Andhra Pradesh : 3 గంటలు నిలబడే!
ABN , Publish Date - Aug 04 , 2024 | 04:01 AM
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రాలు ఇవ్వడానికి వేల సంఖ్యలో తరలివచ్చిన అర్జీదారులతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం కిటకిటలాడింది. ప్రతి శనివారం ఆయన పార్టీ కార్యాలయానికి వస్తుండటంతో తమ సమస్యలు నేరుగా వివరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి శనివారం భారీగా ప్రజానీకం తరలివచ్చారు.
గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన చంద్రబాబు
వేల అర్జీదారులతో ఎన్టీఆర్ భవన్ కిటకిట
విశాఖ ఉక్కుకు చంద్రబాబు భరోసా
బాబును చూసి గోనె ప్రకాశరావు కళ్లనీళ్లు
టీడీపీ ఆఫీసుకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే
రేపు కలెక్టర్ల సమావేశం
ఒక్కరోజే నిర్వహణకు నిర్ణయం
దిశానిర్దేశం చేయనున్న సీఎం
గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన చంద్రబాబు
వేల అర్జీదారులతో ఎన్టీఆర్ భవన్ కిటకిట
విశాఖ ఉక్కు సమస్య పరిష్కారానికి
చంద్రబాబు భరోసా
బాబును చూసి కళ్లనీళ్లు పెట్టుకొన్న గోనె ప్రకాశరావు
అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రాలు ఇవ్వడానికి వేల సంఖ్యలో తరలివచ్చిన అర్జీదారులతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం కిటకిటలాడింది. ప్రతి శనివారం ఆయన పార్టీ కార్యాలయానికి వస్తుండటంతో తమ సమస్యలు నేరుగా వివరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి శనివారం భారీగా ప్రజానీకం తరలివచ్చారు.
సీంకువిజ్ఞప్తులు ఇవ్వదల్చినవారు ముందుగా తమ పేర్లు నమోదు చేయించుకోడానికి పార్టీ కార్యాలయం ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా పెట్టింది. సుమారు 500 మంది ముందుగా ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోగా, వీరుగాక ఇంకా వేల సంఖ్యలో అప్పటికప్పుడు తరలివచ్చారు.
కొంతమందిని పార్టీ కార్యాలయం లోపల కలిసిన చంద్రబాబు మిగిలిన వారి వద్దకు తానే వెళ్లి అందరి వద్దా వినతిపత్రాలు తీసుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఎం తిరిగి వెళ్లిపోయే సమయంలోనూ ఇంకా కొంతమంది ఉండిపోయి తోసుకుంటుండటంతో ఆయన కారు దిగి మళ్లీ వినతులు తీసుకున్నారు.
వేల సంఖ్యలో ప్రజలు రావడంతో పార్టీ కార్యాలయంలో తోపులాట జరగకుండా చూడటం పోలీస్ అధికారులకు పెద్ద సమస్యగా మారింది. వీరందరినీ కలవడానికి చంద్రబాబు సుమారు మూడు గంటలపాటు నిలబడే ఉన్నారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత మిగిలినవారి నుంచి ఆయన వినతులు స్వీకరించారు.
విశాఖ ఉక్కును ఆదుకోవాలని వినతి..
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సమస్యపై దృష్టి పెడతానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఫ్యాక్టరీ తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉందని, గతంలో చంద్రబాబు వల్లే కొంత ఊరట వచ్చిందని, ఇప్పుడు కూడా ఆదుకోవాలని కార్మిక సంఘ నేతలు చంద్రబాబును కలిసి విన్నవించారు. ఫ్యాక్టరీ చేయాల్సిన చెల్లింపులకు మూడేళ్ల మారటోరియం ఇప్పించాలని, ఎన్‌ఎండీసీ నుంచి ఆరు నెలలపాటు ఇనుప ఖనిజం అప్పుపై ఇప్పించాలని ఆ ప్రాంత ఎమ్మెల్యే కూడా అయిన పల్లా శ్రీనివాసరావు సీఎంను కోరారు.
దీంతో ప్లాంట్ యాజమాన్యాన్ని పిలిపించి సమీక్ష జరిపి ఏం చేయాలో చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘కేంద్రం కూడా అడిగినంత ఇవ్వలేదు. వాళ్లకూ కొన్ని పరిమితులున్నాయి.
ఆ పరిమితుల్లో ఏం చేయగలరో ప్రయత్నిద్దాం. మీరు కూడా కర్మాగారాన్ని నిలబెట్టడానికి బాగా పనిచేయండి.’ అని చంద్రబాబు సూచించారు. చంద్రబాబును కలవడానికి సీపీఎం, బీజేపీ నేతలు విడివిడిగా వచ్చారు. సీపీఎం బృందంలో విశాఖ నేత నర్సింగరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, అంగన్‌వాడీ వర్కర్ల సంఘం నేత ధనలక్ష్మి తదితరులున్నారు. భవన నిర్మాణ, ఇతర వృత్తుల కార్మికుల సమస్యలపై వారు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త కోట వీరబాబు చంద్రబాబును కలిసి కొన్ని సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.
తెలంగాణ నుంచి..
తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. చంద్రబాబును చూడగానే ఆయన కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల యాక్సిడెంట్ అయిందని, నడుం నొప్పితో నరకం అనుభవిస్తున్నానని, వచ్చే పరిస్థితి లేకపోయినా ఒక విషయం విడిగా మాట్లాడాలని వచ్చానని ఆయన చంద్రబాబుకు చెప్పారు.
ఆప్యాయంగా ఆయన ఆరోగ్య పరిస్థితులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలోని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. తొలుత టీడీపీలో ఉన్న జైపాల్ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు.
అమరావతికి దివ్యాంగుడి 25 వేల విరాళం..
పక్కనున్నవారు పట్టుకోకుండా నడవడం సాధ్యం కాని దివ్యాంగుడు జీవన్ కుమార్ టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి అమరావతి కోసం రూ.25 వేలు విరాళం ఇచ్చారు. ఆయనది చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్ళపల్లి గ్రామం.
ఎన్నికల్లో టీడీపీ గెలవాలని అతి కష్టంగానే కొండెక్కి దేవుడిని ప్రార్థించానని జీవన్ కుమార్ చెప్పగా, చంద్రబాబు అభినందించారు. పలువురు దాతలు రాజధానికి, అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చారు. రాజధాని కోసం కృష్ణా జిల్లా కంకిపాడు రైతు ఎన్.ప్రభాకరరావు రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన వృద్ధురాలు జీవీ మాణిక్యమ్మ తన చేతి బంగారు గాజులు, భగవద్గీత గ్రూప్ తరఫున నిర్మల అనే వృద్ధురాలు రూ.3.42 లక్షలు, చిత్తూరుకు చెందిన వల్లేరు వెంకటేశ్ నాయుడు రూ.లక్ష విరాళం ఇచ్చారు.