Share News

Education : ఐటీ సెల్‌లో అనకొండ

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:24 AM

ఆయన విధులకు రానే రారు. ఒక వేళ రావాలనుకుంటే.. ఉదయం పదిన్నర లేదా.. 11 గంటలకు వస్తాడు. ఐటీ సెల్‌లో ఇలా కూర్చుని అలా వెళ్తాడు. ఎవరైనా ఎక్కడికని అడిగితే.. ‘అర్జంటుగా కలెక్టర్‌ గారు పిలిచారు..’ అని చెబుతాడు. ఆఫీస్‌ బయటకు వచ్చి, ఒక దమ్ము లాగేస్తాడు. ఇకఅంతే..! మధ్యాహ్నం వస్తే వస్తాడు.. లేకపోతే లేదు. మళ్లీ సాయంత్రం ఎంట్రీ ఇస్తాడు. ఇప్పటికి ఐదుగురు డీఈఓలు మారినా.. ఆయనను ఏం ...

Education : ఐటీ సెల్‌లో అనకొండ
DEO Office

డీఈఓ కార్యాలయంలో హవా

విధులకు రాడు.. వస్తే ఉండడు..!

‘కలెక్టర్‌ పిలుస్తున్నారు..’ అని మస్కా

బదిలీలు.. సర్దుబాట్లలో భారీగా అక్రమాలు

ఐదుగురు డీఈఓలు మారినా.. అదే పరిస్థితి

ఆయన విధులకు రానే రారు. ఒక వేళ రావాలనుకుంటే.. ఉదయం పదిన్నర లేదా.. 11 గంటలకు వస్తాడు. ఐటీ సెల్‌లో ఇలా కూర్చుని అలా వెళ్తాడు. ఎవరైనా ఎక్కడికని అడిగితే.. ‘అర్జంటుగా కలెక్టర్‌ గారు పిలిచారు..’ అని చెబుతాడు. ఆఫీస్‌ బయటకు వచ్చి, ఒక దమ్ము లాగేస్తాడు. ఇకఅంతే..! మధ్యాహ్నం వస్తే వస్తాడు.. లేకపోతే లేదు. మళ్లీ సాయంత్రం ఎంట్రీ ఇస్తాడు. ఇప్పటికి ఐదుగురు డీఈఓలు మారినా.. ఆయనను ఏం చేయలేకపోయారంటే.. ఆయన హవా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. బదిలీలు, సర్దుబాట్లలో ఆయన చేయి తడిపిన తీరును చూస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆయన ఒక ఉపాధ్యాయుడు. ఎందరో ఉపాధ్యాయులను మింగిన అనకొండ.! ఐటీ సెల్‌లోని అనకొండ అవినీతి బాగోతంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సిద్ధమయ్యారు.


అనంతపురం విద్య, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): చిన్న చేపలను పెద్ద చేపలు తింటాయి. ప్రకృతి ధర్మం అది. కానీ గురువులను మింగుతున్నాడు మరో గురువు. అయినవాళ్ల కోసం అడ్డంగా అయ్యవార్లను ముంచేస్తున్నాడు. కథ. ఉపాధ్యాయుల బదిలీల్లో, సర్దుబాట్లలో కనీవినీ ఎరుగని మాయ చేస్తుంటారు. తన అనుకున్నవారికి, చేయి తడిపినవారికి ఎన్నోమార్లు లబ్ధి చేకూర్చాడు. 2022-2023 బదిలీల్లో అదనపు పాయింట్లకు రూ.50 వేలు, ఆపైన వసూలు చేసి.. కొందరిని భారీగా ప్రయోజనం చేకూర్చాడు. వందలాది మందికి అన్యాయం చేశాడు. మరీ ముఖ్యంగా టీచర్ల సర్దుబాటులో తనకు అయినవారైన సర్‌ప్లస్‌ టీచర్లను సైతం సర్‌ప్లస్‌ కాదని చూపించి.. అయాచిత లబ్ధి చేకూర్చాడు. సర్దుబాటులో సైతం అర్హులైన ఎందరో టీచర్లను ముంచేశాడు. ఒక వైపు 10వ తరగతి విద్యార్థులకు బోధించే సబ్జక్టు టీచర్ల లేక ఇబ్బందులు పడుతుంటే.. వారి భవిష్యత్తు పట్టకుండా అయినోళ్లకు కోసం అనేక అక్రమాలు చేశాడు. ఎంత తవ్వితే అంత అవినీతి, అన్ని అక్రమాలు బయట పడుతున్నాయి. దీంతో ఆయన వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు సిద్ధమయ్యారు. ఐదుగురు డీఈఓలు మారినా ఆయన అక్రమాలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మాటలతో అంతలా మాయ చేయగలడు మాస్టారు. ‘కలెక్టర్‌ బాగా తెలుసు, ఐఏఎస్‌, ఐఆర్‌ఎ్‌సలు తెలుసు’ అని డీఈఓలకు చెబుతుంటాడు. పరోక్షంగా భయపెడుతుంటాడు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అని డీఈఓలు చూసీచూడనట్లు వ్యవహరించారు. ఇదే అదనుగా ఆయన పబ్బం గుడుపుకుంటున్నారు. విద్యాశాఖలో ఎవరిని కదిలించినా ఆయన గురించి గుక్క తిప్పుకోకుండా చెబుతుంటారు. కార్యాలయం లోపల, బయట ఆయన గురించి బహిరంగ చర్చ నడుస్తుంటుంది.

సర్దుబాటులో చేతివాటం

విద్యాశాఖలో ఐటీ సెల్‌ కీలకం. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాలల సమగ్ర వివరాలు ఐటీ సెల్‌లో పనిచేసే టీచర్ల వద్దే ఉంటాయి. ఉపాధ్యాయుల బదిలీలు, సర్దుబాట్లులో ఈ సెల్‌లో పనిచేసేవారు అందించే సమాచారం అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఇదే అదునుగా ఉపాధ్యాయుల సర్దుబాటును తనకు అనకూలంగా మార్చుకుని.. దందాకు తెరలేపారు ఆయన. ఉపాధ్యాయులను కదిలించేందుకు, అక్రమ వసూళ్లకు ఐటీ సెల్‌ను అడ్డాగా మార్చాడు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటులో భారీగా గోల్‌ మాల్‌ చేశాడు. 2024 టీచర్ల సర్దుబాటులో కనీవినీ ఎరుగని అక్రమాలు చేశాడు. గతంలో ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు లేవు. చాలా మంది ఇంగ్లిష్‌ టీచర్లు ఉద్యోగోన్నతులు కావాలని కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవలి సర్దుబాటులో భారీగా ఇంగ్లిష్‌, సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్ల సర్దుబాటులో సర్‌ప్లస్‌ టీచర్లను సైతం సర్‌ప్లస్‌ టీచర్లు కాదని చూపించి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.

బదిలీల్లో పాయింట్లకు లెక్కలు

2022-23 ఉపాధ్యాయ బదిలీల్లోనూ అనకొండ మాస్టారు భారీగానే చేతివాటం ప్రదర్శించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియలో చివరగా డీఈఓ కార్యాలయంలో ఎడిట్‌ ఆప్షన ఉటుంది. ఏదైనా తప్పు జరిగి ఉంటే.. ఉపాధ్యాయులు చివరల్లో సరిచేసుకోవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకున్న అనకొండ మాస్టారు.. అయినవారికి ఎడాపెడా పాయింట్లు ఇచ్చేశాడు. ఒక్కో టీచర్‌ నుంచి రూ.50వేలు, ఆపైన వసూలు చేశాడు. ఇలా రూ.లక్షలు చేతులు మారాయి. చాలా మండలాల నుంచి ఎంఈఓలు పంపిన టీచర్ల పాయింట్లకు, డీఈఓ కార్యాలయంలో నమోదైన పాయింట్లకు తేడాలు కనిపించాయి. తాడిపత్రి నియోజకవర్గంలోని ఓ మండల విద్యాశాఖాధికారి తన మండంలోని టీచర్ల వివరాలు ఇస్తే.. చివరలో తారుమారయ్యాయి. అనకొండ టీచర్‌ తనకు కావాల్సిన నలుగురు టీచర్ల పాయింట్లను అమాంతం పెంచేసి, బదిలీల్లో ఎక్కువ పాయింట్లు వచ్చేలా చేశారు. ఈ విషయం తెలుసుకున్న తాడిపత్రి నియోజకవ వర్గంలోని ఓ ఎంఈఓ గొడవ పడినట్లు తెలిసింది.

కలెక్టర్‌ పేరు వాడేయటమే..

ఐటీ సెల్‌లో పనిచేసే అనకొండ టీచర్‌ వ్యవహారం నిత్యం వివాదాస్పదం అవుతోంది. డీఈఓ ఆఫీస్‌ ఐటీ సెల్‌లో ఉండాల్సిన ఆయన.. గంటపాటు కూడా అక్కడ కనిపించడు. దీని గురించి డీఈఓలు అడిగితే.. ‘సార్‌... కలెక్టర్‌ నుంచి ఫోన వచ్చింది. డీఈఓ ఆఫీస్‌ నుంచి ఎవరో ఒకరు వెంటనే రావాలని అంటున్నారు’ అని చెప్పి మస్కా కొడతాడు. కలెక్టర్‌ పేరు చెబితే ఎవరూ ఆపరని ఆయన ధీమా. రెండు మూడేళ్లుగా ఆయన ఇదే డ్రామా నడిపిస్తున్నాడని డీఈఓ కార్యాలయ, సమగ్రశిక్ష ప్రాజెక్టు సిబ్బంది బహిరంగంగా చెబుతున్నారు. కలెక్టర్‌కు అవసరమైతే ఏ శాఖ నుంచైనా ఆ శాఖాధిపతిని పిలిపిస్తారు. డీఈఓ ఆఫీస్‌ విషయాల గురించి అయితే.. నేరుగా డీఈఓనే పిలుస్తారు. ఇక్కడ మాత్రం డీఈఓ, డిప్యూటీ డీఈఓలు, ఏడీలు, సూపరింటెండెంట్లను కాదని.. అనకొండ మాస్టారును పిలుస్తుంటారట..! గడిచిన మూడేళ్లలో శామ్యూల్‌, వెంకటకృష్ణారెడ్డి, సాయిరాం, నాగరాజు, వరలక్ష్మి.. ఇలా ఐదుగురు డీఈఓలు పనిచేసి వెళ్లారు. తాజాగా ఆరో డీఈఓ వచ్చారు. ఇప్పుడైనా పరిస్థితిలో మార్పు వస్తుందా..? రాదా..? అనే చర్చ జరుగుతోంది. అనకొండ టీచర్‌ డామినేషన, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. టీచర్ల సర్దుబాటు, బదిలీల్లో అక్రమాల గురించి విచారణ చేయిస్తే.. అనకొండ గుట్టు రట్టు అవుతుందని అంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 20 , 2024 | 12:24 AM