Share News

Amaravati : బాబు సర్కారులో ‘జగన్‌’ చొరబాటు!

ABN , Publish Date - Jun 19 , 2024 | 03:31 AM

కొత్త ప్రభుత్వం ఏర్పడింది! కానీ... చాలా శాఖల్లో పాత అధికారులే కొనసాగుతున్నారు! కొందరిపైనే దృష్టి సారించి, మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా చాలామంది వివాదాస్పద, వైసీపీ అనుకూల అధికారులను ప్రస్తుతానికి అలాగే వదిలేశారు.

Amaravati : బాబు సర్కారులో ‘జగన్‌’ చొరబాటు!

కీలక శాఖల సారథులుగా ఇంకా పాత అధికారులే

వారిని మార్చడంపై దృష్టి పెట్టని చంద్రబాబు

సందట్లో సడేమియాగా పోస్టింగ్‌ల జాతర

మధ్యస్థాయి అధికారులుగా జగన్‌ భక్తులు

2014-19నాటి టెక్నిక్‌ వాడుతున్న వైసీపీ

అధికారులు, సిబ్బంది ద్వారా సమాచార సేకరణ

వక్రీకరించి రోత పత్రికలో అడ్డగోలు కథనాలు

జగన్‌ అధికారంలోకి రాగానే అందరిపైనా నిఘా

ఇప్పుడూ ప్రభుత్వంలోకి ఆయనమనుషుల చేరిక!?

మైన్స్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ వంటి కీలక విభాగాల్లో వైసీపీ ప్రభుత్వం వందల మందిని జొప్పించింది. వీరంతా దిగువ, మధ్యస్థాయి అధికారులే. ఇప్పుడూ వాళ్లనే కొనసాగిస్తే... అవి ప్రభుత్వ కార్యాలయాలుగా కాకుండా, వైసీపీ ఆఫీసులుగానే పని చేస్తాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆడిట్‌ విభాగం అధికారిణి మాధురి... వైసీపీ హయాంలో ధనుంజయ రెడ్డి పేషీలో పని చేశారు. ఆమెకు కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో... ఆరోగ్యశ్రీలోని ఆర్థిక విభాగంలోకి జొప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఆరోగ్యశ్రీలో పోస్టుకు ధనుంజయ్‌ రెడ్డి ఓఎస్డీ దరఖాస్తు

నిమిషాల్లోనే ప్రాసెస్‌ చేసిన ఉన్నతాధికారులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కొత్త ప్రభుత్వం ఏర్పడింది! కానీ... చాలా శాఖల్లో పాత అధికారులే కొనసాగుతున్నారు! కొందరిపైనే దృష్టి సారించి, మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా చాలామంది వివాదాస్పద, వైసీపీ అనుకూల అధికారులను ప్రస్తుతానికి అలాగే వదిలేశారు. భవిష్యత్తులో వీరికీ స్థాన చలనం తప్పకపోవచ్చు. కానీ, ఈలోపే ఆయా ఉన్నతాధికారుల ద్వారా తమకు అనుకూలమైన దిగువ, మధ్యస్థాయి సిబ్బందిని జొప్పించేందుకు వైసీపీ వ్యూహ రచన చేసింది. ఆ ఉన్నతాధికారులు బదిలీ అయిపోయినా... వైసీపీ మనుషులు మాత్రం ఆ శాఖలోనే ఉంటారు. తమకు కావాల్సిన సమాచారాన్ని, ముఖ్యమై న విషయాలను వారి ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు. 2014-19 మధ్య జగన్‌ ఇదే టెక్నిక్‌ ఉపయోగించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ... దిగువ, మధ్యస్థాయి అధికారుల ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని తెలుసుకునేవారు. దానిని వక్రీకరించి, కల్పితాలు జోడించి తన రోత పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురించేవారు. అనేక శాఖల నుంచి ప్రభుత్వం లో కీలకమైన ఫైల్స్‌ కూడా జగన్‌ శిబిరానికి అందేవి. ముం దుగానే ఉన్నతాధికారులతో ఏర్పచుకున్న సన్నిహిత సంబంధాలను ఈ విధంగా ఉపయోగించుకునేవారు. కొందరు అధికారులు చంద్రబాబు వద్ద విధేయత నటిస్తూనే కీలక సమాచారాన్ని జగన్‌కు అందించేవారు. ఈ విషయాన్ని అప్పటి సీఎం చంద్రబాబు ఆలస్యంగా గుర్తించారు. కానీ, అప్పటికే ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


తన హయాంలో కట్టుదిట్టంగా...

గతంలో టీడీపీ ప్రభుత్వ సమాచారాన్ని అందించి, సహకరించిన అధికారులకు... జగన్‌ అధికారంలోకి రాగానే కీలకమైన స్థానాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆ తర్వాత తనకు అవసరమైన దోపిడీకి వాడుకున్నారు. అంతేకాదు... తన ప్రభుత్వంలో చిన్న కాగితం, అతి చిన్న సమాచారం కూడా బయటికి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. పైస్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బంది దాకా ఎవరూ మీడియాతో మాట్లాడకుండా నిఘాపెట్టారు. చిన్న అనుమానం వచ్చినా వేటు వేసేవారు.

ఇప్పుడు మళ్లీ అదే టెక్నిక్‌

అధికారం కోల్పోగానే జగన్‌ మళ్లీ పాత టెక్నిక్‌ తెరపైకి తెస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇంకా చాలామంది ఉన్నతాధికారులను పక్కకు తప్పించకపోవడంతో... ఆయా శాఖల్లో ఇప్పటికీ జగన్‌ అనుకూల అధికారులే కొనసాగుతున్నారు. ఇప్పుడు వారి ద్వారా తమకు కావాల్సిన వారిని దిగువ, మధ్యస్థాయి ఆఫీసర్లను జొప్పించే కార్యక్రమం మొదలైంది. ఉదాహరణకు.. జగన్‌ పేషీలో చక్రం తిప్పిన ధనుంజయ రెడ్డి దగ్గర ఓఎ్‌సడీగా పని చేసిన మాధురిని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధంచేశారు. ఆడిట్‌ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఆమె ఏనాడూ ఫోకల్‌ పోస్ట్‌లో పని చేయలేదు. కేవలం తమ పేషీల్లో విధులు నిర్వహించారన్న ఒకే ఒక కారణంతో ధనుంజయ రెడ్డి, జవహర్‌ రెడ్డి కలిసి ఆమెకు కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ కట్టబెట్టాలనుకున్నారు. ప్రభుత్వం మారడంతో అది కాస్తా ఆగింది. మొత్తం ఆ లిస్ట్‌నే ప్రభుత్వం వెనక్కి తెప్పిస్తోంది. అయితే... ఇప్పుడు మాధురికి ఆరోగ్యశ్రీ ట్రస్టులో ఫైనాన్స్‌ విభాగంలో జేఈవో పోస్టు కట్టబెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. ‘ఆ పోస్టు ఖాళీగా ఉంది. నాకు ఇప్పించండి’ అని మంగళవారం ఆమె ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ కృష్ణబాబుకు దరఖాస్తు సమర్పించారు. ఆమె దరఖాస్తును అధికారులు ప్రాసెస్‌ చేసేశారు. రేపోమాపో ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. అలానే గత ప్రభుత్వంలో కీలకమైన కార్పొరేషన్‌లో విధులు నిర్వహించిన ఒక అధికారి ఇప్పుడు సీఎంవోలో చేరిపోయారు. ఇలా గత ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో విధులు నిర్వహించిన అధికారులు మళ్లీ తమకు అనుకూలంగా ఉండే ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి పోస్టింగ్‌ లు కోరుతున్నారు. ఇలాంటి వారి వల్ల ప్రభుత్వానికి నష్టమేనని కొంత మంది అధికారులు భావిస్తున్నారు. పోస్టింగ్‌ ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

Updated Date - Jun 19 , 2024 | 03:31 AM