Share News

EDUCATION : ఆ బడికి వెళ్లేదే లే..!

ABN , Publish Date - Jul 03 , 2024 | 11:50 PM

జగన ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయంతో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. దీంతో కి.మీ. దూరం వెళ్లలేక కొందరు బడి మానేశారు. మరికొందరు ప్రైవేటు బాట పట్టారు. బెళుగుప్ప మండలంలోని గంగవరంలో సమస్య మరింత జఠిలంగా మారింది. ఇక్కడ విలీనాన్ని వ్యతిరేకిస్తున్న తల్లిదండ్రులు.. 3, 4, 5 విద్యార్థులను ప్రాథమిక పాఠశాలకే పంపుతున్నారు. నాటి ప్రభుత్వ ఆదేశాల కారణంగా వీరికి పాఠాలు చెప్పాల్సిన ....

EDUCATION : ఆ బడికి వెళ్లేదే లే..!
Gangavaram Main Primary School

గంగవరంలో ప్రాథమిక పాఠశాలకే 3, 4, 5 తరగతుల విద్యార్థులు

విలీనం పేరిట హైస్కూల్‌కు పంపిన గత ప్రభుత్వం

తల్లిదండ్రుల తిరుగుబాటు

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

అనంతపురం విద్య, జూలై 3: జగన ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయంతో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. దీంతో కి.మీ. దూరం వెళ్లలేక కొందరు బడి మానేశారు. మరికొందరు ప్రైవేటు బాట పట్టారు. బెళుగుప్ప మండలంలోని గంగవరంలో సమస్య మరింత జఠిలంగా మారింది. ఇక్కడ విలీనాన్ని వ్యతిరేకిస్తున్న తల్లిదండ్రులు.. 3, 4, 5 విద్యార్థులను ప్రాథమిక పాఠశాలకే పంపుతున్నారు. నాటి ప్రభుత్వ ఆదేశాల కారణంగా వీరికి పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు మాత్రం ఉన్నత పాఠశాలకే వెళుతున్నారు. దీంతో విద్యార్థులు ఇక్కడ.. గురువులు అక్కడ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. విద్యాశాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోవడం


విమర్శలకు తావిస్తోంది.

హైస్కూల్‌కు పంపేదే లేదు..

గంగవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల(మెయిన) లోని 3, 4, 5 తరగతులను నుంచి గంగవరం హైస్కూల్‌లో విలీనం చేశారు. ఈ మూడు తరగతుల విద్యార్థులు అక్కడికి వెళ్లాలంటే సుమారు 2 కి.మీ. దూరం ప్రయాణించాలి. దీంతో అప్పట్లోనే విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఉద్యమించారు. అయినా అధికారులు మొండిగా ముందుకు వెళ్లారు. ప్రాథమిక పాఠశాల నుంచి విద్యార్థులను ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను హైస్కూల్‌కు పంపేది లేదని భీష్మించారు. మూడు తరగతుల విద్యార్థులు సుమారు 50 మంది ప్రాథమిక పాఠశాలకే వెళుతున్నారు. వారికి పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు మాత్రం ఉన్నత పాఠశాలలోనే ఉన్నారు.


బోధన ఎలా..?

గంగవరం ప్రాథమిక పాఠశాలలో (మెయిన) ఒకటి, రెండు తరగతుల విద్యార్థులు సుమారు 25 మంది ఉన్నారు. వీరికి పాఠాలు చెప్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. తాజాగా 3, 4, 5 తరగతుల విద్యార్థులు 50 మంది వరకూ మళ్లీ ఇదే పాఠశాలకు వస్తున్నారు. దీంతో బోధన పరంగా ఉపాధ్యాయులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉన్నత పాఠశాల నుంచి ఉపాధ్యాయులును తిరిగి ప్రాథమిక పాఠశాలకు పంపితే తప్ప సమస్య పరిష్కారమయ్యేలా లేదు. తమ బిడ్డలను హైస్కూల్‌కు పంపేదే లేదని, అవసరమైతే ప్రైవేటు పాఠశాలల్లో చేరుస్తామని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రాథమిక పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమస్యను మంత్రి పయ్యావుల కేశవ్‌ దృష్టికి తీసుకువెళతామని తల్లిదండ్రులు అంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 03 , 2024 | 11:50 PM