Share News

Alternative crops : ప్రత్యామ్నాయమూ అంతే..!

ABN , Publish Date - Sep 14 , 2024 | 12:25 AM

జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఈనెలాఖరు దాకా ప్రత్యామ్నాయ పంటలు సాగుకు అదును సమయం ఉంది. ఎర్రనేలల్లో పంటలు సాగు చేయడానికి రైతులు అన్ని పనులు పూర్తి చేసి, వాన కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని యాడికి మండలంలో పచ్చజొన్న, పెద్దవడుగూరు మండలంలో కొర్ర, పత్తి పంటలు సాగు చేశారు. మిగతా ప్రాంతాల్లో వర్షం వస్తే ఉలవ సాగు చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నా రు. అయితే ...

Alternative crops : ప్రత్యామ్నాయమూ అంతే..!
Green maize crop sprouted in Yadiki

ముందుకు సాగని ప్రత్యామ్నాయ పంటల సాగు...!

తొలుత భారీ వర్షాలు.. ఆపై కురవక ఇబ్బందులు

పలు ప్రాంతాల్లో పచ్చజొన్న, ఉలవ, కొర్ర సాగు

విత్తనాల కోసం అరకొరగానే రిజిస్ర్టేషన

రబీ సీజనలో పంటల సాగు కోసం నిరీక్షణ

జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఈనెలాఖరు దాకా ప్రత్యామ్నాయ పంటలు సాగుకు అదును సమయం ఉంది. ఎర్రనేలల్లో పంటలు సాగు చేయడానికి రైతులు అన్ని పనులు పూర్తి చేసి, వాన కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని యాడికి మండలంలో పచ్చజొన్న, పెద్దవడుగూరు మండలంలో కొర్ర, పత్తి పంటలు సాగు చేశారు. మిగతా ప్రాంతాల్లో వర్షం వస్తే ఉలవ సాగు చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నా రు. అయితే ప్రస్తుతం పదును వర్షం పడే సూచనలు లేవని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగు కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- అనంతపురం అర్బన


గత నెలలో భారీ వర్షం వల్లే..

జిల్లా వ్యాప్తంగా గత నెలలో 16నుంచి 20దాకా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. భూమిలో తేమ శాతం అధికం కావడంతో అప్పట్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయలేకపోయారు. ఖరీఫ్‌ సీజనలో కూడా వాన రాకపోవడంతో ఆశించిన స్థాయిలో ప్రధాన పంటలు సాగు చేయ లేదు. ఈనెలాఖరు దాకా నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అక్టోబరు నుంచి ఈశాన్య రుతుపవన కాలం మొదలుకానుంది. అయితే వీటి ప్రభావంతో జిల్లాలో పెద్దగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈక్రమంలోనే అనేక మంది రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయంతో వెనుకంజ వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రబీ సీజన కోసం నల్లరేగడి భూముల రైతుల నిరీక్షణ

అక్టోబరు నుంచి రబీ సీజన ఆరంభం కానుంది. సాధారణంగా రబీ సీజన లో నల్లరేగడి భూముల్లో అత్యధికంగా పప్పుశనగ, ధనియాలు, తెల్ల కుసుమ, నువ్వుల పంటలు సాగు చేస్తారు. ప్రస్తుతం జొన్న, కొర్ర, ఉలవ, అలసంద వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే రబీ సీజనలో అసలైన పంటలు పప్పుశనగ, ధనియాలు వంటి పంటలు సాగు చేయలే మన్న కారణంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయలేదని సమాచారం. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసిన తర్వాత కోత దశకు రావాలంటే 60 నుంచి 80 రోజుల సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో నల్లరేగడి భూముల రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపడం లేదని తెలిసింది.

అరకొరగానే రిజిస్ట్రేషన

ఈ ఏడాది జిల్లాకు 27907 క్వింటాళ్ల ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు కేటాయించారు. ఇందులో ఉలవలు 21791 క్వింటాళ్లు, పెసలు 1501, అలసంద 3253, జొన్న 973, కొర్ర 369, మినుములు 20 క్వింటాళ్లు ఉన్నాయి. ఆయా విత్తనాలకు 80 శాతం సబ్సిడీని వర్తింపజేశారు. గత నెల 27 నుంచి రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యామ్నాయ పంటల విత్తనాల కోసం రైతుల పేర్ల నమోదు ప్రక్రియ మొదలు పెట్టారు. ఈనెల 5 నుంచి సబ్సిడీ విత్తనాల పంపిణీ ఆరంభించారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాల కోసం రైతులు తమ పేర్లు రిజిస్ర్టేషన చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పటి దాకా జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో 6016 మంది రైతులు 1892 క్వింటాళ్ల ప్రత్యామ్నాయ విత్తనాల కోసం రిజిస్ర్టేషన చేసుకోగా ఆయా రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 14 , 2024 | 12:25 AM