Andhra Government : మిగిలేది ‘కిక్కే’!
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:05 AM
మద్యం ధరలు షాక్ కొట్టే స్థాయిలో పెంచుతామన్న గత సీఎం జగన్ అన్నట్టుగానే మందుబాబుల జేబులు ఖాళీ చేశారు.
మద్యం విక్రయాలతో ఆదాయం తక్కువే
జగన్ జమానాలో మందుబాబుల జేబులు ఖాళీ
నిషేధం పేరిట ఆ ఐదేళ్లూ మోసం.. తక్కువ అమ్మినా అధిక ఆదాయం
కూటమి కొత్త పాలసీతో సీన్ రివర్స్.. విక్రయాలకు తగ్గట్టు లేని లెక్కలు
రూ.99కే మద్యం, ధరలు తగ్గింపుతో ఖజానాకు తగ్గిన రాబడి
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
మద్యం ధరలు షాక్ కొట్టే స్థాయిలో పెంచుతామన్న గత సీఎం జగన్ అన్నట్టుగానే మందుబాబుల జేబులు ఖాళీ చేశారు. నచ్చినట్టుగా మద్యం ధరలు పెంచి వినియోగదారులను దోపిడీ చేశారు. మందు అలవాటున్న రోజుకూలీల కూలి మొత్తం మద్యానికే లాగేశారు. అయితే అదంతా మద్యపాన నిషేధంలో భాగం అని మొదట్లో కలరింగ్ ఇచ్చినా చివరికి నిషేధం లేదని తేల్చేశారు. అయితే, కూటమి ప్రభుత్వంలో సీన్ రివర్స్ అయ్యింది. పెంచిన మద్యం ధరలను తగ్గించి, నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామన్న కూటమి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంది. మద్యంపై పన్నులను పునర్‌వ్యవస్థీకరించి ‘క్వార్టర్ రూ.99కే మద్యం అందుబాటులోకి తెచ్చింది. అలాగే మరో పదకొండు రకాల బ్రాండ్ల ధరలను తగ్గించేలా ఇప్పటికే చర్యలు తీసుకుంది. దీంతో గత ప్రభుత్వంతో పోలిస్తే అమ్మకాలు పెరిగినా ఆదాయం తగ్గింది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పేద వినియోగదారులు అటువైపు మళ్లారు. ఫలితంగా వారి జేబులు ఖాళీ అయ్యే ప్రక్రియకు ఫుల్‌స్టాప్ పడింది.
ఇదీ వ్యత్యాసం
2023 డిసెంబరులో 25,83,530 కేసుల లిక్కర్, 6,24,377 కేసుల బీరు విక్రయించారు. దాని విలువ రూ.2,185కోట్లు. ఈ ఏడాది డిసెంబరులో 30,46,362 కేసుల లిక్కర్, 9,11,815 కేసుల బీరు అమ్మారు. దీని విలువ రూ.2,236కోట్లు. గతేడాదితో పోలిస్తే 4,62,832 కేసుల లిక్కర్, 2,87,438 కేసుల బీరు అమ్మకాలు పెరిగాయి. అంటే 18శాతం లిక్కర్, 45శాతం బీరు అమ్మకాలు పెరిగాయి. కానీ విలువ పరంగా చూస్తే మాత్రం కేవలం రూ.51(2.4శాతం) కోట్లు మాత్రమే పెరిగింది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గిపోయింది.
మద్యం అమ్మకపు విలువలో 75శాతానికి పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది మారకపోయినా ప్రభుత్వం ముందుగానే పన్నులను పునర్‌వ్యవస్థీకరించడంతో మద్యం ధరలు తగ్గాయి. కేవలం రూ.99కే క్వార్టర్ మద్యాన్ని తీసుకురావడంతో వాటిలో వచ్చే పన్నులు భారీగా తగ్గిపోయాయి. అలాగే రూ.120 నుంచి రూ.150 మధ్య ధరలున్న మద్యంపైనా తక్కువ ఆదాయమే వస్తోంది.
నిషేధం చేయకుండా ఆదాయం
గత వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం విషయంలో ప్రజలను మోసం చేసింది. అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్య నిషేధం చేస్తామన్న నాటి ప్రభుత్వం, అందులో భాగమేనంటూ ధరలు భారీగా పెంచింది. కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత ఒకేసారి ధరలు రెట్టింపు చేసింది. అయితే అదంతా ప్రజల కోసమేనని, మద్యం తాగకూడదనే ఉద్దేశంతో ఆ స్థాయిలో రేట్లు పెం చినట్లు నాటి వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. ధరలు రెట్టింపు కంటే ఎక్కువ పెరగడం తో అమ్మకాలు పడిపోయాయి. వాస్తవానికి అది జరగాలనే కోరుకున్నట్టు అప్పటి ప్రభుత్వం చెప్పింది. కానీ ఒకేసారి అమ్మకాలు పడిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది. మద్యం ఆదాయంపై ఎక్కువగా ఆధారపడిన జగన్ ప్రభుత్వం....చెప్పిన మాటపై నిలబడకుండా పెంచిన ధరలను క్రమంగా తగ్గి స్తూ వచ్చింది. ధర ఎక్కువైనా ప్రజలు కొనుగోలు చేయగలరు అనే స్థాయి వరకు వాటిని తగ్గించింది. అలా మద్య నిషేధం చేయకుండా, ధరలు అందుబాటులో ఉంచకుండా, మధ్యస్థం గా ధరలు పెంచి దోపిడీ చేసిం ది. ప్రభుత్వం మారాక ఆ వ్యత్యా సం స్పష్టంగా కనిపిస్తోంది.
నేడు, రేపు అర్ధరాత్రి వరకూ మద్యం
రాత్రి 1 గంట వరకు సమయం పెంపు
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల సమయాన్ని ఎక్సైజ్ శాఖ పెంచింది. మద్యం షాపులు, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు అనుమతిచ్చింది. దీనిపై మంగళవారం ఉత్తర్వు లు జారీచేయనుంది. సాధారణంగా రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉం టుంది. షాపులు, బార్లు అందుబాటులో లేకపోతే మందుబాబులు బెల్టు షాపుల్లో మ ద్యం కొనుగోలు చేస్తున్నారు. అక్కడ ఒక్కో సీసాపై అదనంగా రూ.50కి పైగా వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు పై విధంగా నిర్ణయం తీసుకున్నారు.
గంట గంటకో ఫొటో!
చెక్‌పోస్టులు, మొబైల్ పార్టీలు పంపాలి
న్యూఇయర్ సందర్భంగా ఎక్సైజ్ తనిఖీలు
నూతన సంవత్సరం సందర్భంగా బయటి రాష్ర్టాల మద్యం(ఎన్‌డీపీఎల్) రాష్ట్రంలోకి రాకుండా ఎక్సైజ్ శాఖ పకడ్బందీ చర్య లు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి 2 రోజులపాటు సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు, బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీల ను అప్రమత్తం చేసింది. ఎక్కడా ఎన్‌డీపీఎల్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తనిఖీలు చేయాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ ఆదేశాలు జారీచేశారు. ప్రతి గంటకూ తనిఖీలు చేసి ఫొటోలు ఎక్సైజ్ వాట్సాప్ గ్రూపులో ప్రతి చెక్‌పోస్టు, మొబైల్‌పార్టీ పెట్టాలని స్పష్టంచేశారు. షిఫ్టుల వారీగా రాత్రీ పగలు తనిఖీలు కొనసాగుతాయన్నారు. అలాగే, న్యూఇయర్ పేరుతో అదనపు వసూళ్లు చేసేవారిపైనా నిఘా పెట్టారు.