Share News

Amaravati : పరువు పోతోంది

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:10 AM

గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఢిల్లీలో రాష్ట్రం పరువు పోతోంది. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలులో ఆయా శాఖలకు చెందిన అప్పటి రాష్ట్ర అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు కొత్త అధికారులకు ఇబ్బందిగా మారింది.

Amaravati : పరువు పోతోంది

  • వారి తప్పులు.. వీరికి తిప్పలు

  • జగన్‌ హయాంలో కేంద్ర స్కీమ్‌ల్లో గోల్‌మాల్‌పై ‘కూటమి’ అధికారులను నిలదీస్తున్న కేంద్రం

  • ఆయా శాఖలకు కొత్త కావడంతో ఇబ్బంది

  • ‘ఉపాధి’లో దొంగ మస్టర్ల నుంచి, జలజీవన్‌ మిషన్‌, పంచాయతీలకు నిధులవరకు ప్రశ్నల పరంపర

  • ఢిల్లీలో జరిగే సమీక్షల్లో ఏది అడిగినా మౌనమే..

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఢిల్లీలో రాష్ట్రం పరువు పోతోంది. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలులో ఆయా శాఖలకు చెందిన అప్పటి రాష్ట్ర అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు కొత్త అధికారులకు ఇబ్బందిగా మారింది. అప్పట్లో జగన్‌ చెప్పినట్లు చేసిన ఐఏఎస్‌ అధికారులు ఇప్పుడు ఆ శాఖల నుంచి మారిపోయారు. కొత్తగా వచ్చిన అధికారులకు ఆయా శాఖల్లో గత ఐదేళ్లలో జరిగిన నిర్వాకాలు తెలియవు. దీంతో ఢిల్లీలో అధికారులు వేసే ప్రశ్నలకు వారంతా కంగుతింటున్నారు. కొంతమంది అధికారులైతే సమీక్ష సమావేశమంతా మౌనంగా కూర్చొని వింటున్నారే తప్ప ఒక్కప్రశ్నకు కూడా సమధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని శాఖలకు సంబంధించి అయితే, రాష్ట్ర అధికారులు గత ఐదేరళ్లూ ఢిల్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు.

వారి స్థానాల్లోకి కొత్తగా వచ్చిన అధికారులకు ఇప్పుడు ఢిల్లీలో నెగ్గుకురావడం ఇబ్బందికరంగా మారిం ది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు, గిరిజన సంక్షేమశాఖ, సామాజిక న్యాయం, సాధికారత, తాగునీటి సరఫరా మంత్రిత్వ శాఖల్లో ఇప్పుడిదే పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు.. గ్రామీణాభివృద్ధిశాఖకు సంబంధించి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన పాలనా ప్రక్షాళనలో భాగంగా ఈ శాఖలో అనేక మార్పులు చేపట్టారు.

కొత్త అధికారులను ఇక్కడ నియమించారు. ‘మీ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు’ అంటూ కేంద్ర అధికారులు నిలదీశారు. దీంతో ఏం సమాధానాలు చెప్పాలో వారికి అర్థం కాలేదు. అప్పట్లో మన రాష్ట్రానికి చెందిన ఉపాధి అధికారి కొన్ని జిల్లాల్లో మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులు విపరీతంగా మంజూరుచేశారని కేంద్ర అధికారులు ఆక్షేపించారు. కొన్ని జిల్లాల్లో లేబర్‌ కాంపోనెంట్‌కు అనుగుణంగా కాకుండా అధికంగా ఆ అధికారి పనులు చేయించారని తప్పుబట్టారు.


ఇలా.. సమీక్ష సమావేశం జరిగినంతసేపు కేంద్ర అధికారులు ప్రశ్నలు వేస్తూనే ఉండగా, ఎలా స్పందించాలో తెలియక మన అధికారులు ఇబ్బంది పడ్డారు. నిజానికి, ఉపాధి హామీ పథకంలో ఒకప్పుడు మన రాష్ట్రం ఒక వెలుగు వెలిగింది. ఏ వినూత్న కార్యక్రమాలను ఈ పథకం కింద చేపట్టినా అవి ఏపీలోనే ప్రారంభమయ్యేవి. మన రాష్ట్రంలోనే మొదట ఉపాధి హామీ పథకానికి సంబంధించి సాప్ట్‌వేర్‌ రూపకల్పన చేశారు. అనంతరం దీని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సొంత సాంకేతిక వ్యవస్థను ఏర్పాటుచేసింది. అప్పట్లో మన రాష్ట్ర అధికారులకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో పరపతి, పలుకుబడి ఉండేవి. వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత అవన్నీ తెరమరుగయ్యాయి. కూలీలతో పనులు చేయించకుండా దొంగ మస్టర్లు వేయించి అధిక వేతనాలు డ్రా చేయ డం, అనుమతి లేని జగనన్న లేఅవుట్ల చదును పనులు, సచివాలయ భవనాల నిర్మాణాల పనులు చేపట్టడంవంటి చిల్లర పనులతో కేంద్రం ఎదుట రాష్ట్రం ప్రతిష్ఠను దిగజార్చింది.


యూసీలేవీ.. ఆ నిధులు వాడలేదేం?

పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ఆ శాఖ అధికారులు గతం లో కేంద్ర అధికారుల ముందు తలెత్తుకోలేని పరిస్థితి ఉండేది. కొత్తగా వచ్చిన అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రభు త్వం వచ్చిందని, ఇక నుంచి అలా జరగదని కేంద్ర అధికారులను ఒప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇక కేంద్ర గిరిజన శాఖ ఇచ్చిన నిధులకు యూసీలు కూడా సమర్పించని పరిస్థితి! ఈ కారణంగా పలు దఫాలు నిధులు ఆగిపోయాయి. మనఅధికారులు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా కేంద్ర అధికారులు యూసీల ప్రస్తావన తెస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి! మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖల్లో కేంద్రం అప్పట్లో అమృత్‌ మిషన్‌ ద్వారా ఇచ్చిన నిధులను జగన్‌ ప్రభుత్వం ఖర్చు చేయలేదు. దీనిపైనా ఢిల్లీలో కురుస్తున్న ప్రశ్నలవర్షంతో మన అధికారులు ఇబ్బంది పడుతున్నారు.


ఇదేం జంఝాటం?

గత జగన్‌ ప్రభుత్వం నిర్వాకంతో ‘జల్‌జీవన్‌ మిషన్‌’ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కేంద్రం ఇచ్చిన నిధులను వేరే అవసరాలకు వాడుకోవడం, పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులివ్వకపోవడం, రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వంలో జల్‌జీవన్‌మిషన్‌ అధికారులుగా పనిచేస్తున్న వారు ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. ఈ పథకం అమలు అస్తవ్యస్తంగా ఉన్నదంటూ కేంద్ర అధికారులు నిలదీస్తుంటే, మన అధికారులకు తలలు పట్టుకుని కూర్చున్నారు.

Updated Date - Aug 16 , 2024 | 03:10 AM