Amaravati : మద్యం అక్రమాల సూత్రధారి వాసుదేవరెడ్డే!
ABN , Publish Date - Aug 19 , 2024 | 03:19 AM
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాల్లో అప్పటి బేవజరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డే ప్రధాన పాత్ర పోషించారు. మద్యాన్ని తయారుచేసే డిస్టిలరీల నుంచి విక్రయించే షాపుల వరకు మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచాయి.
డిస్టిలరీల నుంచి షాపుల వరకు ఆయన కనుసన్నల్లోనే
అస్మదీయ సంస్థలకు భారీగా ఆర్డర్లు.. పొరుగు కంటే అదనంగా చెల్లింపు
ఆ అదనపు మొత్తం పెద్దల జేబుల్లోకి.. బార్ పాలసీలోనూ పెత్తనం
సంబంధం లేని ఎక్సైజ్, సెబ్ అధికారుల బదిలీల్లో కూడా జోక్యం
డిస్టిలరీల నుంచి షాపుల వరకు ఆయన కనుసన్నల్లోనే
అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాల్లో అప్పటి బేవజరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డే ప్రధాన పాత్ర పోషించారు. మద్యాన్ని తయారుచేసే డిస్టిలరీల నుంచి విక్రయించే షాపుల వరకు మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే గత ప్రభుత్వంలో మద్యం వ్యాపారం మొత్తాన్ని మాజీ సీఎం జగన్... వాసుదేవరెడ్డి చేతిలో పెట్టారు. డిస్టిలరీస్ కమిషనర్ బాధ్యతలనూ అప్పగించారు. దీంతో సర్వం ఆయన చెప్పినట్లుగానే వ్యవహారాలు సాగాయి.
అదాన్ డిస్టిలరీస్ లాంటి కొత్త కంపెనీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చి వాటికి సంబంధించిన బ్రాండ్లనే మద్యం షాపుల్లో విక్రయించేలా చేశారు. ఇక కమీషన్లు ఇచ్చేది లేదన్న అంతర్జాతీయ కంపెనీలను పక్కన పెట్టారు. ఎంత పాపులర్ బ్రాండ్లు అయినా తమకు సంబంధం లేదని, కమీషన్ ఇచ్చేవారికే ఆర్డర్లు అన్న సింగిల్ లైన్ సొంత మద్యం పాలసీని అనధికారికంగా అమలుచేశారు. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, పెర్నాడ్ రికర్డ్ ఇండియా, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్, జాన్ డిస్టిలరీస్ లాంటి ప్రముఖ ఉత్పత్తి సంస్థలను తరిమేశారు.
2014-19 కాలంలో ఏపీలో 53శాతంగా ఉన్న వారి మార్కెట్‌ను కేవలం 5 శాతానికి పడేశారు. ఇక తమకు సంబంధించిన ఎస్‌ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్, పెరల్ డిస్టిలరీ, ఎస్పీవై ఆగ్రో, సెంటిని బయో ప్రొడక్ట్స్, షర్యానీ అల్కో బ్రూ లాంటి కంపెనీలకు అనూహ్యంగా ఆర్డర్లు పెంచేశారు. వీటిలో కొన్ని టీడీపీ సానుభూతిపరులవి కాగా.. వాటిని తాత్కాలికంగా లీజుకు తీసుకుని, వాటిలో వైసీపీ పెద్దలు వారి బ్రాండ్లను తయారుచేయించారు.
తయారీ కంపెనీలకు ఆర్డర్ల అనంతరం ఏ షాపునకు ఏ బ్రాండ్లు పంపాలనేది కూడా బేవరేజెస్ కార్పొరేషనే నిర్ణయించేది. అయితే ఇందులో వాసుదేవరెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన మరికొందరు అధికారులు కూడా ఉన్నారు. రోజూ వారు చెప్పిన బ్రాండ్లనే షాపుల్లో విక్రయించేలా వ్యాపారాన్ని నియంత్రించారు.
కమీషన్లు ఇచ్చిన మేరకు రొటేషన్ విధానంలో అన్ని బ్రాండ్లనూ విక్రయించేలా చేశారు. ఇక షాపుల్లో డిజిటల్ చెల్లింపులు లేకపోవడం మరో పెద్ద కుంభకోణం. ఐదేళ్లలో రూ.99 వేల కోట్లకు పైగా మద్యం విక్రయాలు రాష్ట్రంలో జరుగగా.. అందులో డిజిటల్ పేమెంట్లు ఒక్క శాతం లోపే.
తొలుత కంపెనీలే కమీషన్లు ఇవ్వాలనే షరతు పెట్టారు. తర్వాత ఇవ్వాల్సిన దాని కంటే అదనంగా ధర చెల్లిస్తామని, అదనంగా ఇచ్చిన మొత్తాన్ని తమకు ఇవ్వాలని స్పష్టంచేశారు. ప్రముఖ కంపెనీలు ఈ విధానానికి ససేమిరా అన్నాయి. తమకు వాస్తవ ధర మాత్రమే ఇవ్వాలని, అదనంగా వద్దని వాదించాయి. దీంతో వాటికి ఆర్డర్లు ఆపేశారు.
అంగీకరించిన కంపెనీలకు మాత్రం పక్క రాష్ర్టాలతో పోలిస్తే ఎక్కువ ధరలు చెల్లించారు. ఉదాహరణకు ఒకే బ్రాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.1,094 చెల్లిస్తే, ఏపీ ప్రభుత్వం రూ.1,697 చెల్లించింది.
ఇలా ఎక్కువ ఇచ్చిన మొత్తాన్ని వైసీపీ పెద్దలకు కమీషన్‌గా ఇచ్చారు. అలా ఐదేళ్లలో రూ.3,113 కోట్లు కమీషన్ల రూపంలో దోపిడీ చేసినట్లు కూటమి ప్రభుత్వ ప్రాథమిక విచారణలో తేలింది. ఇక సంబంధం లేని ఎక్సైజ్, సెబ్ అధికారుల బదిలీల్లోనూ ఆయన జోక్యం చేసుకున్నారు. బార్ పాలసీలోనూ ఆయనే పెత్తనం చేశారు.