Apaar : ఈ అధికారులకు ఏమైంది..!
ABN , Publish Date - Nov 07 , 2024 | 12:23 AM
‘తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్లుగా తయారైంది ‘అపార్’ వ్యవహారం. విద్యార్థులకు అపార్ ఐడీ క్రియేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అన్ని పాఠశాలల్లో ఆ ప్రక్రియను ప్రారంభించారు. దీనికోసం విద్యార్థుల జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్, తల్లిదండ్రుల ఆధార్ తీసుకురమ్మంటున్నారు. అన్నింట్లో వివరాలు ఒకేలా ఉండాలని చెబుతున్నారు. ఏ కొద్దిమందివో తప్ప.. సర్టిఫికెట్లు, ఆధార్‌లు ఏకరూపంగా లేవు. చిన్న చిన్న తేడాలున్నా సరిచేసుకుని ...
అపార్ కష్టాలు పట్టనే పట్టవా..?
విద్యార్థులు, తల్లిదండ్రులకు నరకం
ఆధార్ కేంద్రాల్లో మొరాయిస్తున్న సర్వర్లు
బ్యాంకులు, మీ సేవల్లో తెలిసినవారికే టోకెన్లు
హెడ్ పోస్టాఫీసుకు క్యూ కడుతున్న జనం
అక్కడ ఉన్నది ఒక డివైజ్.. ఒక ఉద్యోగి..!
అనంతపురం ప్రెస్‌క్లబ్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్లుగా తయారైంది ‘అపార్’ వ్యవహారం. విద్యార్థులకు అపార్ ఐడీ క్రియేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అన్ని పాఠశాలల్లో ఆ ప్రక్రియను ప్రారంభించారు. దీనికోసం విద్యార్థుల జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్, తల్లిదండ్రుల ఆధార్ తీసుకురమ్మంటున్నారు. అన్నింట్లో వివరాలు ఒకేలా ఉండాలని చెబుతున్నారు. ఏ కొద్దిమందివో తప్ప.. సర్టిఫికెట్లు, ఆధార్‌లు ఏకరూపంగా లేవు. చిన్న చిన్న తేడాలున్నా సరిచేసుకుని రావాలని పాఠశాలల్లో సూచిస్తున్నారు. ఇక్కడే తల్లిదండ్రులు, విద్యార్థులకు కష్టాలు మొదలౌతున్నాయి. మీసేవ కేంద్రాలు, ఆధార్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. రోజుల తరబడి తిరుగుతున్నా పని జరగడం లేదు. సర్వర్,
టోకెన, రద్దీ.. ఇలా అన్నీ సమస్యలే. ‘అపార్ ఐడీ’ మంచి పద్ధతే అయినా.. క్షేత్రస్థాయిలో తగిన ఏర్పాట్లు చేయకుండా ‘మీ చావు మీరు చావండి’ అన్నట్లు అధికారులు వ్యవహరించడం ఏమిటో..! జిల్లా కేంద్రం, అన్ని పట్టణాలలోని మీ సేవ కేంద్రాలు, ఆధార్ సెంటర్లలో గొడవలు కూడా మొదలయ్యాయి. అయినా జిల్లా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదు. నగరంలోని పలు ఆధార్ కేంద్రాలను ఆంధ్రజ్యోతి బుధవారం పరిశీలించింది. ఎవరిని పలకరించినా ఆగ్రహం, ఆవేదన, నిస్సహాయత కనిపించింది. అధికారుల తీరును పలువురు ఎండగట్టారు.
నగరంలో నరకం
అనంతపురంలోని పలు ఆధార్ సెంటర్లలో సర్వర్లు మొరాయిస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా.. ‘క్లాక్ టవర్ పోస్టాఫీస్ వద్దకు వెళ్లండి’ అని నిర్వాహకులు చెబుతున్నారు. పోస్టాఫీసు వద్ద వందలాది మంది బారులు తీరుతున్నారు. అక్కడ రోజుకు వంద మందికి మాత్రమే టోకన్లను అందజేస్తున్నారు. దీంతో మిగిలినవారు వెనుదిరగాల్సి వస్తోంది. పోస్టాఫీస్ ఆధార్ కేంద్రంలో ఒక డివైజ్ మాత్రమే ఉంది. ఒక ఉద్యోగి మాత్రమే ఆధార్ సేవలు అందిస్తున్నారు. దీనికితోడు సర్వర్ మొరాయిస్తోంది. పోస్టాఫీసులో బుధవారం మధ్యాహ్నం వరకూ లాగిన సమస్య ఏర్పడింది. విద్యార్థులు, తల్లిదండ్రులు అక్కడే పడిగాపులు కాశారు. జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 50 టోకన్లను మాత్రమే ఇస్తున్నారు. అవీ తెలిసినవారికి, సిఫార్సులు ఉన్నవారికి లోలోన ఇచ్చేస్తున్నారు. క్యూలో ఉన్నవారికి 20 టోకన్లు కూడా ఇవ్వడం లేదు. మిగిలినవారిని తిప్పిపంపుతున్నారు. జిల్లా కేంద్రంలో ఆధార్ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిన్న చిన్న తేడాలున్నా..
అపార్ కోసం పాఠశాల రికార్డు, బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌లో పేరు, ఇంటిపేరు సహా అన్ని వివరాలు ఒకేలా ఉండాలన్న నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమస్యలన్నింటికీ కారణమౌతోంది. బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌లో పేర్ల సవరణ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇంటి పేరు, పేరు మధ్యలో గ్యాప్, పేరులో తప్పులు.. ఇలా ఏవైనా సరే సరిచేసుకోవాల్సి వస్తోంది. చదువురాని తల్లిదండ్రులు ఆధార్ కేంద్రాలలో దరఖాస్తులను నింపేందుకు తంటాలు పడుతున్నారు. ఆధార్ సెంటర్లలో సరిపడా సిబ్బంది కూడా లేరు. పల్లెల నుంచి వచ్చేలోగా నగరంలో టెకెన్లు అయిపోతున్నాయి. క్యూలో ఉన్న నగరవాసులకూ మొండిచేయి చూపుతున్నారు. విద్యార్థుల రద్దీ నేపథ్యంలో మిగిలిన అవసరాల కోసం ఆధార్ కేంద్రాలకు వచ్చేవారిని అనుమతించడం లేదు. ‘ఓన్లీ స్టూడెంట్స్’ అని తిప్పి పంపుతున్నారు.
ఉన్నతాధికారులకు పట్టదా..?
అపార్ కష్టాలు కొనసాగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించడం లేదు. మీసేవ, పోస్టాఫీస్, బ్యాంకులు.. ఇలా ఆధార్ సేవలు అందించే ఏ ఒక్క సెంటర్‌కు వెళ్లినా విద్యార్థులు, తల్లిదండ్రుల కష్టాలు కళ్లకు కడతాయి. కానీ ఈ సమస్య తమది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్, జేసీ చొరవ చూపితేగానీ ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారం కాదని తల్లిదండ్రులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయకుండా ఇలా డెడ్‌లైన పెట్టి వేధించడం ఏమిటని మండిపడుతున్నారు.
రెండు రోజులు తిరిగాను..
ఆధార్‌లో సర్ నేమ్ మార్పుకోవాల్సి ఉంది. ఎక్కడికి వెళ్లినా పని జరగడం లేదు. పోస్టాఫీసులో చేస్తారని చెబితే రెండు రోజులుగా టోకెన కోసం వస్తున్నాం. ఈ రోజు టోకన ఇచ్చారు. కాలేజీకి వెళ్లడం మానేసి ఆధార్ సెంటర్‌ల చుట్టూ తిరుగుతున్నాను. అప్లికేషనలో ఏ బాక్సుల్లో పేరు రాయాలో అర్థం కావడం లేదు. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్పడం లేదు. - విహాస్, ఇంటర్ విద్యార్థి
నాలుగు రోజులుగా తిరుగుతున్నాం..
నా కూతురు ఆధార్‌లో పేరు మార్చుకునేందుకు పోస్టాఫీసుకు నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నాం. టోకన్లు దొరకలేదు. ఈ రోజు కూడా వచ్చాం. ఇప్పుడు టోకన్లు అయిపోయానాయి అంటున్నారు. మా ఊళ్లో ఆధార్ కేంద్రం లేదు. మళ్లీ రేపు రావాల్సిందే. వచ్చిపోయే చార్జీలకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. పనులు మానుకుని వస్తున్నాం. ఏం చేస్తాం? పాప చదువుకోసం కదా..? మళ్లీ రేపు వస్తాం. అధికారులు స్పందించి పల్లెల్లోనే ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
- ఓబులమ్మ, వై.కొత్తపల్లి, ఆత్మకూరు
టోకెన్లు దొరడకం లేదు..
నా బిడ్డ ఆధార్ కార్డులో పేరు మార్చాలని చెప్పారు. మా ఊరిలో ఆధార్ సెంటర్లు లేవు. నాలుగు రోజుల నుంచి పోస్టాఫీసుకి వస్తున్నాను. ఎప్పుడొచ్చినా టోకెన్లు అయిపోయినాయి అంటున్నారు. తెల్లారుజామున వచ్చినా కూడా టోకన్లు లేవంటున్నారు. ఈ రోజు వస్తే 9వ తేదీ వరకూ టోకన్లు అయిపోయాయి అంటున్నారు. తొందరగా పేరు మార్పించుకురావాలిని అని నా కూతురుకు స్కూల్లో చెబుతున్నారంట. ఏం చేయాలో అర్థం కావడంలేదు.
- మారెన్న, వై.కొత్తపల్లి, ఆత్మకూరు
పేరులో కొంచెం గ్యాప్ ఉంది..
నా కూతురు ఆధార్‌లో పేరు ఒక లెటర్‌కి గ్యాప్ వచ్చింది. దీంతో అపార్‌కు సెట్ కాదన్నారు. యాక్సిస్ బ్యాంకులోకి వెళ్లి అడిగితే టోకన్లు లేవంటున్నారు. నా ముందరే మళ్లీ టోకన్లు ఇస్తున్నారు. ఇదేమని అడిగితే ఏవేవో సమాధానాలు చెబుతున్నారు. ఆధార్ సెంటర్ నిర్వాహకులే ఇలా చేస్తే విద్యార్థుల సమస్యలు ఎలా తీరుతాయి..? అపార్ ప్రజెంట్ పీక్‌లో ఉంది. జిల్లా అధికారులు స్పందించి అదనపు ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.
- లింగన్న, ఉపాధ్యాయుడు, నార్పల
ఎక్కడ ఏం రాయాలో..
నా మనవడికి ఆధార్‌లో ఇంటి పేరు పూర్తీగా లేదంట. అది మార్పించుకోమని స్కూల్లో సారోళ్లు చెప్పారంట. ఇక్కడికొస్తే టోకన ఇవ్వకుండా మూడు రోజులు తిప్పినారు. ఈరోజు వచ్చినాం. అప్లికేషన ఇచ్చి దాంట్లో పూర్తి పేరు రాసుకుని, ఫిలప్ చేసుకుని రమ్మన్నారు. నా మనవడు పిల్లోడు. వాడికి అర్థం కాలేదు. నాకు చదువు రాదు. ఏంది ఎక్కడ రాయల్లో అర్థం కాలేదు సామీ. ఎవరిని అడిగినా వాళ్ల వాళ్ల పనుల్లో ఉన్నారు. కొంతమంది కసురుకుంటున్నారు. మాలాంటి చదువురానోళ్లకు ఎవరైనా చెప్పేవాళ్లు లేకపోతే ఎట్ల..?
- వెంకటరమణ, వృద్ధుడు, నవోదయ కాలనీ
మరిన్ని అనంతపురం వార్తల కోసం....