొండపి)కి సాంఘిక సంక్షేమం, వలంటీర్లు-గ్రామసచివాలయాల శాఖలు లభించాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(మచిలీపట్నం)కు గనులు, ఎక్సైజ్ శాఖలు కేటాయించారు. టీజీ భరత్(కర్నూలు)కు పరిశ్రమలు, కొండపల్లి శ్రీనివా్‌స(గజపతినగరం)కు చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్.. మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి(రాయచోటి)కి రవాణా, యువజ న వ్యవహారాలు, క్రీడలు దక్కాయి.
సీనియర్లకూ సముచిత గౌరవం
సీనియర్ల గౌరవానికి భంగం కలుగకుండా వారికి సముచిత శాఖలు ఇచ్చారు. వయసులో పెద్దవాడు, సీనియర్ అయిన ఆనం రామనారాయణరెడ్డి(ఆత్మకూరు)కి దేవదాయ శాఖ ఇచ్చారు. తొలుత ఆయనకు ఆర్థిక శాఖ ఇవ్వాలన్న చర్చ జరిగింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 24 గంటలూ క్రియాశీలంగా ఉండాల్సి రావడం.. తరచూ ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆయనపై తీవ్ర ఒత్తిడి పెట్టినట్లు అవుతుందని భావించారు. దీంతో దేవదాయ శాఖ అప్పగించారు. మరో సీనియర్ నేత ఎన్‌ఎండీ ఫరూక్(నంద్యాల)కు న్యాయ శాఖతో పాటు మైనారిటీ సంక్షేమం కేటాయించారు. గతంలో మంత్రిగా చేసిన కొలుసు పార్థసారథి(నూజివీడు)కి గృహ నిర్మాణంతోపాటు సమాచార-పౌర సంబంధాల శాఖ లభించింది.
గత జగన్ ప్రభుత్వం హోం శాఖను దళిత మహిళలకు(తానేటి వనిత, మేకతోటి సుచరిత) ఇచ్చింది. అదే సంప్రదాయాన్ని చంద్రబాబూ కొనసాగించారు. వంగలపూడి అనిత(పాయకరావుపేట)కు ఈశాఖ కట్టబెట్టారు. అనేక మంది మంత్రులు ఆ శాఖను ఆశించినా చివరకు ఆమెకు ఇవ్వడం విశేషం. గిరిజన వర్గానికి చెందిన సంధ్యారాణి(సాలూరు)కి గిరిజన సంక్షేమంతోపాటు మహిళా సంక్షేమ శాఖ దక్కాయి. రాయలసీమకు చెందిన సవిత(పెనుకొండ)కు బీసీ సంక్షేమం, చేనేత శాఖలు లభించాయి. లోకేశ్ సహా ఎవరికీ పాత శాఖలు ఇవ్వలేదు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ(నెల్లూరు సిటీ) ఒక్కరికే గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వహించిన శాఖ(పురపాలక, పట్టణాభివృద్ధి) మళ్లీ దక్కింది. రాజధాని నిర్మాణం పురపాలక శాఖ పరిధిలోకే వస్తుంది. ఆయనకు దానిపై అవగాహన ఉండడంతో కొనసాగించినట్లు సమాచారం. మిత్రపక్షాలకూ మంచి శాఖలు దక్కాయి. జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్(తెనాలి)కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేశ్(నిడదవోలు)కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ లభించాయి. బీజేపీ నేత సత్యకుమార్(ధర్మవరం)కు ఆరోగ్య శాఖ ఇచ్చారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ఇంత ముఖ్యమైన శాఖ నిర్వహించగలరా అన్న చర్చ జరిగింది. అయితే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి సుదీర్ఘకాలం పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.ఢిల్లీ స్థాయిలో మంచి సంబంధాలే ఉన్నందున ఈ శాఖ ఇచ్చారు.