LIQUOR LOTTERY: లక్కీ లాటరీ..!
ABN , Publish Date - Oct 14 , 2024 | 11:49 PM
ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సుల జారీ లాటరీ అధికార కూటమికి లక్కీ లాటరీగా మారింది. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సోమవారం మద్యం దుకాణాలకు లక్కీడ్రా కల్టెకర్ చేతన ఆధ్వర్యంలో నిర్వహించారు.
బీజేపీ అనంత జిల్లా అధ్యక్షుడికి ఐదు షాపులు
మడకశిరలో ఒకే కుటుంబానికి నాలుగు
అధికార సిండికేట్ కూటమి హవా
మద్యం దుకాణం దక్కించుకున్న రంగనాథ్ కిడ్నాప్
లాటరీ కేంద్రం వద్ద భార్య, బంధువుల ధర్నా
హిందూపురం వనటౌన సీఐ ఎదుట రంగనాథ్ ప్రత్యక్షం
రేపట్నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల్లో విక్రయాలు
పుట్టపర్తి, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సుల జారీ లాటరీ అధికార కూటమికి లక్కీ లాటరీగా మారింది. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సోమవారం మద్యం దుకాణాలకు లక్కీడ్రా కల్టెకర్ చేతన ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలో ఎనిమిది ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 87 మద్యం దుకాణాలకు 1518 దరఖాస్తులు రాగా.. రెండు టేబుళ్లపై లక్కీడ్రా తీశారు. సిండికేట్‌తో మద్యం దుకాణాల్లో 90శాతానికిపైగా అధికార కూటమి నేతలు, అనుచరగణానికే దక్కాయి. కదిరి, ధర్మవరం, హిందూపురం, చెన్నేకొత్తపల్లి, మడకశిర, పెనుకొండ, తనకల్లు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఐదారు మినహా అన్నీ అధికార కూటమి వశమయ్యాయి. పుట్టపర్తి ఎక్సైజ్ స్టేషన పరిధిలో అధికార కూటమి నేతలతోపాటు ఔత్సాహికులు, ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం భారీగా దరఖాస్తులు చేశారు. లాటరీలో మిశ్రమంగా దక్కాయి. మద్యం దుకాణాల లాటరీకి సోమవారం ఉదయం నుంచి దరఖాస్తుదారులు సాయిఆరాయం వద్దకు క్యూకట్టారు. సిండికేట్‌గా దరఖాస్తులు చేసిన వారిలో టెన్షన కన్పించలేదు. మిగతావారిలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. మహిళలు సైతం మద్యం దుకాణాలకు పోటీ పడ్డారు. యువతతోపాటు చంటిబిడ్డలతో లాటరీకి హాజరయ్యారు. మడకశిర, పుట్టపర్తి, కదిరి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. లేపాక్షిలో 57వ మద్యం దుకాణం మినహా మిగిలిన 86 షాపులకు లైసెన్సు ఫీజు 1/6 వంతు మొత్తాన్ని చెల్లించారు. కొందరికి దుకాణాలు దక్కకపోవడంతో నిట్టూరుస్తూ వెనుదిరిగారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, డీఆర్వో కొండయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోవిందునాయక్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ నరసింహులు పాల్గొన్నారు.
మహిళలకు లక్కీ చాన్స
మద్యం దుకాణాలకు దరఖాస్తుల్లో మహిళలు పోటీపడ్డారు. ఐదుగురికి మద్యం దుకాణాలు దక్కాయి. హిందూపురం మున్సిపాలిటీలో 50వ దుకాణానికి నాగరత్నమ్మ, మడకశిర నగర పంచాయతీలో 78వ షాపునకు వైజయంతిమాల, అమరాపురంలో 83వ దుకాణానికి పంకజ, పుట్టపర్తి నగర పంచాయతీలో 39కి ప్రశాంతి, గాండ్లపెంటలో టంగుటూరి సురేఖకు దుకాణాలు దక్కాయి. జిల్లా వ్యాప్తంగా పలు దకాణాలకు మహిళలు దరఖాస్తులు చేసి సిండికేట్ ముందు నిలువలేకపోయినట్లు చర్చ సాగుతోంది.
లిక్కర్ కిక్కు వారిదే
మద్యం దుకాణాల లక్కీడ్రాలో కొందరిని అదృష్టం వరించింది. ధర్మవరం ఎక్సైజ్ స్టేషన పరిధిలో 20 దుకాణాల్లో మూడు మినహా అన్నీ కూటమి నేతల అనుచరగణానికే దక్కాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ సన్నిహితుడు, బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుకు ఐదు దుకాణాలు దక్కాయి. ధర్మవరం మున్సిపాలిటీ, రూరల్‌లో మూడు, బత్తలపల్లి, ముదిగుబ్బలో ఒక్కోటి వశమయ్యాయి. ధర్మవరంలో టీడీపీ నేత శ్రీశైలం పురుషోత్తం గౌడ్, ముదిగుబ్బలో అదే పార్టీకి చెందిన అన్నమనేని శ్రీనివాసులు, రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లిలో బిత్తిని హరినాథ్, పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్లలో మద్యం వ్యాపారి ఓరుగంటి రవీంద్రనాథ్‌గౌడ్, కదిరిలో టీడీపీ నాయకుడు కందుకూరు గణేష్‌కు రెండు చొప్పున, మడకశిర నగర పంచాయతీ, గ్రామీణ పరిధిలో పీఎస్ వెంకటసుబ్బారెడ్డికి మూడు, ఆయన భార్య వైజయంతిమాల పేరుతో మరో దుకాణాం దక్కాయి. మడకశిర నియోజక వర్గం అమరాపురంలో తల్లికుమారుడు పీఎం పంకజ, పీఎం సుజితకు రెండు దుకాణాలు దక్కాయి. ఇదు దుకాణాలు దక్కించుకున్న సందిరెడ్డి శ్రీనివాసులు, ఆయన బృందం నియోజక వర్గంలో 27 దరఖాస్తులు సమర్పించారు. మడకశిరలో నాలుగు దకాణాలు దక్కిన పీఎస్ వెంకటసుబ్బారెడ్డి, ఆయన బృందం 29 దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది. కనగానపల్లిలో రెండు దుకాణాలకు హరినాథ్ 13 దరఖాస్తులు వేశాడు. హిందూపురంలో టీడీపీ, వైసీపీ నేతలు సిండికేట్‌గా మారి, నియోజకవర్గ వ్యవహారాలు చూసే ఇద్దరు పీఏలు ఏకంగా 9 దుకాణాలకు పలు పేర్లపై 40 దరఖాస్తులు చేశారు. పరిగిలో రెండు దుకాణాలకు మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి వర్గీయులు పోటీపడి 86 దరఖాస్తులు చేశారు.
కిడ్నాప్ కలకలం
లక్కీడ్రాలో చిలమత్తూరు మండలం యగ్నిశెట్టిపల్లికి చెందిన రంగనాథ్‌కు లేపాక్షిలో 57 మద్యం దుకాణం దక్కింది. ఉదయం 10 గంటల సమయంలో రంగనాథ్‌ను హిందూపురానికి చెందిన కొందరు చర్చిద్దామని పిలుచుకెళ్లారు. లాటరీ తగిలిన విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో రంగనాథ్‌తో మాట్లాడేందుకు వారు ప్రయత్నించగా.. ఫోన స్విచాఫ్ వచ్చింది. రంగనాథ్ భార్య అశ్విని, కుటుంబ సభ్యులు పుట్టపర్తికి వచ్చి ఆరాతీశారు. హిందూపురానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు.. రంగనాథ్‌ను తీసుకెళ్లినట్లు తెలుసుకున్నారు. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ అశ్విని, బంధువులు.. పుట్టపర్తి ఆర్బన పోలీసు స్టేషన హిందూరానికి చెందిన మంగేష్, ఆనంద్‌పై ఫిర్యాదు చేశారు. అనంతరం సాయిఆరామంలో మద్యం దుకాణానికి లైసెన్సు ఫీజు చెల్లిస్తామని ఎక్సైజ్ అధికారులకు విన్నవించారు. దరఖాస్తుదారుడే చెల్లించాలని చెప్పడంతో ప్రధాన ముఖద్వారం ఎదుట ధర్నాకి దిగారు. రంగనాథ్‌ను పిలుచుకెళ్లిన వారు యగ్నిశెట్టిపల్లిలోని బంధువులకు ఫోన చేసి, రూ.10 లక్షల గుడ్‌విల్ ఇస్తామనీ, ప్రతినెలా రూ.15వేలు ఇస్తామనీ, అందుకు ఒప్పుకుంటే రేపు సాయంత్రానికి రంగనాథ్ వస్తాడంటూ దర్నాకు దిగిన అతడి బంధువులకు ఫోనలో సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాటంటూ ఒత్తిళ్లు తెచ్చారు. సోమవారం రాత్రిదాకా రంగనాథ్ కిడ్నా్‌ప హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు రంగనాథ్ హిందూపురంలో ప్రత్యక్షమయ్యాడు. వనటౌన సీఐ ఎదుట హాజరయ్యాడు. మొబైల్ ఫోన మరమ్మతులకు లోనవడంతో భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోయాననీ, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని సీఐ ఎదుట వెల్లడించడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది.