Share News

Amaravati : జేటీసీలూ బెజవాడ వచ్చేయండి

ABN , Publish Date - Aug 19 , 2024 | 03:42 AM

రవాణా శాఖలో సంచలన ఆదేశాలు వెలువడ్డాయి. ఒకేసారి నలుగురు జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ల(జేటీసీ)ను ప్రభుత్వం కమిషనరేట్‌కు పంపించింది. 24 గంటల్లో విజయవాడలోని రవాణా కమిషనరేట్‌కు వెళ్లి కమిషనర్‌ అప్పగించిన బాధ్యతలు చేపట్టాలని ఆదివారం నిర్దేశించింది.

Amaravati : జేటీసీలూ బెజవాడ వచ్చేయండి

  • కమిషనరేట్‌లో 24 గంటల్లో రిపోర్టు చేయండి

  • ప్రభుత్వ ఆదేశాలు.. రవాణా శాఖలో కలకలం

  • పెద్దిరెడ్డి కుడిభుజం సహా నలుగురు జాయింట్‌ కమిషనర్లకు షాక్‌

  • వైసీపీ ప్రభుత్వంలో వసూళ్ల కోసం జిల్లాల్లో ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు

  • ఇప్పుడు వాటి మూసివేతకు ఉత్తర్వులు

అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రవాణా శాఖలో సంచలన ఆదేశాలు వెలువడ్డాయి. ఒకేసారి నలుగురు జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ల(జేటీసీ)ను ప్రభుత్వం కమిషనరేట్‌కు పంపించింది. 24 గంటల్లో విజయవాడలోని రవాణా కమిషనరేట్‌కు వెళ్లి కమిషనర్‌ అప్పగించిన బాధ్యతలు చేపట్టాలని ఆదివారం నిర్దేశించింది.

సెలవు రోజు వెలువడిన ఈ ఉత్తర్వులు రవాణా శాఖలో ఒక్కసారిగా కలకలం రేపాయి. వివరాల్లోకి వెళ్తే.. రవాణా శాఖలో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) నుంచి డిప్యూటీ రవాణా కమిషనర్‌ (డీటీసీ) వరకూ జిల్లాల్లో ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటారు. ఆర్టీఏ కార్యాలయాల్లో ఉండే వీరికి ఆదాయం కూడా బాగానే ఉంటుంది. అయితే జేటీసీలుగా పదోన్నతి పొందాక రాష్ట్ర కమిషనరేట్‌లో పని చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆదాయానికి ఆస్కారం బాగా తక్కువ. పని మాత్రం ఉంటుంది. ఇక్కడకు వచ్చి వెట్టి చాకిరీ చేయడం కన్నా.. నాలుగు ప్రాంతీయ ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు సృష్టించుకుని జిల్లాల్లోనే వసూళ్లు, పెత్తనాలు సాగించేందుకు రాయలసీమకు చెందిన ఒక జేటీసీ.. జగన్‌ హయాంలోనే పథకం వేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో మనిషిలా ఉండే ఈయన మిగతా జేటీసీలతో అవగాహనకు వచ్చారు.


తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలుగా ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కమిషనరేట్‌లో జేటీసీలకు చాలా పని ఉంటుందని, ప్రాంతీయ కార్యాలయాలు అవసరమే లేదని కమిషనర్‌ ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు ససేమిరా అనేసింది. అయినా వెనక్కి తగ్గకుండా ఎంవీఐలపై పడిన నలుగురు జేటీసీలు.. బల్లలు, కుర్చీలు వారితోనే తెప్పించుకుని ఆ నాలుగు నగరాల్లో ఆఫీసులు ఏర్పాటు చేసేసుకున్నారు.

ప్రభుత్వం మారిన రెండు నెలల తర్వాత రవాణా మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి ఆ శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా అసలు సమస్య చెప్పారు. కమిషనరేట్‌లో ముగ్గురు జేటీసీలు ఉంటే ఒకరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని.. మరొకరు నెలాఖరుకు అదనపు కమిషనర్‌ అవుతున్నారని, మిగిలిన ఏకైక జేటీసీతో మొత్తం పనంతా చేయించడం కష్టమని వివరించారు.


దీనిపై ‘పని ఇక్కడ.. అధికారులు అక్కడ’ అన్న శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ఇటీవల వార్త ప్రచురించింది. సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన మంత్రి.. జిల్లాల్లో జేటీసీ కార్యాలయాలను తీసివేయించి నలుగురినీ కమిషనరేట్‌కు పంపేలా ఉత్తర్వులు ఇప్పించారు.

దీంతో తిరుపతి జేటీసీ బసిరెడ్డి, గుంటూరు జేటీసీ కృష్ణవేణి, విజయవాడ జేటీసీ శివరామ్‌ ప్రసాద్‌, విశాఖపట్నం జేటీసీ సుందర్‌ తక్షణమే కార్యాలయాలు మూసేసి సోమవారం రవాణా కమిషనర్‌ సిన్హాకు రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలవడ్డాయి. ఆదివారం సెలవు రోజైనప్పటికీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఉత్తర్వులు జారీ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Aug 19 , 2024 | 08:15 AM