Share News

Cultivation pulses : నల్లరేగడి సిద్ధం

ABN , Publish Date - Oct 19 , 2024 | 12:46 AM

తుఫాను వర్షాలతో నల్లరేగడి నేలలు పదునయ్యాయి. దీంతో పప్పుశనగ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. తడి ఆరగానే విత్తనం వేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరో మూడు రోజులపాటు వర్షం కురవకపోతే విత్తనం వేస్తామని రైతులు అంటున్నా రు. ఇప్పటికే పలువురు రైతులు విత్తన పప్పుశనగ కొనుగోలు చేసి ఇళ్లలో సిద్ధంగా ఉంచు కున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1.18 లక్షల హెక్టార్లు కాగా, ఇందులో పప్పుశనగ 72 వేల హెక్టార్లలో సాగవుతుంది. మిగతా...

Cultivation pulses : నల్లరేగడి సిద్ధం
Yadiki mandal is a ready farm at Nagaruru

తడి ఆరగానే పప్పుశనగ సాగు

రైతు సేవాకేంద్రాల్లో సగం విత్తనమే..

నిబంధనలను పాటించని అధికారులు

మిగిలినవి మార్కెట్‌లో కొంటున్న రైతులు

అనంతపురం అర్బన/బెళుగుప్ప, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): తుఫాను వర్షాలతో నల్లరేగడి నేలలు పదునయ్యాయి. దీంతో పప్పుశనగ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. తడి ఆరగానే విత్తనం వేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరో మూడు రోజులపాటు వర్షం కురవకపోతే విత్తనం వేస్తామని రైతులు అంటున్నా రు. ఇప్పటికే పలువురు రైతులు విత్తన పప్పుశనగ కొనుగోలు చేసి ఇళ్లలో సిద్ధంగా ఉంచు కున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1.18 లక్షల హెక్టార్లు కాగా, ఇందులో పప్పుశనగ 72 వేల హెక్టార్లలో సాగవుతుంది. మిగతా విస్తీర్ణంలో జొన్న, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలు వేస్తారు. గత ఏడాది


రబీ సీజనలో జిల్లా వ్యాప్తంగా 82 వేల హెక్టార్లల్లో వివిధ రకాల పంటలనను సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 49 వేల హెక్టార్లల్లో పప్పుశనగ సాగు చేశారు. ఈ సారి పదును వర్షం పడటంతో సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు.

నిబంధనల అతిక్రమణ

సబ్సిడీ పప్పుశనగ పంపిణీలో పలు మండలాల్లోని అధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి అర ఎకరానికి 20 కేజీల విత్తన ప్యాకెట్‌ ఒకటి ఇవ్వాలి. ఈ లెక్కన అర ఎకరం నుంచి ఎకరం వరకు రెండు ప్యాకెట్లు, ఒకటిన్నర ఎకరాలకు 3 ప్యాకెట్లు.. గరిష్ఠంగా 5 ఎకరాలకు 10 ప్యాకెట్లు పంపిణీ చేయాలి. కానీ బెళుగుప్ప, తాడిపత్రి, యల్లనూరు, ఉరవకొండ తదితర మండలాల్లో ఇవ్వాల్సిన విత్తనంలో సగం మాత్రమే ఇస్తున్నారు. ఎకరానికి ఒక ప్యాకెట్‌ (20 కేజీలు), ఐదెకరాలకు గరిష్ఠంగా 5 ప్యాకెట్లు (100 కేజీలు) పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. రైతులు తప్పని పరిస్థితుల్లో మిగతా విస్తీర్ణానికి మార్కెట్‌లో విత్తనం కొనాల్సి వస్తోంది. యాడికి మండలంలో ప్రతి ఏడాది 2,400 హెక్టార్లకుపై పప్పుశనగ సాగవుతోంది. ఈ సారి రైతు సేవా కేంద్రాల్లో 450 మంది రైతులు 400 క్వింటాళ్లకు రిజిసే్ట్రషన చేసుకున్నారు. ఇప్పటి దాకా ఒక్క బస్తా కూడా ఆ మండలానికి పంపలేదు. ఉన్నతాధికారుల స్పందన కోసం రైతులు వేచి చూస్తున్నారు.

మార్కెట్‌ ధరా అంతే..

జిల్లాకు ఈ ఏడాది 27,139 క్వింటాళ్ల పప్పుశనగ కేటాయించారు. ఇప్పటి దాకా 13,832 మంది రైతులు 19,465 క్వింటాళ్లకుపైగా పప్పుశనగ కోసం రైతు సేవా కేంద్రా ల్లో రిజిస్ట్రేషన చేసుకున్నారు. ఇందులో ఇప్ప టి దాకా 17,509 క్వింటాళ్ల విత్తనం పంపిణీ చేశారు. ఈ సారి పప్పుశనగ జేజీ - 11 రకం క్వింటం పూర్తి ధర రూ.9400గా నిర్ణయించారు. ఇందులో 25 శాతం సబ్సిడీ పోనూ రైతు వాటా కింద రూ.7050 చెల్లించాల్సి ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సబ్సిడీ తగ్గించారు. గతేడాది పప్పుశనగ క్వింటం ధర రూ.8100 ఉన్నింది. ఇందులో 40 శాతం సబ్సిడీ రూ.3,240 పోనూ రైతు వాటా రూ.4860 చెల్లించారు. రెండేళ్ల క్రితం 25 శాతం సబ్సిడీ ఉండేది. గతేడాది సబ్సిడీని 40 శాతానికి పెంచారు. ఈ సారి తిరిగి 25 శాతానికి తగ్గించారు. పప్పుశనగ పూర్తి ధరను గతంతో పోలిస్తే పెంచడంతోపాటు సబ్సిడీని తగ్గించడంతో రైతులపై భారం పడింది. మార్కెట్‌లో క్వింటం విత్తన పప్పుశనగ ధర రూ.7500 పలుకుతోంది. చిన్న, సన్న కారు రైతులకు నిర్దేశించిన మేరకు విత్తనం అందజేస్తే మార్కెట్‌పై ఆధారపడాల్సిన పనిలేదు. కానీ సగం మాత్రమే ఇస్తుండటంతో మార్కెట్‌లో కొంటున్నారు. సబ్సిడీ ధరకు మార్కెట్‌ ధరకు పెద్దగా తేడా లేకపోవడంతో చాలామంది రైతులు మార్కెట్‌ విత్తనంవైపే మొగ్గు చూపుతున్నారు.

సగమే ఇచ్చారు..

ఎకరానికి ఒక ప్యాకెట్‌ పప్పుశనగ విత్తనాలు మాత్రమే ఇచ్చారు. నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. మొత్తం పది ప్యాకెట్లు ఇవ్వాల్సి ఉండగా ఐదింటితో సరిపెట్టారు. ఈ విత్తనం సరిపోదు. వ్యవసాయ అధికారులను అడిగినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఉన్నతాధికారులు స్పందించి నిబంధనల మేరకు ఎకరానికి రెండు ప్యాకెట్లు ఇవ్వాలి. లేదంటే మార్కెట్‌లో కొనక తప్పదు.

- తిరుమల ప్రసాద్‌, వెంకటాద్రిపల్లి, బెళుగుప్ప మండలం

పదును ఆరగానే విత్తనం వేస్తా..

ఈ సారి మంచి వర్షం పడింది. పొలంలో పదును ఆరగానే పప్పుశనగ విత్తనం వేస్తాం. నాకు ఏడు ఎకరాల పొలం ఉంది. నిబంధనల మేరకు ఐదెకరాలకు పది బ్యాగుల విత్తనం ఇవ్వాలి. కానీ నాకు ఐదు బ్యాగులే ఇచ్చారు. ఐదెకరాలలో పంట పెట్టినా.. మరో క్వింటం విత్తనాలు అవసరం అవుతాయి. రైతు సేవా కేంద్రంలో సగమే ఇవ్వడంతో మిగతా విత్తనాలు మార్కెట్‌లో కొన్నాను.

- శ్రీనివాస్‌రెడ్డి, రామసాగరం, బెళుగుప్ప మండలం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 19 , 2024 | 12:46 AM