Amaravati : నేడు వైఎస్ జయంతి
ABN , Publish Date - Jul 08 , 2024 | 04:52 AM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
మంగళగిరిలో షర్మిల ఆధ్వర్యాన కార్యక్రమం
హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
ఉదయం ఇడుపులపాయలో ఏకకాలంలో జగన్, షర్మిల నివాళి!
మంగళగిరిలో ప్రత్యేక కార్యక్రమం
హాజరుకానున్న తెలంగాణ సీఎం
ఇడుపులపాయలో ఏకకాలంలో జగన్, షర్మిల నివాళి
అమరావతి, న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రైవేటు కనెన్షన్ సెంటర్‌లో సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. షర్మిల ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్‌రెడ్డి విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వైఎస్ కార్యక్రమ ప్రాంగణానికి వస్తారు. రేవంత్‌తోపాటు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా హాజరుకానున్నారు.
కాగా, సోమవారం ఉదయమే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఏకకాలంలో వైఎస్ ఘాట్ వద్ద వైఎ్‌సకు నివాళులు అర్పించనున్నారు. ఇటీవల జగన్‌కు, షర్మిలకు మధ్య మనస్పర్థలు తలెత్తాక ఇద్దరూ ఒకే సమయంలో ఇడుపులపాయలో వైఎస్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కానీ.. ఈసారి జగన్, షర్మిల ఒకే సమయంలో వైఎ్‌సకు నివాళులు అర్పించనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇడుపులపాయలో వైఎ్‌సకు నివాళులు అర్పించాక.. షర్మిల విజయవాడకు పయనమవుతారు. అక్కడ నుంచి మంగళగిరి చేరుకుని వైఎస్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
వైఎస్ నిస్వార్థ ప్రజాసేవ చేశారు: సోనియా
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జ్ఞాపకాలను తమ పార్టీ ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. మాజీ సీఎం వైఎస్ 75వ జయంతి సందర్భంగా ఆదివారం ఆమె ఒక లేఖ విడుదల చేశారు. ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక మహోన్నత నాయకుడు. అద్భుతమైన ప్రతిభ, చైతన్యం, అంకితభావంతో దేశానికి, ఆంధప్రదేశ్ ప్రజలకు, కాంగ్రె్‌సకు నిస్వార్థంగా సేవ చేసిన నిజమైన దేశభక్తుడు’ అని ఆ లేఖలో కొనియాడారు. వైఎస్ ప్రజాసేవ వారసత్వాన్ని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని అందుకు కృతజ్ఞతలని సోనియా అన్నారు.