Share News

Bilateral Relations : రాష్ట్రంలో జపనీస్‌ జెన్‌ గార్డెన్‌!

ABN , Publish Date - Dec 25 , 2024 | 03:30 AM

ఆంధ్రప్రదేశ్‌-జపాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే దిశగా మరో ముందడుగు పడింది. జపాన్‌లోని టోయామా ప్రిఫెక్చర్‌ ప్రాంత గవర్నర్‌ హచిరో నిట్టా నేతృత్వంలో 14 మంది సభ్యుల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చింది.

Bilateral Relations : రాష్ట్రంలో జపనీస్‌ జెన్‌ గార్డెన్‌!

  • టోయామాతో ఒప్పందం పునరుద్ధరణ

  • రాష్ట్రానికి వచ్చిన ప్రిఫెక్చర్‌ గవర్నర్‌

  • కీలక రంగాల్లో పెట్టుబడులు, సహకారం

  • ఏపీ-జపాన్‌ సంబంధాలు మరింత బలోపేతం

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌-జపాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే దిశగా మరో ముందడుగు పడింది. జపాన్‌లోని టోయామా ప్రిఫెక్చర్‌ ప్రాంత గవర్నర్‌ హచిరో నిట్టా నేతృత్వంలో 14 మంది సభ్యుల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. ఏపీలో టూరిజం, ఔషధ(ఫార్మాస్యూటికల్స్‌), తయారీ తదితర కీలక రంగాల్లో సహకారం పెంపు లక్ష్యంగా 2015లో చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని(ఎంవోయూ) పునరుద్ధరిస్తూ కొత్త ఎంవోయూపై సంతకాలు చేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌, పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్‌, కళాశాల విద్య డైరెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ(ఏపీఈడీబీ) సీఈవో సీఎం సాయికాంత్‌వర్మలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వాణిజ్య, వ్యాపార రంగాలలో పరస్పర సహకారం, సాంస్కృతిక సంబంధాల పెంపు, డిజిటల్‌ రంగంలో సాంకేతిక సహకారం, ఔషధ రంగంలో సహకారం, విద్యార్థులు, పరిశోధకుల మధ్య అనుసంధానం తదితర అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. 2015 నుంచి ఇరు ప్రాంతాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా టోయామాలో రాష్ట్ర విద్యార్థులకు ఉద్యోగావకాశాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జపనీస్‌ భాషా కేంద్రం ఏర్పాటు, ఔషధ తయారీ రంగంలో సంయుక్త చర్చా వేదికలు కొనసాగుతున్నాయి. తాజా ఒప్పందంతో జపాన్‌తో రాష్ట్ర బంధం మరింత బలపడనుంది. ఒప్పందంలోని అంశాల అమలు పర్యవేక్షణకు ఇరుపక్షాల ప్రత్యేక కార్యనిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేయనున్నాయి.


ఇప్పటికే 25 కంపెనీలు

రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌. యువరాజు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం 25కి పైగా జపాన్‌ కంపెనీలు ఒకే ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద జపనీస్‌ పారిశ్రామిక కేంద్రాల్లో ఇది ఒకటి. ముఖ్యంగా ఔషధ తయారీ రంగంలో జపాన్‌ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది’’ అని చెప్పారు. రాష్ట్రంలో జెన్‌ గార్డెన్‌ను నెలకొల్పాలని, టోయామా ప్రిఫెక్చర్‌ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని టోయామా ప్రిఫెక్చర్‌ గవర్నర్‌ హచిరో నిట్టాను కోరారు. దీనిపై నిట్టా సానుకూలంగా స్పందించారు. రాబోయే నాలుగేళ్లూ తానే పదవిలో కొనసాగుతానని, ఏపీలో ఒక జపనీస్‌ జెన్‌ గార్డెన్‌ ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఇరు ప్రాంతాల విశ్వవిద్యాలయాల మధ్య సహకారం, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, మార్పిడిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. పెట్టుబడుల పరంగా కూడా జపాన్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఇతర పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమిస్తామన్నారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ మాట్లాడుతూ.. కృత్రిమ మేథ(ఏఐ), ఔఽషధ తయారీ రంగాల్లో ఉమ్మడి బృందాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, సృజనాత్మక రంగాల్లో జపాన్‌ చాలా అభివృద్ధి చెందిందని.. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో జపనీస్‌ పాఠశాలలను ప్రారంభించాలని సూచించారు.

Updated Date - Dec 25 , 2024 | 03:30 AM