Tamota : టమోటా పండుతోంది..!
ABN , Publish Date - Sep 20 , 2024 | 12:11 AM
టమోటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రైతులకు ఊరట లభిస్తోంది. మార్కెట్‌లో 25 కిలోల బాక్సు గురువారం రూ.600 నుంచి రూ.800 వరకు ధర పలికింది. ఈ మాత్రం ధరలు నిలకడగా కొనసాగితే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. యాడికి, రాయలచెరువు, లక్షుంపల్లి, వెంగన్నపల్లి తదితర గ్రామాల్లో 150 ఎకరాల్లో టమోటా సాగుచేశారు. ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారు. వాతావరణం, ధరలు అనుకూలిస్తే టమోటా సాగు లాభదాయకమే. కానీ ప్రతికూల పరిస్థితులు ఎ...
25 కిలోల బాక్స్ రూ.800
ఇవే ధరలు కొనసాగితే లాభాలే
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
యాడికి, సెప్టెంబరు 19: టమోటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రైతులకు ఊరట లభిస్తోంది. మార్కెట్‌లో 25 కిలోల బాక్సు గురువారం రూ.600 నుంచి రూ.800 వరకు ధర పలికింది. ఈ మాత్రం ధరలు నిలకడగా కొనసాగితే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. యాడికి, రాయలచెరువు, లక్షుంపల్లి, వెంగన్నపల్లి తదితర గ్రామాల్లో 150 ఎకరాల్లో టమోటా సాగుచేశారు. ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారు. వాతావరణం, ధరలు అనుకూలిస్తే టమోటా సాగు లాభదాయకమే. కానీ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పైసా కూడా తిరిగి రాదు. పంట మొత్తం దిబ్బలో పడేయాల్సి వస్తుంది. ఈ సీజర్ ఆరంభంలో ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు నష్టపోయారు. వారం రోజుల నుంచి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని అంటున్నారు.
తగ్గుతూ.. పెరుగుతూ..
నెలరోజుల క్రితం టమోటా ధరలు బాక్స్ రూ.100 నుంచి గరిష్ఠంగా రూ.200 పలికాయి. దీంతో రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. వారం క్రితం బాక్స్ ధర రూ.400 మాత్రమే పలికింది. గ్రేడింగ్ ప్రకారం ప్రస్తుతం బాక్స్ రూ.600 నుంచి రూ.800 వరకు పలుకుతోంది. జిల్లాలో వర్షాభావం కారణంగా దిగుబడి తగ్గుతోందని, ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యాడికి మండల రైతులు అనంతపురం, నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్‌కు ఎక్కువగా టమోటాను తరలిస్తుంటారు. తక్కువ దిగుబడి ఉన్న రైతులు తాడిపత్రి, గుత్తి ప్రాంతాలకు తరలించి, అక్కడి వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ప్యాపిలి మార్కెట్ ఎక్కువగా జరుగుతుందని, అయితే అక్కడ షూట్ ఉంటుందని తెలిపారు. వంద బాక్స్‌ల టమోటాకు 5 బాక్స్‌లు షూట్ కింద తీసుకుంటారని రైతులు తెలిపారు. వ్యాపారం ఎక్కువగా జరుగుతుండడంతో ధరలు కూడా బాగానే ఉంటాయని రైతులు తెలిపారు.
ఇవే ధరలు ఉంటే లాభాలే..
రెండు ఎకరాల్లో టామోటా సాగుచేశాను. పంట దిగుబడి చేతికి వస్తోంది. వారం క్రితం బాక్స్ రూ.400 ప్రకారం విక్రయించాను. ప్రస్తుతం సైజ్‌ను బట్టి బాక్స్ రూ.600 నుంచి రూ.800 వరకు ధర పలుకుతోంది. ఇవే ధరలు నిలకడగా కొనసాగితే మాకు లాభాలు వస్తాయి. టమోటా ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
- శేఖర్, రాయలచెరువు
నాలుగు ఎకరాల్లో సాగుచేశాను
నాలుగు ఎకరాల్లో టమోటా సాగుచేశాను. రెండు ఎకరాల్లో పంట ఇప్పటికే పూర్తయింది. మరో రెండు ఎకరాలలో దిగుబడి రావడం మొదలైంది. వారం క్రితం నుంచి టమోటా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం బాక్స్ ధర రూ.600 నుంచి రూ.800 వరకు నడుస్తోంది. ఇవే ధరలు ఉంటే గిట్టుబాటు అవుతుంది. రైతులం గట్టెక్కుతాము.
- రామాంజనేయులురెడ్డి, వెంగన్నపల్లి
మరిన్ని అనంతపురం వార్తల కోసం....