Share News

Immersion Festival : నిమజ్జన శోభ

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:24 AM

అనంతపురం నగరంలో ఐదురోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. అంతకు మునుపు మండపాల వద్ద పెద్దఎత్తున అన్నదానం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సప్తగిరి సర్కిల్‌లోని వినాయక్‌ చౌక్‌ వరకూ శోభాయాత్రలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి దారిపొడవునా భక్తులు బారులు తీరారు. ఆకట్టుకునే వేషధారణలతో రంగులు చల్లుకుంటూ యువత ఉత్సాహంగా వేడుకలలో పాల్గొంది. వినాయక్‌ ...

Immersion Festival : నిమజ్జన  శోభ
Into the lap of Ganga..

యువతలో ఉప్పొంగిన ఉత్సాహం

గంగ ఒడికి చేరిన స్వామివారి విగ్రహాలు

అనంతపురం నగరంలో ఐదురోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. అంతకు మునుపు మండపాల వద్ద పెద్దఎత్తున అన్నదానం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సప్తగిరి సర్కిల్‌లోని వినాయక్‌ చౌక్‌ వరకూ శోభాయాత్రలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి దారిపొడవునా భక్తులు బారులు తీరారు. ఆకట్టుకునే వేషధారణలతో రంగులు చల్లుకుంటూ యువత ఉత్సాహంగా వేడుకలలో పాల్గొంది. వినాయక్‌ చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన ముగింపు సభకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత ప్రచారక్‌ విజయాదిత్య, అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, ఎస్పీ జగదీష్‌, జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్సవాల


ముగింపు సూచికగా ధ్వజావరోహణం చేశారు. నగరంలో వెయ్యికి పైగా విగ్రహాలను నిమజ్జనం జరుగుతోందని, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ప్రపంచానికి శాంతి నేర్పడమే హిందూ తత్త్వమని విజయాదిత్య అన్నారు. అందరినీ కలుపుకుపోవడమే హిందుత్వమని, వాడవాడలా జరిగే వినాయకచవితి వేడుకలు దీనికి నిదర్శనమని అన్నారు. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబాలు పండుగలు అని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. అనంతరం బాణసంచా పేల్చి, భక్తిగీతాలాపనలతో గణనాథుని శోభాయాత్రను ప్రారంభించారు. మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, మాజీ మేయర్‌ స్వరూప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, ఉత్సవ సమితి కార్యాధ్యక్షుడు పరుచూరి రమేష్‌, ప్రధాన కార్యదర్శి ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.

లడ్డూ రూ.2.04 లక్షలు

సప్తగిరి సర్కిల్‌ వినాయక మండపం వద్ద స్వామివారి లడ్డూను నగరానికి చెందిన చిల్లా రామేశ్వర్‌రెడ్డి వేలంలో రూ.2.04 లక్షలకు దక్కించుకున్నారు. ఆయన వరుసగా మూడో ఏడాది స్వామివారి లడ్డూను దక్కించుకోవడం విశేషం. గత ఏడాది రూ.44వేలు పలికిన లడ్డూ, ఈ ఏడాది ఏకంగా రూ.2.04 లక్షలు పలికింది. పోటీలో సుమారు 20 మంది పాల్గొన్నారు. ఉత్సవ సమితి నిర్వాహకులు రామేశ్వర్‌రెడ్డికి లడ్డూతోపాటు స్వామివారి శేషవస్త్రం అందజేసి సత్కరించారు.

- అనంతపురం కల్చరల్‌

బడికి వెళ్లాక.. సెలవు

విస్తుగొలిపేలా విద్యాశాఖ తీరు

ఉపాధ్యాయులతో తల్లిదండ్రుల వాగ్వాదం

నిమజ్జనోత్సవానికి సెలవు.. ఆనవాయితీ

ఆ విషయం అధికారులకు తెలియదా..?

అనంతపురం విద్య, సెప్టెంబరు 11: వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం నిర్వహించే రోజున విద్యాసంస్థలకు లోకల్‌ హాలిడే ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అనంతపురం నగరం, మున్సిపల్‌ కేంద్రాలు, ప్రధాన పట్టణాలలో ఊరేగింపుల కారణంగా రద్దీ ఉంటుందని, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సెలవు ఇస్తుంటారు. కానీ ఈ ఏడాది విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నట్లు కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో బుధవారం నిమజ్జనోత్సవం ఉంటుందని తెలిసినా.. సెలవు ప్రకటించలేదు. దీంతో విద్యార్థులు యథావిధిగా ఉదయాన్నే బడికి వెళ్లారు. పిల్లలను అలా బడి వద్ద వదిలి ఇంటికి వచ్చారో లేదో.. తల్లిదండ్రులకు ‘ఈ రోజు సెలవు.. మీ పిల్లలను తీసుకెళ్లండి..’ అని మెసేజ్‌ వచ్చింది. కొన్ని ప్రైవేటు పాఠశాలల వద్ద ఆటోవాలలు గొడవకు దిగారు. నిమజ్జనం ఉంటుందని తెలిసి పాఠశాలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని నిలదీశారు. జిల్లా విద్యాశాఖలో పాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణ. డీఈఓ పర్యవేక్షణ మరిచారన్న విమర్శలు వస్తున్నాయి. డిప్యూటీ డీఈఓలు, కార్యాలయ సిబ్బంది ఏం చేస్తున్నారో కూడా డీఈఓ వరకూ వెళ్లడం లేదని అంటున్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని అయోమయం నెలకొంది. లక్షలాది మంది విద్యార్థులు, వందలాది మంది ఉపాధ్యాయులు, సిబ్బందిని పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారి తీరు ఇలా ఉండటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఉన్నఫలంగా సెలవు

అనంతపురం నగరంలో వినాయకుడి విగ్రహాల నిమజ్జనోత్సవం బుధవారం జరుగుతుందని అధికారులకు తెలుసు. నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకూ ఊరేగింపులు, డప్పు మోతలు, వాహనాల రద్దీ, జన సందోహం, ట్రాఫిక్‌ సమస్య కొనసాగుతాయి. అందుకే అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ఇస్తారు. బుధవారం సెలవు ఇవ్వాలని ముందురోజే కలెక్టరేట్‌ నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. కానీ జిల్లా విద్యాశాఖ నుంచి ప్రధానోపాధ్యాయులకు, కరస్పాండెంట్లకు సమాచారం చేరవేయలేదు. దీంతో వారు బుధవారం యథావిధిగా పాఠశాలలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కొందరు ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓ కార్యాలయ సిబ్బంది 10వ తేదీ అర్ధరాత్రి కొందరికి, 11వ తేదీ ఉదయం తీరిగ్గా నిద్రలేచాక కొందరికి సెలవు సమాచారం పంపారని తెలుస్తోంది. ఈ విషయం విద్యార్థులకు తెలిసేలోగా పాఠశాలలకు చేరుకున్నారు. వారిని వదిలి వెళ్లిన తల్లిదండ్రులు, ఆటోవాలాలు నిమిషాల వ్యవధిలో తిరిగి పాఠశాలల వద్దకు వెళ్లి ఇళ్లకు తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఇదేం పద్ధతి అని కొందరు తల్లిదండ్రులు, ఆటోవాలాలు ఉపాధ్యాయులు, యాజమాన్యాలతో వాగ్వాదానికి దిగారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 12 , 2024 | 12:24 AM