Share News

PAYYYAVULA KESHAV :మా అస్త్రం సూపర్‌ సిక్స్‌

ABN , Publish Date - May 11 , 2024 | 12:55 AM

నా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప.. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా చేసేందిమీ లేదు. మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తాను. సూపర్‌ సిక్స్‌ పథకాలే మా అస్త్రం. నియోజకవర్గంలో సాగు, తాగు నీటి సమస్యలకు పరిష్కారం చూపుతాను. హంద్రీనీవా నీటితో ఆయకట్టును కోనసీమ తరహాలో అభివృద్ధి చేస్తాను’ అని టీడీపీ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ...

PAYYYAVULA KESHAV :మా అస్త్రం సూపర్‌ సిక్స్‌

ఉరవకొండ సమగ్ర అభివృద్ధే లక్ష్యం

టీడీపీ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, మే 10: ‘నా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప.. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా చేసేందిమీ లేదు. మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తాను. సూపర్‌ సిక్స్‌ పథకాలే మా అస్త్రం. నియోజకవర్గంలో సాగు, తాగు నీటి సమస్యలకు పరిష్కారం చూపుతాను. హంద్రీనీవా నీటితో ఆయకట్టును కోనసీమ తరహాలో అభివృద్ధి చేస్తాను’ అని టీడీపీ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో శుక్రవారం మాట్లాడారు.


ఎలాంటి వ్యూహాలతో అధికార పార్టీని ఎదుర్కోబోతున్నారు ?

కేశవ్‌: వైసీపీ ప్రభుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులు, రైతుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రభుత్వంపై వారు కసిగా ఉన్నారు. వైసీపీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. నన్ను గెలిపిస్తే ఎన్డీఏ సహకారంతో కేంద్రం నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలే అజెండాగా పనిచేస్తాను.

ఓటర్లకు ఇస్తున్న భరోసాలు, హామీలు ఏమిటి?

కేశవ్‌: సూపర్‌సిక్స్‌ పథకాలతో మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలకు వివరిస్తున్నాం. ఉపాధి, విద్యాభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాం. పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం. గార్మెంట్‌ పరిశ్రమను ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తాం. రహదారులను అనుసంధానం చేసి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.

డ్రీమ్‌ ప్రాజెక్టులు ఏవైనా ఉన్నాయా? గెలిస్తే నిధులు ఎలా సమకూరుస్తారు?

కేశవ్‌: సాగు, తాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమల రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. ఆగిపోయిన సామూహిక బిందుసేద్యం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని 80వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం. నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తెచ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం.

మీ ప్రచారానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది?

కేశవ్‌: ప్రచారానికి గ్రామాలకు వెళ్లినపుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. ప్రభుత్వంపైన అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 1994 ఫలితాలు పునరావృతం కావడం తథ్యం.

గెలిచిన తర్వాత మీ ప్రాధాన్యాలు ఏమిటి..?

కేశవ్‌: సాగు, తాగునీరు, రహదారులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. జీడిపల్లి నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ నిధుల మంజూరుకు కృషి చేస్తాను. హంద్రీనీవా కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందిస్తాం. అవకాశం ఉన్న ప్రతి ఎకరానికీ సాగునీటిని అందిస్తాం.


ముస్లింల సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

కేశవ్‌: ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వంలో సముచిత స్థానం ఉంటుంది. రూ.100 కోట్లతో నూర్‌బాషా కార్పొరేషన ఏర్పాటు చేస్తాం. హజ్‌యాత్రకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తాం. ఇమాంలకు ప్రతినెలా రూ.10 వేలు, మౌజనలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. 2014లో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ ఐదేళ్ల కాలంలో ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేశాం. దుల్హాన, రంజాన తోఫా ఇచ్చాం. పదుల సంఖ్యలో షాదీఖానాలు నిర్మించాం. 2024లోనూ కూటమిదే అధికారం. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ముస్లిం మైనార్టీల పథకాలను పునరుద్ధరిస్తాం.

ఉరవకొండలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కదా..?

కేశవ్‌: మా ప్రభుత్వ హయాంలో ఉరవకొండకు రోజు మార్చి రోజు తాగునీరు సరఫరా చేశాం. ఉరవకొండలో నీటి ఎద్దడికి వైసీపీ నాయకులే కారణం. పథకాలపై కనీస అవగాహన లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే నీటి సమస్యను పరిష్కరిస్తాం.

గతంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి?

కేశవ్‌: టీడీపీ హయాంలో ఉరవకొండలో 50 పడకల ఆసుపత్రి నిర్మించాం. మూడు రహదారులను ఏర్పాటు చేశాం. హంద్రీనీవా ద్వారా 11 చెరువులకు నీరిచ్చాం. డిగ్రీ కళాశాలను మంజూరు చేయించి, భవన నిర్మాణం చేపట్టాం. ఉరవకొండలో డబుల్‌ రోడ్‌ నిర్మాణాన్ని చేపట్టాం. పీఏబీఆర్‌ నుంచి ఉరవకొండకు ప్రత్యేక తాగునీటి పైప్‌లైన ఏర్పాటు చేశాం. గుంతకల్లు బ్రాంచికెనాల్‌ ఆధునికీకరణ పనులు చేపట్టాం. ఉరవకొండలో 3వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశాం.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 11 , 2024 | 12:55 AM