Share News

Poisonous fevers : పాడు జ్వరం

ABN , Publish Date - Sep 02 , 2024 | 12:17 AM

జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. వారంలోనే నలుగురు జ్వరంతో మరణించారు. డెంగీ జ్వరంతో చనిపోయారని కుటుంబసభ్యులు అంటున్నా, జిల్లా వైద్యాధికారులు మాత్రం అవి డెంగీ మరణాలు కావని కొట్టి పారేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రత అధ్వానంగా మారింది. దీంతో దోమలు బెడద ఎక్కువైపోయింది. ఇంట్లో, బయట ఎక్కడ కూర్చున్నా, పడుకున్నా దోమలు దాడి...

Poisonous fevers : పాడు జ్వరం
Patients queuing up for OP at district hospital

వారంలోనే నలుగురి మృతి

కొట్టి పారేస్తున్న వైద్యాధికారులు

విషజ్వరాలతో జనం విలవిల

మాటలకే పరిమితమైన నివారణ చర్యలు

- ఆగస్టు 26న కణేకల్లుమండలం యర్రగుంట గ్రామానికి చెందిన ముజ్బూ కౌసర్‌(9) అనే బాలిక తీవ్రజ్వరంతో బాధపడుతుండగా తొలుత కణేకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడసరిగా పట్టించుకోలేదని బళ్లారికి తరలించగా ఆబాలిక మృతి చెందింది, అక్కడ డెంగీ ఫీవర్‌ అని చెప్పినట్లు బాలిక కుటుంబసభ్యులు చెబుతున్నారు.

- ఆగస్టు 28న ఉరవకొండలోని ఒకటో వార్డుకు చెందిన అజీమ్‌(14) అనే బాలుడు జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ అబ్బాయికి డెంగీ అని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

- డీ.హీరేహాళ్‌ మండలం మురడి గ్రామానికి చెందిన శివగంగమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య మృతిని తట్టుకోలేక భర్త పంపాపతి గుండెపోటుకు గురై మరణించాడు.

- గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన వన్నూరుస్వామి(40)ఆయన కుమారుడు 15 ఏళ్ల అబ్దుల్లా వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం తండ్రీ కొడుకులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రెండురోజులు క్రితం తీసుకొచ్చారు. వన్నూరుస్వామి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో నగరంలోని రాంనగర్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి తీసికెళ్లారు. అక్కడ వైద్యులు చేతులెత్తేయడంతో మెరుగైన చికిత్సకోసం బెంగళూరుకు శనివారం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కొడుకు అబ్దుల్లా మాత్రం ఇంకా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరికీ కూడా డెంగీ జ్వరం సోకినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.


అనంతపురం టౌన, సెప్టెంబరు 1: జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. వారంలోనే నలుగురు జ్వరంతో మరణించారు. డెంగీ జ్వరంతో చనిపోయారని కుటుంబసభ్యులు అంటున్నా, జిల్లా వైద్యాధికారులు మాత్రం అవి డెంగీ మరణాలు కావని కొట్టి పారేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రత అధ్వానంగా మారింది. దీంతో దోమలు బెడద ఎక్కువైపోయింది. ఇంట్లో, బయట ఎక్కడ కూర్చున్నా, పడుకున్నా దోమలు దాడి చేస్తున్నాయి. ఈ పర్యవసానంగా జనం విషజ్వరాల బారిన పడి విలవిల లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో డెంగీతో అక్కడక్కడ మరణాలు సంభవిస్తున్నాయనే ప్రచారం జరుగుతుండటంతో జనం తీవ్ర ఆందోళన చెందుతు న్నారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌, కలెక్టరు వినోద్‌ కుమార్‌ సమీక్షలు, కాన్ఫరెన్సలు పెట్టి జిల్లాలో వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నా అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నా యి.

ఎక్కడ చూసినా జ్వరపీడితులే

పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఎక్కడచూసినా జ్వరపీడితులు కనిపిస్తున్నారు. పీహెచసీలు, సీహెచసీలు, జిల్లా ఆస్పత్రితోపాటు ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స కోసం జ్వరబాధితులు క్యూ కడుతున్నారు. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రోజుకు 1600నుంచి 2వేల వరకు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో అత్యధికులు జ్వర పీడితులే. జిల్లా ఆస్పత్రి వైద్యులు చెబుతున్న లెక్కల ప్రకారం 300 నుంచి 400మంది వరకు జ్వరం, జలుబు, దగ్గుతో చికిత్సకు వస్తున్నారు. ఆతర్వాత కీళ్లునొప్పులతో ఎక్కువ మంది చికిత్స కోసం వస్తున్నారని చెబుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో దాదాపు 1200 మంది అడ్మిషన పొందుతుండగా వీరిలో 200 మందికి పైగా జ్వరాలు, జలుబు, దగ్గు, వళ్లు నొప్పులతో బాధపడేవారేనని ఆస్పత్రి గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా ఆస్పత్రిలోనే ఈపరిస్థితి ఉంటే మండల, నియోజకవర్గ ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కానీ జిల్లా వైద్యశాఖ మాత్రం డెంగీ, మలేరియా కేసులు తక్కువ సంఖ్యలో చూపుతూ ఉన్నతాధికారులను కనికట్టు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కేసులు తక్కువేనట!

జిల్లా వైద్యశాఖ డెంగీ కేసులలో వింతనాటకం ఆడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కేవలం 57కేసులు నమోదయ్యాయట. వారు చెప్పిన ప్రకారం జనవరిలో 8, ఫిబ్రవరిలో 5, మార్చిలో 12, ఏప్రిల్‌లో 6, మే 3, జూనలో 3, జూలైలో 9, ఆగస్టులో 10, సెప్టెంబరులో 1 డెంగీ కేసు నమోదైంది. అయితే గత వారంలోపే జిల్లాలో నలుగురు మృతి చెందారు. వారంతా డెంగీ జ్వరంతో చనిపోయినట్లు ఇతర ప్రాంతాల్లో చికిత్స చేసిన డాక్టర్లు, బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. కానీ వీరు డెంగీ జ్వరంతో మరణించలేదని జిల్లా వైద్యశాఖ అధికారులు వాదిస్తున్నారు. ఇక మలేరియా కేసులు ఎనిమిది నెలల్లో కేవలం మూడే నమోదయ్యాయట. దీన్నిబట్టే జ్వరబాధితుల లెక్కల విషయంలో వైద్యశాఖ ఎంత నిబద్ధతగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

వారు డెంగీతో చనిపోలేదు

జిల్లాలో ఇటీవల మరణించిన ఆ నలుగురు డెంగీతో చని పోలేదు. మురడి, యర్రగుంట, ఉరవకొండ, ఇల్లూరు మరణాలపై ఆరాతీశాం. వారు జ్వరంతో బాధపడుతున్నారన్న విషయం వాస్తవమే. అయినా వారికి ఇతర ఆరోగ్య సమస్యలుండటంతో మృతి చెందినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్‌ను స్వయంగా డీఎంహెచఓతో కలిసి చూసొచ్చాం. మలేరియా, టైఫాయిడ్‌ కాదని తేలింది. డెంగీ టెస్టుకు పంపించాం. ఆ నివేదికలు వచ్చిన తర్వాత విషయం తెలుస్తుంది, ప్రైవేట్‌ ఆస్పత్రులలో ఎనఎ్‌స-1 పరీక్షలు చేసి డెంగీ అనిచెప్పి భయపెట్టి చికిత్స చేసి ఫీజులు దండుకుంటున్నారు. అనంత వైద్య కళాశాలలో మాత్రమే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అనుమానిత లక్షణాలు ఉంటే ఇక్కడకు పంపిస్తే పరీక్షలు చేయిస్తాం. వాస్తవ సమాచారం చెబుతాం. -డాక్టర్‌ ఓబులు, డీఎంఓ

నిరంతరం పర్యవేక్షిస్తున్నాం

జ్వరాల విషయంలో జిల్లావ్యాప్తంగా అప్రమత్తంగా ఉంటు న్నాం. జిల్లా అధికారులతో పాటు డివిజన, క్లస్టర్‌ విభాగాల వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రజల ను అప్రమత్తం చేస్తున్నాం. డెంగీ, మలేరియా కేసుల ఎక్కడైనా వచ్చాయని తెలిస్తే ఆప్రాంతాలలో ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నాం. అవసరమైన డాక్టర్లు, సిబ్బంది, మందులు అన్నీ ఉన్నాయి. డెంగీ జ్వరం అని చెప్పి, రోగులను భయపెట్టి వారి ప్రాణాలతో చెలగాటమాడే ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు తప్పవు. -డాక్టర్‌ ఈబీ దేవి, డీఎంహెచఓ

వైద్యసేవల కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌: డీఎంహెచఓ

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అవసరమైన వైద్యసేవలు అందించడం కోసం జిల్లాలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీదేవి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఎక్కడైనా పాముకాటుకు గురైనా, గర్భిణులు ఇబ్బంది పడుతున్నా, విద్యుత ప్రమాదాలకు గురైనా, ఇతర ఏఅత్యవసర వైద్యసేవలు అవసరమైనా ఈ కంట్రోల్‌రూమ్‌కు ఫోన చేసి చెబితే వెంటనే అక్కడకు వైద్య బృందాన్ని పంపి చికిత్స అందిస్తామన్నారు. వైద్యసేవలు పొందాలంటే 08554-277434 నెంబర్‌కు ఫోన చేయవచ్చన్నారు. అన్ని పీహెచసీలలో పనిచేసే వైద్యులు, సిబ్బంది అక్కడే అందుబాటులో ఉండాలని లేకపోతే చర్యలు తప్పవని డీఎంహెచఓ హెచ్చరించారు.

క్షేత్రస్థాయికి కలెక్టర్‌

అనంతపురం టౌన, సెప్టెంబరు 1: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా కలెక్టరు డాక్టర్‌ వినోద్‌కుమార్‌ నిరంతరం సిబ్బందితో మానటరింగ్‌ చేస్తున్నారు. జేసీ శివనారాయణశర్మ, డీఆర్‌ఓ రామకృష్ణారెడ్డి తో కలిసి శనివారం అర్ధరాత్రి దాటినా జిల్లాలోని వివిధ శాఖల యంత్రాంగంతో సమీక్షలు, కాన్ఫరెన్సలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. ఆదివారం ఉదయం నుంచే మండల, గ్రామస్థాయి అధికారులు, ఉద్యోగులకు పలు ఆదేశాలు, సూచనలు చేస్తూ అవసరమైన చర్యలకు ఉపక్రమించారు. ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో ఉండాలని, ఆయా ప్రాంత ప్రజలకు వర్షాలపై అవగాహన కల్పించి ఎక్కడకు వెళ్లకుండా చూడాలని సూచించారు. కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయాలలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేయించారు. ఎక్కడైనా సమస్య వస్తే 8500292992, 9493188818, 63047 40949, 8333082895 నెంబర్లకు ఫోన చేసి తెలపాలని కలెక్టరు ప్రకటించారు. వర్షాలపై వాయిస్‌ మెసేజ్‌లు పంపుతూ అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేపట్టారు.

నేడు విద్యాలయాలకు సెలవు

వర్షాల ప్రభావం సోమవారం కూడా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాలయాలకు సెలవు ప్రకటించింది. దీంతో జిల్లాలోను ముందస్తు చర్యలలో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సోమ వారం సెలవును ప్రకటిస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Sep 02 , 2024 | 12:17 AM