Amaravati : లేట‘రైట్.. రైట్’!
ABN , Publish Date - Aug 04 , 2024 | 04:26 AM
ప్రభుత్వం మారింది! కానీ... పరిస్థితులను మాత్రం వైసీపీ అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గతంలో అడ్డగోలుగా తవ్వుకున్న లేటరైట్ ఖనిజాన్ని ఇప్పుడు దర్జాగా తరలించుకుపోతున్నారు.
జగన్ ప్రభుత్వంలో తవ్వకాలు.. ఇప్పుడు తరలింపు
అది నాణ్యమైన లేటరైట్.. ప్రాసెస్ చేస్తే బాక్సైట్
లీజు ఒకచోట.. తవ్వకాలు చేసింది మరోచోట
కూటమి సర్కారులోనూ వైసీపీ నేతల బరితెగింపు
ప్రత్తిపాడులోని ఓ యార్డ్‌లో లక్షన్నర టన్నుల నిల్వ
జగ్గయ్యపేటకు కొంత.. ‘కాకినాడ’కు మరికొంత
విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు కొల్లగొట్టే యోచన
కాకినాడ గనుల అధికారిని సెలవుపై పంపిన వైనం
ఆ వెంటనే ఆరు జేసీబీలతో తరలింపు ప్రక్రియ మొదలు
గాలి జనార్దన్‌రెడ్డి లీజుకు తీసుకున్నది ఓబుళాపురం గనులు! ఖనిజాన్ని తవ్వింది మాత్రం కర్ణాటకలో! అక్కడ తవ్వుకున్న నాణ్యమైన ఖనిజాన్ని తరలించేందుకే ‘ఓబుళాపురం’ అనే ముసుగు! ఏపీలో అచ్చంగా ఇలాగే జరిగింది. కాకపోతే... అక్కడ ఇనుప ఖనిజం. ఇక్కడ లేటరైట్. జగన్ ప్రభుత్వంలో ఉండగా అక్రమంగా తవ్వుకొని దాచిపెట్టుకున్న లక్షన్నర టన్నుల లేటరైట్‌ను ఇప్పుడు గుట్టుగా తరలిస్తున్నారు. దానికి రాయల్టీ, సీనరేజీ ఇతర ఫీజులేవీ ఉండవు. ఎందుకంటే దానికి ఏ అనుమతీ లేదు కాబట్టి. దాని విలువ రూ.120 కోట్లపైమాటే!.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే అసైన్డ్ భూముల అక్రమాలు, అమరావతి నిర్మాణం తదితర అంశాల్లో బిజీబిజీగా ఉంటోంది. ఇదే సరైన సమయం అనుకున్న వైసీపీ నేతలు లేటరైట్‌ను సైలెంట్‌గా తరలించుకుపోతున్నారు. ముడి ఖనిజాన్ని ప్రాసెస్ చేయగా వచ్చే బాక్సైట్‌ను కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. తమ పని సజావుగా సాగేందుకు కాకినాడకే చెందిన గనులశాఖ కీలక అధికారిని సెలవుమీద పంపించేశారు!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం మారింది! కానీ... పరిస్థితులను మాత్రం వైసీపీ అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గతంలో అడ్డగోలుగా తవ్వుకున్న లేటరైట్ ఖనిజాన్ని ఇప్పుడు దర్జాగా తరలించుకుపోతున్నారు. జగన్ హయాంలో ఓ జిల్లా పేరిట ఏర్పాటైన కంపెనీ ప్రత్తిపాడు మండలం చింతలూరు పరిధిలో లేటరైట్ లీజు పొందింది. నిజానికి... అక్కడ నాణ్యమైన లేటరైట్ లేదు. అది తెలిసీ అక్కడ లీజు తీసుకున్నారు. ఈ లీజును అడ్డుపెట్టుకొని, పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోని లేటరైట్ కొండను తవ్వుకోవాలన్నది వారి అసలు ఆలోచన.
ఇందుకు అక్కడి అటవీ, గనుల శాఖ అధికారులు సహకరించేలా అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. ఎన్నికల ముందు వరకు 10 లక్షల టన్నుల లేటరైట్‌ను అటవీప్రాంతంలో తవ్వితీశారు. ఆ లేటరైట్ తమ లీజు ఏరియాలోనే తవ్వినట్లుగా రికార్డులు మార్చేశారు. అదే పద్ధతిలో సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకున్నారు. అప్పుడు ఈ లీజును ప్రత్యక్షంగా పరోక్షంగా వైసీపీకి చెందిన ఓ కీలకనేత కుమారుడే చూసుకున్నారు. ఆయన కనుసన్నల్లోనే అడవిలో విలు వైన లేటరైట్‌ను అక్రమంగా తవ్వితీసినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గనులశాఖ అక్రమాలపై దృష్టిపెట్టింది.
దాదాపు నెలరోజుల పాటు గనులశాఖ డైరెక్టరేట్, ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయాలు సీజ్‌చేసింది. దీంతో ఆ లేటరైట్ తరలింపును వాయిదా వేసుకున్నారు. ఇటీవలి కాలంలో ఖనిజాల తరలింపునకు ఇచ్చే పర్మిట్లపై సందిగ్ధం నెలకొంది. సీనరేజీ కాంట్రాక్టు ఉన్న ఏడు ఉమ్మడి జిల్లాలు, ఆన్‌లైన్ విధానం నడిచే ఆరు జిల్లాల్లోనూ మైనింగ్ పర్మిట్లు ఇవ్వడం లేదు. దీంతో ప్రత్తిపాడులోని లేటరైట్‌ను తరలించకూడదనుకున్నారు.
ఇంతలో మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లకు నిప్పుపెట్టిన వ్యవహారం తెరమీదకు వచ్చింది. ప్రభుత్వ దృష్టి దానిపైకి వెళ్లింది. వివిధ అంశాలపై శ్వేతపత్రాల విడుదల, అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. సందట్లో సడేమియా అన్న చందంగా.. ఇదే సమయంలో కాకినాడ గనుల శాఖ కీలక అధికారి శుక్రవారం సెలవు మీద పంపించారు.
అదేరోజు సాయంత్రం 6.30గంటల నుంచి ప్రత్తిపాడులో డంప్ ఉన్న ఏరియాకు 6జేసీబీలు తీసుకొచ్చి లేటరైట్‌ను తరలించడం ప్రారంభించారు. దీనిలో కొంతభాగాన్ని రాత్రివేళ్లలో జగయ్యపేటకు, మరికొంత కాకినాడ పోర్టు ఏరియాకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఆ లేటరైట్ అత్యంత నాణ్యమైనది. దాన్నిప్రాసెస్ చేస్తే అందులోనుంచి బాక్సైట్ కంటెంట్ వస్తుంది. దాన్ని కాకినాడ పోర్టుద్వారా విదేశాలకు తరలించాలన్నది వైసీపీ పెద్ద ప్లాన్ అని తెలిసింది. ఇందుకు అమెరికా కంపెనీతో ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం కొలువుతీరినా ఎందుకిలా?
ఏపీలో 2నెలలుగా మైనింగ్ పర్మిట్లు లేవు. రవాణా లేదు. సిమెంట్ ప్యాక్టరీలకు లేటరైట్ కొరత ఏర్పడటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం టన్ను లేటరైట్ 4,800 నుంచి 5,600 మేర విక్రయిస్తున్నారు. ఈ ధరకే సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇవ్వాలని వైసీపీ ప్రయత్నం. రవాణా విషయంలో సమస్యలు రాకుండా స్థానిక ప్రతినిధులతో వైసీపీ పెద్ద నేత లోపాయికారి ఏర్పాట్లు చేసుకున్నారని, దీంతో తరలింపు సజావుగా సాగుతున్నట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ నేతల ఆక్రమాలు ఆగడం లేదని, వారి బరితెగింపునకు అడ్డూఅదుపు లేకుండా పోయిందనడానికి ఇంతకుమించిన నిదర్శనం ఏముంటుంది?
50వేల టన్నులు భారతి సిమెంట్స్‌కు?!
ఎన్నికల సమయం నాటికి మరో 2లక్షల టన్నుల లేటరైట్‌ను తవ్వారు. అందులో 50వేల టన్నులు భారతి సిమెంట్స్‌కు తరలించినట్లు తెలిసింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం, రహదారి తనిఖీలు, చెక్‌పోస్టుల పరిశీలన ఎక్కువకావడంతో ప్రత్తిపాడులోని ఓ కంపెనీ యార్డ్‌లో నిల్వచేసినట్లు తెలిసింది. ఇది సుమారు లక్షన్నర టన్నులు ఉంటుందని అంచనా. మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని, తిరిగి సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేయవచ్చని వైసీపీ నేతలు భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి.