Share News

Jagananna House : ఇంటికో వ్యథ

ABN , Publish Date - Aug 11 , 2024 | 12:14 AM

మండలకేంద్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జగనన్న హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణం అంతులేని కథలాగా తయారైంది. 50మంది లబ్ధిదారులతో ఒక్కొక్కరితో రూ.35వేలు అదనంగా కట్టించుకున్న కాంట్రాక్టర్‌, అధికారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా చేతులెత్తేశారు. ఆరునెలల నుంచి కాంట్రాక్టర్‌ జాడ లేకుండా పోవడంతో హౌసింగ్‌ లబ్ధిదారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇళ్లను తామే కట్టించి ఇస్తామని ప్రభుత్వం 3వ ఆప్షన ఇవ్వడంతో 120మంది లబ్ధిదారులు దీన్ని ఎంచుకున్నారు. అయితే ఇళ్ల ...

Jagananna House : ఇంటికో వ్యథ
Leaning roof

‘జగనన్న ఇళ్ల’కు రూ.35 వేలు చెల్లించిన లబ్ధిదారులు

ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా కాంట్రాక్టర్‌ పరారీ

పోలీస్‌స్టేషనకు వెళ్లినా పరిష్కారం కాని సమస్య

న్యాయం చేయాలంటున్న బాధితులు

యాడికి, ఆగస్టు 10: మండలకేంద్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జగనన్న హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణం అంతులేని కథలాగా తయారైంది. 50మంది లబ్ధిదారులతో ఒక్కొక్కరితో రూ.35వేలు అదనంగా కట్టించుకున్న కాంట్రాక్టర్‌, అధికారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా చేతులెత్తేశారు. ఆరునెలల నుంచి కాంట్రాక్టర్‌ జాడ లేకుండా పోవడంతో హౌసింగ్‌ లబ్ధిదారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇళ్లను తామే కట్టించి ఇస్తామని ప్రభుత్వం 3వ ఆప్షన ఇవ్వడంతో 120మంది లబ్ధిదారులు దీన్ని ఎంచుకున్నారు. అయితే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి అదనంగా రూ.35వేలు కాంట్రాక్టర్‌కు చెల్లించాలని అధికారులు చెప్పారు. అదనంగా డబ్బు చెల్లిస్తే నాణ్యతతో కూడిన ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు అదనంగా రూ.35వేలు కడితే సొంతింటి కల నెరవేరుతుందని లబ్ధిదారులు ఆశపడ్డారు. సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం అప్పులు చేసి మరీ రూ.35వేలను కాంట్రాక్టర్‌కు చెల్లించారు. ప్రారంభంలో పనులను చురుకుగా మొదలుపెట్టిన కాంట్రాక్టర్‌ ఆ తర్వాత చేతులెత్తేశాడు. ఇళ్ల నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టాడు.


నాసిరకంగా నిర్మాణాలు

కొన్ని ఇళ్ల పైకప్పులు ప్రారంభం కాకమునుపే కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని ఇళ్ల గోడలు అప్పుడే నెర్రెలు చీలాయి. ఇళ్ల నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు నిలిచిపోతూ వచ్చాయి. దీనిపై లబ్ధిదారులు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. హౌసింగ్‌శాఖ జిల్లా అధికారులు వచ్చి భరోసా ఇచ్చినా నిర్మాణ పనులు మాత్రం కొనసాగలేదు. ప్రస్తుతం కాంట్రాక్టర్‌ కూడా లే ఔట్‌ వద్దకు రాకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. అధికారులు, కాంట్రాక్టర్‌ మాటలు నమ్మి తాము మోసపోయామని లబ్ధిదారులు గ్రహించారు. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన సొమ్మునైనా వెనక్కి ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగారు. పోలీ్‌సస్టేషనకు వెళ్లి కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికి హౌసింగ్‌ లబ్ధిదారులకు న్యాయం జరగలేదు. సుమారు 30 మంది లబ్ధిదారులకు కాంట్రాక్టర్‌ నేటివరకు సొమ్ము తిరిగి ఇవ్వలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.10లక్షలకు పైగా కాంట్రాక్టర్‌ చెల్లించాల్సి ఉందని లబ్ధిదారులు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అయినా ప్రజా ప్రతినిధులు, అధికారులు తగు చొరవ తీసుకొని తాము చెల్లించిన అదనపు డబ్బులను కాంట్రాక్టర్‌ నుంచి వెనక్కి ఇప్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

వడ్డీకి తెచ్చి ఇచ్చా

సొంతింటి కల నెరవేరుతుందని అధికారులు చెప్పిన మాటలను నమ్మి వడ్డీకి డబ్బులు అప్పు తెచ్చి కాంట్రాక్టర్‌కు చెల్లించా. కాంట్రాక్టర్‌ ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేయకుండానే వెళ్లిపోయాడు. తెచ్చిన అప్పుకు వడ్డీ పెరిగిపోయింది. ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు. దీనిపై అనంతపురం వెళ్లి ఫిర్యాదుచేశాం. పోలీస్‌స్టేషనకు వెళ్లాం. మాకు న్యాయం జరగలేదు. టీడీపీ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరిగేలా చూడాలి.

- లక్ష్మిదేవి, హౌసింగ్‌ లబ్ధిదారురాలు, యాడికి

పేదల కడుపు కొట్టడం న్యాయమా?

రూ.35వేలు కడితే ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేయకుండానే కాంట్రాక్టర్‌ వెళ్లిపోయాడు. అధికారుల మాటలు నమ్మి పూర్తిగా మోసపోయాం. సమస్యను పరిష్కరించకుండా మాటను దాటవేస్తున్నారు. మాకు న్యాయం జరగదా? అప్పులు చేసి ఇచ్చిన మా డబ్బులను వెనక్కి ఇప్పించలేరా? పేదల కడుపు కొట్టడం న్యాయమా? మాకు న్యాయం చేయాలి.

- నాగూర్‌బీ, హౌసింగ్‌ లబ్ధిదారురాలు, యాడికి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 11 , 2024 | 12:14 AM