CM Chandrababu: వారి తాట తీస్తాం.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్..
ABN , Publish Date - Dec 20 , 2024 | 07:39 PM
గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, భూ కబ్జాలతో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. శుక్రవారం నాడు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లు గ్రామంలో..
అమరావతి, డిసెంబర్ 20: గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, భూ కబ్జాలతో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. శుక్రవారం నాడు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లు గ్రామంలో రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారాయన. బాధితుల భూమిని బాధితులకు అప్పగించే అంశంపై పట్టుదలతో ఉన్నానని సీఎం చెప్పారు. ప్రతీ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, భూ కబ్జాలతో ఇంకా చాలా సమస్యలు పరీష్కరించాల్సి ఉందని సీఎం చెప్పారు. ఏ నాయకుడూ చేయని విధ్వంసం చేసిన జగన్ చేశాడని ఆరోపించారు. ప్రజల జీవితాలను అంధకారంలో కి నెట్టారని విమర్శించారు. ఇప్పటి వరకు లక్షన్నరకు పైగా అర్జీలు తన వద్దకు వస్తే.. అందులో 57శాతం రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉన్నాయన్నారు. 22ఏ నిబంధనను అడ్డుపెట్టుకుని.. వైసీపీ నాయకులు ఎంతోమందిని బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేశారని సీఎం పేర్కొన్నారు. ప్రజల భూపత్రాలపై తన బొమ్మ వేసుకున్న జగన్‌ను ఏమనాలో కూడా అర్థం కావడం లేదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఇష్టానుసారంగా రికార్డులు మార్చాలని చూశారన్నారు. ఈ చట్టంతో దుర్వినియోగమే ఎక్కువ ఉందని గుర్తించి.. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఈ చట్టాన్ని రద్దు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు.
తాట తీస్తాం..
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అవసరమైతే చట్ట సవరణ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎవరైనా సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. కబ్జా చేసేందుకు భూమి దగ్గరకు వెళ్లినప్పుడే జైలు కూడా కనిపించేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా తప్పు చేసిన వారిపై పీడీయాక్ట్ పెట్టి కేసులు నమోదు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నవ్వాలంటేనే భయపడిపోయే ప్రజల ముఖాల్లో నేడు సంతోషం చూస్తున్నానని సీఎం పేర్కొన్నారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగించేందుకే రూ.12కోట్లు ఖర్చయిందన్నారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకు రెవెన్యూ సదస్సులో పరిష్కారం చూపుతామని సీఎం చెప్పారు. రెవెన్యు సదస్సుల ద్వారా భూముల సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తన దగ్గరకు ఒక్క అర్జీ కూడా రానప్పుడే రెవెన్యూ శాఖ సమర్థంగా పనిచేసినట్లుగా భావిస్తానన్నారు. ప్రతీ ఫిర్యాదు నమోదు చేసి, జవాబుదారీ తనంగా పనిచేస్తామన్నారు. రికార్డులన్నీ సరిచేశాక కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈడుపుగల్లు బీసీ కాలనీ వాసులు 173మందికి ఇంటి జాగా ఇస్తామని సీఎం ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా 22ఏ లో పెట్టిన భూమిని తిరిగి అసలు లబ్ధిదారులకు అందచేస్తామన్నారు.
Also Read:
ఫార్ములా- ఈ కార్ రేసు.. కేటీఆర్‌కు భారీ ఊరట..
బిగ్ అలర్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన
అసెంబ్లీలో సీఎం రేవంత్ ఉగ్రరూపం..
For More Andhra Pradesh News and Telugu News..