Share News

CM Chandrababu: ప్రజల ఆశలు నెరవేర్చడమే మా కర్తవ్యం.. లేఖలో సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 29 , 2024 | 10:27 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ దారులకు లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని అందులో పేర్కొన్నారు.

CM Chandrababu: ప్రజల ఆశలు నెరవేర్చడమే మా కర్తవ్యం.. లేఖలో సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పెన్షన్ దారులకు లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని అందులో పేర్కొన్నారు. ‘మీ అందరి మద్దతుతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. మీ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యం. ఎన్నికలకు ముందే మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్‌ను ఒకేసారి రూ. 1000 పెంచాం. ఇకపై రూ.4000 పెన్షన్ ఇస్తాం. దివ్యాంగులకు రూ.3000 పెంచి, ఇకపై రూ.6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది అని’ చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.


పెంచిన పెన్షన్ అందిస్తాం

‘28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పెన్షన్ లబ్దిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పెన్షన్లు ఇంటి వద్ద అందిస్తాం. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం. పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతుంది. ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తీసుకొచ్చాం. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం ఆ నాటి అధికార పక్షం మిమ్మల్ని పెన్షన్ విషయంలో ఎంతో క్షోభకు గురిచేసింది. ఆ మూడు నెలలు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చలించిపోయా. మండుటెండలో, వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశా. ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చాం. ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా పెంపును వర్తింప చేసి మీకు అందిస్తున్నాం. మూడు నెలలకు పెంచిన రూ.3000, జూలై నెల పింఛన్ రూ.4000 కలిపి మొత్తం రూ.7000 మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం అని’ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఎన్టీఆర్ పేరుతో పెన్షన్ల పంపిణీ

‘సంక్షేమ పాలకుడు, సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ పేరును పెన్షన్ల కార్యక్రమానికి పెట్టాం. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్దకొచ్చి సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. పెరిగిన పెన్షన్‌తో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజా భద్రత మా బాధ్యత. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నా అని’ ఆ లేఖలో చంద్రబాబు కోరారు.

Updated Date - Jun 29 , 2024 | 10:28 AM