Share News

Pending Bills : ఇంకానా..

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:11 AM

గత తెలుగుదేశం హయాంలో నీరు-చెట్టు పథకం కింద పనులు చేసిన వారు బిల్లుల కోసం ఇంకా ఎదురుచూడక తప్పట్లేదు. 2014 నుంచి 2019 వరకు నీరు-చెట్టు కింద పనులు చేశారు. తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఆపేశారు. ఐదేళ్లూ అలానే గడిపేశారు. దీంతో అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు...

Pending Bills : ఇంకానా..

నీరు-చెట్టు బిల్లుల కోసం తప్పని నిరీక్షణ

గత టీడీపీ హయూంలో పనులు

రూ.కోటలో పెండింగ్‌

ఐదేళ్లూ చెల్లించని వైసీపీ ప్రభుత్వం

కూటమి పాలన వచ్చినా లభించని మోక్షం

గత తెలుగుదేశం హయాంలో నీరు-చెట్టు పథకం కింద పనులు చేసిన వారు బిల్లుల కోసం ఇంకా ఎదురుచూడక తప్పట్లేదు. 2014 నుంచి 2019 వరకు నీరు-చెట్టు కింద పనులు చేశారు. తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఆపేశారు. ఐదేళ్లూ అలానే గడిపేశారు. దీంతో అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు. ఇంట్లోని బంగారం తాకట్టుపెట్టి, వడ్డీ చెల్లిస్తూ.. కాలం నెట్టుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బిల్లులు వెంటనే వస్తాయని కాంట్రాక్టర్లు ఆశించారు.


అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తయినా ఇప్పటికీ ఆ బిల్లులకు మోక్షంలేదని వారు వాపోతున్నారు.

-ఆంధ్రజ్యోతి, హిందూపురం

మూడు మండలాల్లో పెండింగ్‌

హిందూపురం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో రూ.4కోట్లకుపైగా బకాయిలున్నట్లు ఇరిగేషన అధికారుల ద్వారా తెలుస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక బిల్లుల చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి. అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారేనన్న ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హిందూపురం నియోజకవర్గంలో రూ.4కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.2.5కోట్లు నీరు-చెట్టువి కాగా.. రూ.1.5కోట్లు జైక ఏపీఐఐసీబీ పథకం కింద పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నాయి. లేపాక్షి మండలంలో చేసిన కొన్ని పనులకు మాత్రం కోర్టుకెళ్లడంతో రూ.6లక్షల బిల్లులు విడుదలయ్యాయి.

టీడీపీ నాయకులు కావడంతోనే..

గత టీడీపీ హయాంలో నీరు-చెట్టు కింద పెద్దఎత్తున పనులు చేశారు. చాలామంది కాంట్రాక్టర్లు అప్పులు చేసి, పనులు పూర్తి చేశారు. ఇంతలోనే 2019 ఎన్నికలు రావడంతో బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి, అధికారం చేపట్టింది. నీరు-చెట్టు పనుల బెల్లుల చెల్లింపులను పూర్తిగా ఆపేసింది. బిల్లులు ఇవ్వాలని అధికారులు, ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో పనులు చేసిన వారంతా టీడీపీ సానుభూతిపరులేనన్న ఉద్దేశంతో వైసీపీ పాలకులు బిల్లుల చెల్లింపును ఆపేశారు. కమిటీలు, విచారణల పేరుతో ఐదేళ్లూ కాలం వెల్లదీశారు. అప్పులు తెచ్చి పనులు చేసిన కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక నానా అవస్థలు పడ్డారు. కొందరు ఆస్తులు అమ్ముకుంటే, ఇంకొందరు ఇంట్లో బంగారాన్ని విక్రయించుకున్నారు. కొంతమందికి ప్రస్తుతం బిల్లులు వచ్చినా వడ్డీలకే చాలని దుస్థితి నెలకొంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కూటమి అధికారంలోకి రాగానే వడ్డీతో సహా బకాయిలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ హామీ ఇచ్చారు. ఆ మేరకు వెంటనే బిల్లులు చెల్లిస్తే కొంతవరకైనా తమకు న్యాయం చేకూరుతుందని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. గత నెలలో బిల్లులు పడతాయని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అయినా ఇప్పటి వరకు జమకాకపోవడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినా తాము బిల్లుల కోసం ఎదురుచూడటం ఏంటని వారు వాపోతున్నారు.

రూ.4కోట్లదాకా పెండింగ్‌

2014నుంచి 2019వరకు నీరు చెట్టు కింద రూ.2.5కోట్లదాకా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జైకా, ఏపీఐఐసీపీ కింద మరో రూ.1.5కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల లేపాక్షి, చిలమత్తూరు, పరిగి మండలాలకు సంబంధించి కొంతమేర బిల్లులు మంజూరయ్యాయి. మిగిలిన వాటిని త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పింది.

-యోగానంద్‌, డీఈ, ఇరిగేషన

Updated Date - Nov 14 , 2024 | 12:11 AM