AP News: అత్తాకోడలిపై గ్యాంగ్‌రేప్ ఘటనలో కీలక మలుపు
ABN , Publish Date - Nov 04 , 2024 | 12:17 PM
Andhrapradesh: శ్రీసత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నతాధికారుల విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. గ్యాంగ్ రేప్ ఘటనలో అరెస్టు అయిన నేరస్తులతో...
శ్రీ సత్యసాయి జిల్లా, నవంబర్ 2: జిల్లాలో కలకలం రేపిన అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. జిల్లాలోని చిలమత్తూరు మండలంలో అత్తాకోడలిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే గ్యాంగ్ రేప్ ఘటనలో అరెస్టు అయిన నేరస్తులతో కొందరు పోలీసులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. పలు కేసుల నుంచి గ్యాంగ్ రేప్ నేరస్తులను హిందూపురం పోలీసులు తప్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నేరస్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుళ్లు వెంకట్రామి రెడ్డి, నరేష్‌లను సస్పెండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. ఓ ఏఎస్ఐతో పాటు మరికొందరు కానిస్టేబుళ్లపై అధికారులు వేటుకు రంగం సిద్ధం చేశారు.
కాగా.. గత నెలలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పొట్టకూటి కోసం వచ్చిన వలస కూలీలపై అర్ధరాత్రి కామాంధులు విరుచుకుపడ్డారు. నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో పనిచేస్తున్న వాచ్‌మన్ కుటుంబానికి చెందిన అత్తాకోడలిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో మూడు బైక్‌లపై పేపర్ మిల్లు వద్దకు వచ్చిన ఆరుగురు దుండగులు.. అక్కడి వాచ్‌మెన్, అతడి కుమారుడిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా కత్తితో బెదిరింపులకు పాల్పడుతూ.. వాచ్‌మెన్ భార్య, కోడలిపై గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తమకు జరిగిన అన్యాయంపై వాచ్‌మెన్ కుమారుడు మిల్లు యజమానికి తెలియజేయగా.. ఆయనకు పోలీసులకు తెలియజేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బాధిత మహిళలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అయితే.. ఈ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు కేవలం 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల్లో ముగ్గురు పాత నేరస్థులు, వారిలో ఒకరు అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ ఘటనను ప్రభుత్వం సీనియస్‌గా తీసుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని, నిందితులను వెంటనే పట్టుకుని, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిలో భరోసా నింపాలని ఎస్పీని ఆదేశించారు. హోంమంత్రి అనిత కూడా జిల్లా ఎస్పీతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బాధితులను ఫోన్‌లో పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అలాగే.. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను మంత్రి సవిత బాధిత పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల
Read Latest AP News And Telugu News